బీసీ డిక్లరేషన్ ప్రకటించాలి

30 Sep, 2013 00:38 IST|Sakshi
నల్లగొండ, నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్ :అన్ని రాజకీయ పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఎన్నికల్లోకి రావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. నల్లగొండలోని బండారు గార్డెన్‌‌సలో ఆదివారం బీసీ సర్పంచ్‌ల ఆత్మీయ సన్మానసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ’20 వేల కోట్లతో బీసీ డిక్లరేషన్ రూపొందించాలని, ఎస్సీ, ఎస్టీ తరహాలోనే చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లకు సింగిల్ చెక్‌పవర్ ఇవ్వడంతోపాటు నెలకు ’20 వేల వేతనం చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. చెక్ పవర్ వ్వకపోతే ’20 వేల మంది సర్పంచ్‌లతో సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే, ఎంపీ నిధులను రాబట్టి గ్రామాలను సర్పంచ్‌లు అభివృద్ధి చేయాలని సూచించారు. అగ్రవర్ణాల మేకపోతు గాంభీర్యానికి ఎవరూ బయపడవద్దని భరోసా ఇచ్చారు.
 
 6 లక్షల మందికి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో బీసీ సంఘం కార్యాలయాలు నిర్మించాలన్నారు. ఓటు తెల్ల కాగితం కాదని సీఎం, పీఎం సీట్లతో సమానమన్నారు. ఓటు అంటే ముస్లింల ఐకమత్యాన్ని గుర్తు పెట్టుకోవాలని గుర్తు చేశారు. అగ్రవర్గాల వారికి టికెట్ వస్తే తమ పార్టీ అంటారని, ఇవ్వకపోతే జెండానే పీకేస్తారని అన్నారు. అదే తరహాలో బీసీలు కూడా బానిస ఆలోచనా విధానం నుంచి బయటికి రావాలన్నారు. జిల్లాలో ఒక ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. బీసీలు ఎమ్మెల్యేగా నిలబడితే ఐక్యంగా గెలిపించుకోవాలన్నారు.
 
 రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో కనీస సౌకర్యాల కోసం నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కలిసి ’70 కోట్లు విడుదల చేయించినట్లు తెలిపారు. బీసీ భవన నిర్మాణానికి కోటి రూపాయలిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, పూల రవీందర్ మాట్లాడుతూ బీసీ సబ్‌ప్లాన్ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను అభివృద్ధి చేయాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ జనాభా నిష్పత్తి ఆధారంగా చట్టసభల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ ఎజెండాతోనే వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వచ్చే విధంగా బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. నరేంద్రమోడీ నిజాయితీని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయంగా ఎదగాలన్నారు. 
 
 ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ సీఎం వద్దకు వెళ్లి 24 శాతానికి తగ్గించిన రిజర్వేషన్లను 34 శాతానికి ఒప్పించానని గుర్తుచేశారు. రాజకీయాల కన్నా తనకు బీసీలే ముఖ్యమన్నారు. అగ్రవర్గాల వారు తనను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారు. బీసీలంతా పార్టీలకతీతంగా పనిచేయాలన్నారు. సర్పంచ్‌లకే చెక్‌పవర్ ఇప్పించేందుకు జానారెడ్డిని ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావలూరి హన్మంతరావు బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు జరిగితేనే జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పోరాటం ద్వారానే బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వైఎస్సార్ అమలు చేశారన్నారు. 
 
 డాక్టర్ చెరుకు సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం బీసీలు ఉద్యమించాలన్నారు. ఇంకా బీసీ నాయకులు సుంకరి మల్లేష్‌గౌడ్, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, కటికం సత్తయ్యగౌడ్, జుట్టుకొండ సత్యనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు తీరానాలు చేశారు. అనంతరం జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి సభకు వచ్చిన బీసీ సర్పంచ్‌లను ఆర్.కృష్ణయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్‌లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రామరాజు, జిల్లా నాయకులు వై.సత్యనారాయణ, దుడుకు లక్ష్మీనారాయణ, గండిచెర్వు వెంకన్న, వైద్యం వెంకటేశ్వర్లు, రామోజు షణ్ముఖ, సూర్యానారాయణ, సోమమల్లయ్య, డేగబాబు, కరుణాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు