సీఎం జగన్‌ నిర్ణయం..పేద విద్యార్థులకు వరం

24 Nov, 2019 14:21 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్‌ మీడియం చదువులకు బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అనంతపురం ఎన్జీవో హోం లో రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆంగ్ల మాద్యమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని బీసీ సంఘం ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నేతలు స్వాగతించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వైఎస్ జగన్ నిర్ణయం ఓ వరమని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో పేద విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీషు మీడియం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్ విమర్శలు అర్థరహితమన్నారు.

ప్రకాశం: ఆంగ్ల మాద్యమం ఆవశ్యకత పై ఒంగోలు లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదర్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో దళిత బహుజన మేధావులు ఈ చర్చలో పాల్గొన్నారు. ‘బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఇంగ్లీష్‌ మీద పట్టు సాధించారు..కాబట్టే ప్రపంచ మేధావి అయ్యారని’ వక్తలు తెలిపారు.

తిరుపతి: ఇంగ్లీష్‌ మాద్యమం కు మద్దతుగా తిరుపతిలో అంబేద్కర్‌ మిషన్‌ ఇండియా నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇంగ్లీష్‌ భాష ధనికులకే కాదు.. పేదలకు కూడా అవసరమన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్‌ ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టారని ప్రతినిధులు తెలిపారు. సీఎం  నిర్ణయానికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామన్నారు.

మరిన్ని వార్తలు