దళారులు దయతలిస్తేనే.. లోన్లు మంజూరు

6 Oct, 2013 05:12 IST|Sakshi

ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: ‘హలో...అన్నా నాకు బీసీ కార్పొరేషన్‌లో లోను కావాలి.. ఇప్పించగలవా?’ ‘అలాగా...ఎంత కావాలి....పేరు... ఏ యూనిట్‌కు రుణం కావాలో వివరాలు షాపు వద్ద ఇవ్వు. రెండు రోజులు తరువాత కనపడు. లక్షకు  పన్నెండు వేలు ఖర్చవుద్ది.. సరేనా!’ఇదీ సంక్షేమ కార్యాలయంలో దళారుల దందా. బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌లో యూనిట్ మంజూరు కావాలంటే లబ్ధిదారులు కార్యాలయానికి వెళ్లనక్కర్లేదు. దళారులను ఆశ్రయిస్తే చాలు.. అన్నీ వారే చూసుకుంటారు. కానీ మంజూరైన రుణం నుంచి లక్షకు రూ.పన్నెండు వేలు చెల్లించాల్సి ఉంటుంది.  ఈ మొత్తంలో అధికారులకు సైతం  వాటాలుంటాయని దళారులు చెబుతూ దందాను సాగిస్తుండడంతో ఇచ్చుకోలేని లబ్ధిదారులు పనులు కాక లబోదిబోమంటున్నారు.
 
 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం ప్రతి ఏటా ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తుంటుంది. ఒక్కో యూనిట్‌కు రూ.60 వేల నుంచి లక్ష రూపాయల వరకు అందించే రుణాలను వివిధ వృత్తుల వారు కూడా తీసుకుని లబ్ధిపొందుతుంటారు. అయితే, లబ్ధిదారుడు ఒక యూనిట్ నెలకొల్పడానికి రూ. ల క్ష రూపాయల రుణం కోసం బీసీ కార్పొరేషన్‌కు  దరఖాస్తు చేసుకుంటే  పదివేల రూపాయలు కాంట్రిబ్యూషన్ చెల్లించాలి.  బ్యాంకు రుణంగా రూ.60వేలను అందిస్తుంది. రాజీవ్ అభ్యుదయ యోజన పథకం కింద ప్రభుత్వం రూ.30వేలు సబ్సీడీని ఇస్తుంది. ఇలా మంజూరయిన యూనిట్‌ను లబ్ధిదారులు సక్రమంగా నడుపుకుని బ్యాంకు రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
 
 ప్రతి ఏటా ప్రభుత్వం కార్పొరేషన్‌లకు రుణాలివ్వాలని లక్ష్యాలు నిర్దేశిస్తుంది. కానీ అధికారులు దళారులకు తలొగ్గి మార్చి చివరి వరకు  వాస్తవ లబ్ధిదారులకు రుణాలు అందించరనే ఆరోపణ ఉంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 2,500 మందికి  రుణం అందించాలనే లక్ష్యాన్ని అధికారుల ముందుంచింది. అయితే ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ చివరి వరకు నాలుగు వేల దరఖాస్తులు అందినా ఏ ఒక్కరికి కూడా రుణమంజూరుకు సహకరించకపోవడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. గతేడాది 872 యూనిట్లను మంజూరు చేయాలన్న లక్ష్యం ఉండగా మొదట్లో రుణంకోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఏడాది చివరి వరకు ముప్పుతిప్పలు పెట్టి, వివిధ రకాల కొర్రీలు పెడుతూ కార్యాలయాల చూట్టూ తిప్పించుకున్నారు. చివరకు  లక్ష్యాన్ని చాలావరకు  దళారుల సహకారంతో పూరించి, వాస్తవ లబ్ధిదారులకు మొండిచెయ్యి చూపించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పుడు నేరుగా దరఖాస్తు చేసుకుంటే లాభం లేదని భావించిన  పలువురు లబ్ధిదారులు తప్పనిపరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తున్నారు.
 
 అంతా వారిదే రాజ్యం...
 బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌లో దళారుల రాజ్యమే కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి వెళ్లే లబ్ధిదారులకు చుక్కలు చూపించే అధికారులు దళారులు తీసుకొచ్చిన దరఖాస్తులను సునాయసంగా ఎంపిక చేస్తున్నారు. దీంతో చేసేదిలేక వాస్తవ లబ్ధిదారులు దళారులను ఆశ్రయిస్తున్నారు. పేరు, ఊరు, యూనిట్ వివరాలు చెబితే చాలు కార్పొరేషన్ లోను మంజూరు నుంచి బ్యాంకు అకౌంట్ వరకు అన్నీ వారే చూసుకుంటారు. ఈ తతంగానికి లబ్ధిదారుల నుంచి లక్షకు  పన్నెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. ఇందులో అధికారులకు కూడా వాటాలున్నాయని దళారులే చెబుతున్నారని, నెల నెలా వేలాది రూపాయలు వేతనాలుగా తీసుకునే అధికారులు  లబ్ధిదారులను ఏడిపించడం న్యాయం కాదని ఓ బాధితుడు ‘న్యూస్‌లైన్’ ఎదుట వాపోయాడు. అంతేకాక కార్పొరేషన్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, ఇదే అదునుగా భావించిన దళారులు నకిలీ, బినామీ పేర్లతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కాజేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమదందా నుంచి కాపాడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.   
 
 బీసీ కార్పొరేషన్ ఈడీ ఆంజనేయశర్మ ఏమంటున్నారంటే...
 ఈ ఏడాది బీసీ కార్పొరేషన్‌కు 2,500 లబ్ధిదారుల లక్ష్యంగా ఉంది. ఒక్కొక్కరికి సబ్సిడీ కింద రూ.30వేలు అందిస్తాం. మండలాల వారీగా యూనిట్లను కేటాయిస్తాం. ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండదు. ఎక్కడైనా అవినీతి జరుగుతుందని తెలిస్తే చర్యలు తీసుకుంటాం.లబ్ధిదారులు నేరుగా కార్యాలయానికి మాత్రమే రావాలి. దళారులను ఆశ్రయించొద్దు. నేనున్నంత కాలం కార్పొరేషన్‌లో అవినీతి జరకుండా చూసుకుంటా.
 

మరిన్ని వార్తలు