లేనిది ఉన్నట్టు... వార్డెన్‌ కనికట్టు

20 Dec, 2019 12:59 IST|Sakshi
హాస్టల్‌ వద్ద బీసీ అధికారులను విచారిస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఇన్‌సెట్‌లో) పరారీలో ఉన్న వార్డెన్‌ హరిప్రసాదరావు

వాడరేవు బీసీ బాలుర హాస్టల్‌పై ఏసీబీ దాడులు

9 మంది విద్యార్థులకు 86 మంది ఉన్నట్లు రికార్డు

వసతి గృహంలో అసలు రికార్డులన్నీ మాయం

పాలు, కోడిగుడ్లు సైతం స్వాహా

ఏడాదికి రూ.10 లక్షలుదారి మళ్లుతున్న వైనం

పరారీలో హాస్టల్‌ వార్డెన్‌

ప్రకాశం, చీరాల: హాస్టల్‌ వార్డెన్‌ బాగోతం ఏసీబీ అధికారుల దాడులతో బట్టబయలైంది. లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేసి పిల్లల పేరుతో నిధులన్నీ జేబులో వేసుకుంటున్నాడని తేటతెల్లమైంది. వాడరేవు బీసీ బాలుర వసతి గృహంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల మేరకు గురువారం ఉదయం ఏసీబీ అదనపు ఎస్పీ సురేష్‌ ఆధ్వర్యంలో ఏసీబీ ఏఎస్పీ, ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు వసతి గృహంలో దాడులు చేశారు. తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. హాస్టల్‌లో బాలురు కేవలం 9 మంది ఉండగా వార్డెన్‌ బండారు హరిప్రసాదరావు రికార్డుల్లో 86 మంది నివాసం ఉంటున్నారని నమోదు చేశారు. ఇలా ఏడాదికి రూ.10 లక్షల వరకు నిధులను తన జేబుల్లోకి మళ్లించుకుంటున్నాడు. ఈ అక్రమ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయంపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తుండటంతో వార్డెన్‌ హరిప్రసాదరావు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకుని పరారు కావడం విశేషం తనిఖీ అధికారులను మభ్య పెడుతూ..

ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నెలకు రూ.1000, హైస్కూల్‌ విద్యార్థులకు రూ.1200 చెల్లిస్తుంది. ఈ నిధులతో లేనిది ఉన్నట్టు... వార్డెన్‌ కనికట్టువసతిగృహ విద్యార్థులకు అల్పాహారం, భోజనం, కాస్మోటిక్‌ ఛార్జీలను ప్రభత్వుం అందిస్తుంది. వార్డెన్‌ ఏడాదిన్నర నుంచి విద్యార్థులు హాస్టల్‌లో ఉండకపోయినప్పటికీ రికార్డుల్లో మాత్రం 86 మంది ఉంటున్నారని నమోదు చేస్తున్నారు. ఎప్పుడైనా తనిఖీలకు వచ్చిన జిల్లా అధికారులను ఏదో విధంగా మభ్యపెటుతున్నారు. దీంతో విద్యార్థులు లేకుండానే వారిపేర్లతో వచ్చే నిధులను సుమారు రూ.18లక్షల వరకు ఏడాదిన్నర కాలంలోనే వార్డెన్‌ మింగేశారని సమాచారం. ఈ కోణంలోనే ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.

ఆహార పదార్థాలూ స్వాహా..
వాడరేవు బీసీ బాలుర వసతిగృహం నిర్వహణ అధ్వానంగా ఉందని, వార్డెన్‌ అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ నిధులను కాజేస్తున్నారని ఫిర్యాదుతో గుంటూరు, ప్రకాశం జిల్లాల ఏసీబీ అధికారులతో దాడులు చేసినట్లు ఏసీబీ ఏఎస్పీ సురేష్‌ తెలిపారు. ఈ బాలుర వసతిగృహంలో రికార్డుల్లో మాత్రం 86 మంది విద్యార్థులు ఉంటున్నారని చూపుతుండగా వాస్తవంగా 9 మంది మాత్రమే నివశిస్తున్నారన్నారు. విద్యార్థులకు అందించే అల్పాహారం, పాలు, కోడిగుడ్లు, ఇతర నిధులను అక్రమంగా స్వాహా చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. 9 మందికి ప్రతి రోజు ఒకటిన్నర లీటరు పాలు, ఒకటిన్నర లీటరు పెరుగు, నాసిరకం కూరగాయలతో భోజనం అందిస్తున్నారని పాలు, ఆహార పదార్థాలు అందించే వారిని విచారించగా తమకు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారన్నారు. వసతిగృహంలో విద్యార్థులకు నూతన మంచాలు, దుప్పట్లు ఉన్నాయని, కూరగాయలు, అరటి పండ్లు మాత్రం కుళ్లిపోయి ఉన్నాయన్నారు. అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ వెంకటేశులు సమక్షంలో వసతి గృహాన్ని సందర్శించి వివరాలు సేకరించామన్నారు. కానీ హాస్టల్‌ వార్డెన్‌ బండారు హరిప్రసాద్‌రావు మాత్రం ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకుని పరారీలో ఉన్నట్లు తెలిసిందన్నారు. ఎంతకాలంగా రికార్డులను తారుమారు చేస్తు అక్రమాలకు పాల్పడుతున్నారో తెలుసుకునేందుకు హాస్టల్‌ ఆఫీసు గదికి తాళం వేశారని, ఆఫీసులో రికార్డులు చూస్తే మరిన్ని అక్రమాలు తెలుస్తాయన్నారు. తమ దాడి, విచారణలో తేలిన అంశాలను నివేదిక రూపంలో జిల్లా ఉన్నతాధికారులకు అందిస్తామని, హాస్టల్‌ వార్డెన్‌ను పట్టుకుంటే చాలా విషయాలు తెలుస్తాయని  తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు ఎన్‌.రాఘవరావు, ఎ.వెంకటేశ్వర్లు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.

ఇంటి నుంచి వార్డెన్‌ పరారీ..
వాడరేవు బాలుర వసతిగృహంపై ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో వసతిగృహం వార్డెన్‌ బండారు హరిప్రసాద్‌రావు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకుని ఇంట్లోంచి ఉదయాన్నే పరారయ్యాడు. అధికారులు ఇంటికి వెళ్లినప్పటికీ అందుబాటులో లేడు. బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారికి కూడా సమాచారం అందించారు.

హాస్టల్‌ వార్డెన్ల వెన్నులో వణుకు...
మండలంలోని వాడరేవు బీసీ వసతిగృహంలో జరిగిన అక్రమాలపై మొదటిసారిగా ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో చీరాల ప్రాంతంలో ఉన్న వసతిగృహాల నిర్వహకులు ఆందోళన చెందుతున్నారు. చీరాల ప్రాంతంలో ఉన్న పలు బాలురు, బాలికల వసతిగృహాల వార్డెన్లు వణుకుతున్నారు. ఇన్నాళ్లు విద్యార్థుల సొమ్మును అప్పనంగా కాజేసిన వార్డెన్లు అక్రమాలపై ఏసీబీ అధికారులు నిఘా ఉంచడం, దాడులు చేయడంతో వార్డెన్లు భయాందోళనకు గరవుతున్నారు.

మరిన్ని వార్తలు