ఆగస్టులో నూతన రాజకీయ పార్టీ

24 Jun, 2018 10:23 IST|Sakshi

గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌) : బీసీ ఉద్యమనేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య నేతృత్వంలో ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో బీసీలకు నూతన రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు బీసీ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ నౌడు వెంకటరమణ తెలిపారు. త్వరలో ఆర్‌. కృష్ణయ్య పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారన్నారు. పార్టీ పతాకం, విధివిధానాలు ప్రకటిస్తారన్నారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

 జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు బీసీలకు 100 సీట్లు కేటాయిస్తామని హామీలు ఇస్తున్నాయే తప్ప అమలు చేయడం లేదన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు.  బీసీలకు రాజ్యాధికారం వచ్చినపుడే అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వారిని చైతన్య పరిచేందుకు పొలిటికల్‌ జేఏసీ  ఆధ్వర్యంలో పర్యటిస్తుందన్నారు.

 రాబోయే రోజుల్లో 13జిల్లాలకు జేఏసీ అధ్యక్షులను నియమిస్తామన్నారు. రాష్ట్రంలోని ముఖ్యపట్టణాల్లో బీసీల రాజకీయపార్టీ ఆవిర్భావంపై మేధోమథన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులు, మేధావులు, ప్రముఖుల సూచనలు , సలహాలు తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళతామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పాలేటి రామారావు, సంఘం ఉపాధ్యక్షుడు అరవ వెంకటసత్యనారాయణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మారేష్, మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నూకాలమ్మ, ఉపాధ్యక్షురాలు సీతారత్నం, పరిటాల రాము, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు