రైతుల్ని బహిరంగంగా మోసం చేస్తున్నాడు

17 Dec, 2014 02:38 IST|Sakshi

ఒంగోలు అర్బన్: చంద్రబాబు రైతు సాధికారత సభలుపెట్టి రైతులను బహిరంగంగా మోసగిస్తున్నాడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులంతా వారి రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలని చంద్రబాబు అనడంపై మండిపడ్డారు. రీషెడ్యూల్ చేయాల్సింది ప్రభుత్వమైతే..రైతులను రీషెడ్యూల్ చేసుకోమనడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థమవుతోందన్నారు. రీషెడ్యూల్ అంటే ఉన్న అప్పుని కొన్నేళ్లు వాయిదాల పద్ధతిలో చెల్లించుకుంటూ కొత్త రుణాలు పొందే అవకాశం కల్పించడమని..అయితే ఇప్పుడు చంద్రబాబు రీషెడ్యూల్ పేరుతో రైతుల రుణాల్ని రెన్యువల్ చేసి వారిపై భారం మోపుతున్నారని అన్నారు.

రైతు సాధికారత సదస్సులో రుణవిముక్తి పత్రాలు పంచినా ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి రుణమాఫీ జరిగిందా అని ప్రశ్నించారు. రుణమాఫీ వర్తించేవారిని గుర్తించడంలో జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం కార్యకర్తలకు కట్టబెట్టడం దారుణమన్నారు. వెంటనే ఆ కమిటీలను తీసేయాలని డిమాండ్ చేశారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు వేర్వేరుగా వ్యవసాయం చేసుకుంటుంటే అలాంటి వారికి కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ వర్తిస్తుందని చంద్రబాబు అంటున్నాడని..దీనివల్ల ఎంతో మంది చిన్న, సన్నకారు రైతులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.50వేలలోపు వారికి రుణ విముక్తి పత్రాలు ఇస్తున్నాం అన్న చంద్రబాబు అవి కూడా ఆ పార్టీ కార్యకర్తలకే ఇవ్వడం దారుణమన్నారు. ఇతర పార్టీకి ఓట్లు వేసిన వారు రైతులు కాదా అని ప్రశ్నించారు. డ్వాక్రా రుణాల పరిస్థితి ఏంటో కూడా చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందన్నారు.  విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు