బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

23 Feb, 2014 23:50 IST|Sakshi
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

భైంసా/బాసర, న్యూస్‌లైన్: ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో తీవ్రగాయాలపాలైన అతడిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. అతడి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... నల్లగొండ జిల్లా కనగల్ మండలం గౌరరాం గ్రామానికి చెందిన బి.నాగరాజు బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బీహెచ్-1 భవనం నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకాడు. ఇది గమనించిన విద్యార్థులు ఆవరణలోనే ఉన్న ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. అయితే, ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితోపాటు అంబులెన్సు అందుబాటులోలేదు. ట్రిపుల్ ఐటీ అధికారులూ వెంటనే స్పందించకపోవడంతో తీవ్ర జాప్యం జరిగింది.
 
 

విద్యార్థులు సమాచారం ఇచ్చిన 40 నిమిషాలకు వ్యానును పంపించారు. కానీ, వ్యాను బయటకు వెళ్లేందుకు అనుమతి తీసుకోలేదంటూ సెక్యూరిటీ సిబ్బంది కొద్దిసేపు నిలువరించారు. మరోవైపు తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నాగరాజును నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స చేస్తుండగానే పరిస్థితి విషమించి నాగరాజు మృతిచెందాడు. విషయం తెలిసిన విద్యార్థులు దాదాపు ఆరు వేల మంది ఉదయం 11 గంటలకు భైంసా-బాసర ప్రధాన రహదారిపై బైఠాయించారు. అధికారుల వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్థులు ఆరోపించారు. వీటితోపాటు తాము అనేక సమస్యలతో సతమతమవుతున్నామని, ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి వాతావరణంలో ఇమడలేకనే నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పారు. బాధ్యులను తొలగిస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు భైంసా డీఎస్పీకి స్పష్టంచేశారు. ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆందోళన కొనసాగించారు. కాగా, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం నాగరాజు మృతదేహాన్ని బంధువులు స్వగ్రామానికి తీసుకువెళ్లారు.

 

ఐదుగురు అధికారుల సస్పెన్షన్
 
 విద్యార్థులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తుండటం, రాత్రి వరకు కూడా విరమించకపోవడంతో ఆర్‌జీయూకేటీ రిజిస్ట్రార్ సోమయ్య బాసరకు వచ్చారు. విద్యార్థులతో చర్చించి వారి డిమాండ్ మేరకు ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ రాజేంద్రసాహూ, ఓఎస్‌డీ నారాయణ, డీఈ రాజేశ్వర్, సీఎస్‌వో వాజుద్దీన్, కార్యాలయ అధికారి బద్రిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు శాంతించారు.
 
 పది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా...


 బొమ్మపాల నాగరాజుకు ఇటీవలే మేనత్త కూతురితో పెళ్లి కుది రింది. ఈ నెల 26న వివాహం జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో నిలిచిపోయింది. ఇదే విషయమై శనివారం రాత్రి 8 గం టల సమయంలో తల్లిదండ్రులు వెంకటయ్య, జయమ్మలతో మాట్లాడాడు. మార్చి 5న లగ్నం పెట్టుకోవాలని నాగరాజు తమతో చెప్పాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కూలీనాలీ చేసుకుంటూ కొడుకును చదివించామని, అతని ఇష్టప్రకారమే పెళ్లి నిశ్చయం చేశామని వారు రోదించారు. ఇంతలోనే కనిపించని లోకాలకు వెళ్లిపోయాడని వారు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, నాగరాజు మృతిపై అతని కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి సంఘటన జరిగితే ఆదివారం ఉదయం వరకు చెప్పలేదన్నారు. కళాశాల యాజమాన్యం సరైన సమాచారం ఇవ్వడంలేదని వారు తెలిపారు.


 

మరిన్ని వార్తలు