బీసీ హాస్టళ్లకు ఆన్‌లైన్ బెంగ!

7 Nov, 2013 02:14 IST|Sakshi

 

=అన్ని వివరాలు నమోదు చేయాలని జీవో  
=రెండు మూడు రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశం
=హైరానా పడుతున్న వార్డెన్లు

 
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : బీసీ హాస్టల్ వార్డెన్లకు ఆన్‌లైన్ గుబులు పట్టుకుంది. నిర్ణీత గడువు లేకుండా తక్షణం అన్ని వివరాలు నమోదు చేయాలన్న ఆదేశాలతో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఈ ప్రక్రియ సకాలంలో పూర్తిచేయకుంటే బిల్లుల మంజూరుపై దాని ప్రభావం పడుతుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. హాస్టళ్లలో బిల్లుల జారీ మరింత పారదర్శకంగా ఉండాలని భావించిన ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పటికే ఈ విధానం గిరిజన, సాంఘిక సంక్షేమశాఖల్లో అమలవుతోంది.

తాజాగా బీసీ హాస్టళ్లకు విస్తరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని బీసీ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల వివరాలు, ఫొటోలతో జతపరచాలని ప్రత్యేక జీవో గత నెలాఖరున జారీచేసింది. అలాగే భోజన తయారీకి అవసరమైన వస్తువుల కొనుగోలుకు సంబంధించి అన్ని బిల్లుల వివరాలు ఆన్‌లైన్‌లో జతపరచాలని పేర్కొంది. జూన్ నెల నుంచి ఇప్పటివరకు జతపరిచి, తక్షణం అప్‌లోడ్ చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది.
 
ఎటువంటి శిక్షణ లేకుండానే...

ఏదైనా కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేటప్పుడు దానిపై సంబంధిత అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. అదేవిధంగా వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలు,వ్యయంతో పాటు ఇతర అవసరాలను సమకూర్చాల్సి ఉంది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ ప్రక్రియను ప్రారంభించే సమయంలో ఇదే విధానాన్ని ప్రభుత్వం పాటించింది. దీనిని బీసీ హాస్టళ్లకు విస్తరించేటపుడు మాత్రం విస్మరించింది. జిల్లాలోని 68 బీసీ హాస్టళ్లలో సుమారు ఏడువేల మంది విద్యార్థులు ఉన్నారు.

వీరి అవసరాలకు సంబంధించి వస్తువుల కొనుగోలు, తదితర వివరాలు నమోదుకు పదిహేను రోజులకు మించి పడుతుంది. ఇలాంటి వ్యవహారాన్ని కేవలం రెండు రోజుల్లో పూర్తిచేయాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఇదే కాకుండా జూన్ నెల నుంచి అన్ని వివరాలను వీటిలో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. వాస్తవంగా ఒక్కో నెలకు సంబంధించి అన్ని వివరాలు నమోదు చేయాలంటే మూడు నాలుగు రోజులు పడుతుంది. వీటికి అవసరమైన వసతులు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. దీనికి కొంతమేర ఖర్చుపెట్టాల్సి ఉంది.

ఇలాంటి వసతుల్లేక వార్డెన్లు మల్లగుల్లాలు పడుతున్నారు. తక్షణం పూర్తిచేయాలని ఆదేశాలు రావడంతో ఏం చేయాలో పాలుపోక హైరానా పడుతున్నారు. ఇవి సకాలంలో పూర్తికాకపోతే బిల్లుల పరిస్థితి ఏమవుతుందోనని వారంతా ఆందోళన చెందుతున్నారు. సాంఘిక సంక్షేమం మాదిరిగానే బీసీ హాస్టళ్లలోని వివరాలు నమోదుకు అన్ని వసతులు కల్పించి, ఆన్‌లైన్ ప్రక్రియకు సహకరించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.
 

>
మరిన్ని వార్తలు