మీకు నేనెవరో తెలుసా.!

15 Aug, 2019 07:19 IST|Sakshi

సాక్షి, అనంతపురం : నేనెవరో మీకు తెలుసా? అంటూ  బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ   బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులను ప్రశ్నించారు. అభ్యర్థులు ఒక్కసారిగా లేచి జిల్లా మంత్రి శంకర నారాయణ అని బదులిచ్చారు. బుధవారం ఉదయం మంత్రి బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయంలో ఉద్యోగుల వివరాలు అడిగారు. అటెండరు తప్ప తక్కిన ఉద్యోగులు లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగురు పని చేయాల్సి ఉండగా అటెండరు మాత్రమే ఉండడమేంటని మండిపడ్డారు.

ఇంతలో సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులు, టీచరు రవి అక్కడికి చేరుకోగా తాను వచ్చి ఎంతసేపయింది ఇప్పటిదాకా ఎక్కడికెళ్లారు? అంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మంత్రి అభ్యర్థులతో మాట్లాడారు. క్వాలిఫై కాకపోయినా చాలామంది శిక్షణ తీసుకుంటున్నామని, తమకు కూడా మెటీరియల్‌ ఇచ్చేలా చూడాలని మంత్రిని కోరగా..వెంటనే ఆయన స్పందించి డెప్యూటీ డైరెక్టర్‌ ఉమాదేవితో ఫోన్‌లో మాట్లాడారు. అదనంగా 100 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. మొత్తం 300 మందికి స్టడీ మెటీరియల్‌ ఇస్తారని మంత్రి ప్రకటించగా అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. రెండు బ్యాచ్‌లుగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.  స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ యుగంధర్, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ లక్ష్మానాయక్‌ ఉన్నారు.  

ఐసీడీఎస్‌ ఉద్యోగులపై మంత్రి కన్నెర్ర  
కలెక్టర్‌ కార్యాలయానికి పక్కనే ఉన్న కార్యాలయంలో ఇంత నిర్లక్ష్యంగా పని చేస్తున్నారా? అని ఐసీడీఎస్‌ కార్యాలయ ఉద్యోగులపై మంత్రి శంకరనారాయణ కన్నెర్ర చేశారు. బుధవారం ఉదయం మంత్రి ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఎంతమంది ఉద్యోగులు, ఏయే హోదాల్లో పని చేస్తున్నారని పీడీ చిన్మయిదేవిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయోమెట్రిక్‌ వివరాలను అడగగా నెల రోజులుగా యంత్రం పని చేయడం లేదని వివరించగా అటెండెన్స్‌ రిజిష్టర్‌ తెప్పించుకుని పరిశీలించారు.

అందులో పలు లోపాలను గుర్తించి పీడీని మందలించారు. సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులు ఎందుకు సంతకాలు చేయడం లేదని ప్రశ్నించగా...ఏడాది కిందట సస్పెండ్‌ అయ్యారని మంత్రికి తెలిపారు. ఆ విషయం రికార్డులో పొందుపరచకుండా ప్రతినెలా ఎందుకు ఆయన పేరు రాస్తున్నారంటూ మండిపడ్డారు. మరో సీనియర్‌ అసిస్టెంట్‌ భారతి, అటెండెర్‌ లక్ష్మీదేవి ఆఫీసులో ఉన్నా రిజిష్టరులో ఎందుకు సంతకాలు చేయలేదని? ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీపై చర్యలకు కలెక్టర్‌కు సిఫార్సు చేస్తానని మంత్రి ప్రకటించారు.   

మరిన్ని వార్తలు