కరుణ కరువు

22 Apr, 2018 07:06 IST|Sakshi
మర్రాపు శంకరరావు

తెర్లాం మండలం లోచర్ల గ్రామానికి చెందిన ఈయన పేరు మర్రాపు శంకరరావు. బైక్‌ మరమ్మతులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్న ఈయన షాప్‌ను మరింత అభివృద్ధి చేసుకునేందుకు రుణం కోసం బీసీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. బీసీ కార్పొరేషన్‌ ఓబీఎంఎంఎస్‌ ద్వారా 2016–17, 17–18 ఆర్థిక సంవత్సరాల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరై అందులో ఎంపికయ్యాడు. అన్ని అర్హతలూ ఉన్న ఈయన రెండేళ్లుగా  మండల పరిషత్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రుణం మాత్రం మంజూరు కాలేదు. కారణం ఏమిటాని ఆరా తీస్తే జన్మభూమి కమిటీ సభ్యులు ఈయన పేరును తొలగించారట. 

బతుకుతెరువు కోసం కనీసం ప్రైవేటు ఉద్యోగానికి కూడా నోచుకోని వెనుకబడిన తరగతుల వారిని ఆదుకునేందుకు బీసీ కార్పొరేషన్‌ నెలకొల్పారు. కానీ దీని ద్వారా ఉపాధి కనుచూపుమేరలో కానరావడం లేదు. జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాలి... లేదా సంఘ నాయకుల రూపంలో ఉన్న దళారులను ప్రసన్నం చేసుకోవాలి... వీటికి డబ్బు ఉండాలి. పోనీ అన్నీ చేసినా బ్యాంకర్లకు ఇష్టం లేకపోతే అంతే! వెనుకబడిన తరగతుల్లో నిరుపేదల సమస్యకు పరిష్కారం కానరావట్లేదు.

బొబ్బిలి : ఏటా కోట్టాలది రూపాయ ల బడ్జెట్‌ కేటాయించడం అందులో 25 శాతం కూడా రుణాలు ఇవ్వకపోవడంతో బీసీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రుణం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కానరావట్లేదు. ఓ వైపు జన్మభూమి కమిటీల పెత్తనం... మరోవైపు బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా గడచిన మూడేళ్లలో తిరస్కరిస్తున్న వాటి సంఖ్యే ఎక్కువ. ఆర్థిక ఆసరా లేని కుటుంబాలు ఏటా బీసీ కార్పొరేషన్‌కు వేలల్లో దరఖాస్తులు చేసుకుంటున్నాయి. కానీ రాజకీయ పలుకుబడి, జన్మభూమి కమిటీలకు డబ్బులు ఇస్తే తప్ప సబ్సిడీ రుణాలు అవ్వడం లేదు. డబ్బులు ఇవ్వలేని బీదాబిక్కీ దరఖాస్తు చేసుకునేందుకు వ్యయ ప్రయాసలే మిగులుతున్నాయి.  

దరఖాస్తులు వేలల్లోనే...
జిల్లా వ్యాప్తంగా ఏటా 14 నుంచి 20వేల వరకూ బీసీ సబ్సిడీ రుణాలకోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. 2014–15లో 14020 మంది 2015–16లో 16340 మంది, 16–17లో 16100 దరఖాస్తు చేసుకోగా కేవలం 10 శాతం కూడా లబ్ధిపొందిన వారు లేరు. చేసేది లేక ఆయా కుటుంబాలు తిరిగి వడ్డీ వ్యాపారుల పైనే ఆధారపడాల్సి వస్తోంది. రుణాలు ఇవ్వాలంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కమిటీల ఆమోదం ఉండాలి. ఆ తరువాత బ్యాంకుల చుట్టూ తిరగాలి. అక్కడి నుంచి జిల్లా స్థాయి కమిటీ ఆ తరువాత బీసీ కార్పొరేషన్‌ ఎండీ ఇలా.. ఎన్నో ఇబ్బందులు దాటిన తరువాత సబ్సిడీ మంజూరయితే దానిని ఇచ్చేందుకు బ్యాంకర్ల వద్ద తిప్పలు తప్పట్లేదు.

వచ్చిన సబ్సిడీని డిపాజిట్‌గా వేసేసి బ్యాంకులు వ్యాపారం చేసుకుంటున్నాయి. రూ. లక్షరుణం, రూ. లక్ష సబ్సిడీ కాగా రూ. రెండు లక్షలు లబ్ధిదారుడికి బ్యాంకులు ఇవ్వాలి. ఈ మొత్తం వాయిదాల రూ³ంలో తీరిపోయిన వెంటనే అంతకు ముందు డిపాజిట్‌ చేసిన రూ. లక్ష సబ్సిడీని లబ్ధిదారుడికి ఇవ్వాలి. కానీ రూ. రెండు లక్షల యూనిట్‌ మంజూరవగానే బ్యాంకర్లు లక్ష డిపాజిట్‌ చేసేసి కేవలం రూ. 30వేల నుంచి రూ. 50వేలే రుణం ఇస్తున్నారు. అవి తీరాక మిగతా డబ్బులు ఇస్తామంటున్నారు. 

కొత్త దరఖాస్తులకు రెడీ
జిల్లాలో రుణాల మంజూరు అవుతున్నా గ్రౌండింగ్‌ కావడం లేదు. అంటే లబ్ధిదారుడికి కాగితాల మీదే మంజూరు చూపిస్తున్నారు తప్ప ఒక్క పైసా అయినా సబ్సిడీ ఇవ్వట్లేదు. మూడేళ్లుగా రుణాల మంజూరు ప్రక్రియ జరుగుతున్నా చేతికి డబ్బు అందే వారు లేరు. కానీ ఈ ఏడాది మళ్లీ 2018–19 ఆర్థిక సంవత్సరానికి మళ్లీ రుణాలు వచ్చాయనీ, దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 2,313 దరఖాస్తులు రావడం గమనార్హం.

గ్రౌండింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం 
మూడేళ్లుగా మంజూరైన రుణాలను గ్రౌండింగ్‌ చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. త్వరలోనే అందరికీ రుణాలు గ్రౌండయ్యేలా చేసి యూసీలు తీసుకుంటాం. దీనిపై బ్యాంకర్లకు సమాచారం ఇచ్చాం. 
– ఆర్‌.వి.నాగరాణి, ఈడీ, బీసీ కార్పొరేషన్, విజయనగరం  

మరిన్ని వార్తలు