అర్ధరాత్రి అరాచకం

9 Jan, 2014 03:58 IST|Sakshi

లావేరు, న్యూస్‌లైన్: బుధవారం అర్ధరాత్రి దాటి.. సమయం 3 గంటలు కావస్తోంది.. లావేరు మండలం అదపాక గ్రామం గాఢ నిద్రలో ఉంది. అంతలో ఉన్నట్లుండి అలజడి. పోలీసు బూట్ల చప్పుళ్లు.. రణగొణ ధ్వనులు. దాంతో అక్కడి ప్రశాంతత చెదిరిపోయింది. గ్రామస్తుల నిద్రమత్తు ఎగిరిపోయింది. విశాఖ జిల్లా భీమిలి నుంచి వచ్చిన సుమారు 30 మంది పోలీసులు వచ్చీరావడంతోనే బీసీ హాస్టల్ పరిసరాల్లో ఉన్న రెల్లి కులస్తుల ఇళ్లపై విరుచుకుపడ్డారు. తలుపులు దబదబ బాదారు. దాంతో ఇళ్లలో ఉన్నవారు ఉలిక్కిపడి లేచినా.. భయంతో తలుపులు తీయలేదు. అయినా పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తలుపులు విరగ్గొట్టి ఇళ్లలోకి చొరబడ్డారు. సామాన్లను విసిరికొట్టారు. బీరువాలు తెరిచి బట్టలు, ఇతర వస్తువులను చిందరవందరగా పడేశారు. వారి దౌర్జన్యాన్ని అడ్డుకోబోయిన మహిళలను నిర్దాక్షిణ్యంగా నెట్టేశారు. కొంతమందిపై చేయి చేసుకున్నారు. పిల్లలను సైతం తోసివేశారు. చాలాసేపు వీరంగం వేసి ఐదుగురు వ్యక్తులను తమతోపాటు తీసుకుపోయారు. ఇళ్లలోని నగదు, బంగారం కూడా తీసుకుపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు.
 
 ఏడాది క్రితంనాటి చోరీ కేసు పేరుతో..
 పోలీసులు అంత తీవ్రంగా విరుచుకుపడటానికి కారణం ఏడాది క్రితం భీమిలి ప్రాంతంలో జరిగిన చోరీ కేసే కారణమట. అదపాక రెల్లీలే ఈ కేసులో నిందితులని భావించిన పోలీసులు అర్ధరాత్రి వారి ఇళ్లపై దాడికి పాల్పడి, భయోత్పాతం సృష్టిం చారు. వాస్తవానికి ఈ కేసు విచారణలో భాగంగా గత జూన్‌లో ఒకసారి భీమిలి పోలీసులు ఇక్కడికి వచ్చి విచారణ జరిపారు. తామెటువంటి చోరీకి పాల్పడలేదని రెల్లీలు అప్పట్లోనే విన్నవించుకోవడంతో వెళ్లిపోయారు. ఆరు నెలల తర్వాత మళ్లీ బుధవారం అర్ధరాత్రి వచ్చి బీభత్సం సృష్టించి.. కుప్పిలి త్రినాథ్, పిన్నింటి కృష్ణ, సవళాపురపు లక్ష్మణ, కుప్పిలి రాంబాబు, కుప్పిలి అప్పారావు అనే వ్యక్తులను తమతో తీసుకుపోయారు.
 
 సొత్తు దోచుకుపోయారు!
 ఈ సంఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారని, చిన్నపిల్లలను కూడా తోసివేయడంతో ప్రసన్నకుమార్ అనే ఏడాది బాలుడికి దెబ్బలు తగిలాయని బాధిత కుటుంబాలకు చెందిన మహిళలు గ్రామానికి వెళ్లిన విలేకరుల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. చోరీతో తమకెలాంటి సంబంధం లేదని మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా తమ వారిని తీసుకుపోయారని పిన్నింటి లక్ష్మి, కుప్పిలి లక్ష్మి, కుప్పిలి మణి తదితరులు వాపోయారు. తమ ఇంట్లో ఉన్న పదివేల నగదు, రెండు బంగారు ఉంగరాలు, వెండి పట్టీలు, మొలతాడు తీసుకుపోయారని కుప్పిలి త్రినాథ్ భార్య ఆదెమ్మ ఆరోపించారు. సవళాపురపు సింహాద్రి అనే వ్యక్తి ఇంట్లో ఇటీవల పాలు అమ్మగా వచ్చిన నాలుగువేల నగదు, పిన్నింటి కృష్ణ అనే వ్యక్తి ఇంట్లో మూడువేలు నగదును కూడా పోలీసులు తీసుకుపోయారని అతని కృష్ణ భార్య లక్ష్మి తదితరులు చెప్పారు. చేయని దొంగతనాలను మాపై మోపుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆవేదన చెందారు. చోరీ చేసినట్లు ఆధారాలు ఉంటే.. పగటి పూట వచ్చి తీసుకెళ్లాలే గానీ.. ఇలా అర్ధరాత్రి వేళ వచ్చి భయోత్పాతం సృష్టించడం ద్వారా చేయని నేరాన్ని చేసినట్లు బలవంతంగా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని, అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారని వారు ఆరోపించారు. పోలీసుల నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.
 
 సంబంధం లేదని గతంలోనే చెప్పాం: సర్పంచ్
 భీమిలి చోరీ కేసుతో అదపాక రెల్లి కులస్తులకు ఎటువంటి సంబంధంలేదని గతంలోనే చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని అదపాక సర్పంచ్ నడిమింటి కుమారి అన్నారు. ఈ కేసు విషయమై గత ఏడాది జూన్‌లో భీమిలి పోలీసులు తన వద్దకు వచ్చారని, అప్పుడే రెల్లీలను పిలిపించి విచారించగా ఆ దొంగతనం చేయలేదని వారు తన సమక్షంలోనే చెప్పారని ఆమె వివరించారు. అయినా వినిపించుకోకుండా రాత్రి వేళ ఇలా ఇళ్లలోకి చొరబడి దౌర్జన్యాలకు పాల్పడి, మనుషులను ఎత్తుకుపోవడం సమంజసం కాదని ఆమె అన్నారు.
 
 స్పందించని భీమిలి పోలీసులు
 ఈ సంఘటనపై వివరణ కోరేందుకు ‘న్యూస్‌లైన్’ ప్రయత్నించగా భీమిలి పోలీసులు స్పందించలేదు. బుధవారం సాయంత్రం భీమిలి పోలీసుస్టేషన్ ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేసి ఎస్సైతో మాట్లాడాలని కోరగా.. ఆయన లేరని అక్కడి సిబ్బంది చెప్పారు. సెల్‌ఫోన్ నెంబరు అయినా ఇవ్వాలని కోర గా భీమిలిలో ఎందరో ఎస్సైలు ఉన్నారు.. వారి నెంబర్లు మాకు తెలియవంటూ ఫోన్ పెట్టేశారు. లావేర్ ఎస్సై వివరణ కోరగా భీమిలి పోలీసులు వచ్చి, కొందరిని తీసుకెళ్లిన విషయం తమకు తెలియదన్నారు.  
 

మరిన్ని వార్తలు