బీసీసీఐలో ఏసీఏ హవా

1 Oct, 2013 01:55 IST|Sakshi

విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రాతినిధ్యం రానురాను మరింత కీలకం అవుతోంది. చెన్నయ్‌లో ఆదివారం జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో ప్రతిష్టాత్మక అధ్యక్ష పదవి ఎన్నికలో కీలక పాత్ర పోషించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు సముచిత స్థానమే లభించింది. ఏసీఏ ప్రధాన కార్యదర్శి గోకరాజు గంగరాజుకు కీలకమైన ఫైనాన్స్ కమిటీ చైర్మన్, ఐపీఎల్ ఎక్స్ అఫీషియోగా పదవుల్లో నియమితులయ్యారు.

గంగరాజుకు బీసీసీఏ కోశాధికారి పదవి వచ్చే అవకాశం ఉన్నా ఆ పదవికి  పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించే వీలులేకపోవడంతో వదులుకున్నారు.  గత ఏడాది బీసీసీఐ సబ్‌కమిటీల్లో 7 పదవులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులకు దక్కగా,   ఈ ఏడాది 11 కీలక పదవుల్లో నియమితులయ్యారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలా  బీసీసీఐ ఆధ్వర్యంలో  గుంటూరు జేకేసీ కళాశాలలోని ఉమెన్స్  క్రికెట్ అకాడమీని నిర్వహించేందుకు నిర్ణయించడం విశేషం.

బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా గోకరాజు గంగరాజు (ఏసీఏ కార్యదర్శి), కానిస్టిట్యూషన్ కమిటీ సభ్యునిగా డీవీ సుబ్బారావు(అధ్యక్షుడు), లీగల్ కమిటీ సభ్యునిగా డీవీఎస్‌ఎస్ సోమయాజులు(ఉపాధ్యక్షుడు), బీసీసీఐ ఉమెన్ క్రికెట్ అకాడమీ సభ్యులుగా జె.నరేంద్రనాథ్(ఉమెన్ క్రికెట్ అకాడమీ చైర్మన్), వి.ఉమామహేశ్వరరావు(సౌత్‌జోన్ కార్యదర్శి), మార్కెటింగ్ కమిటీ సభ్యుడిగా  జీవీకే (రంగరాజు), యాంటీ డోపింగ్‌కమిటీ సభ్యుడిగా  ఎంవీఎస్ శివారెడి ్డ(ఉపాధ్యక్షుడు), మ్యూజియం కమిటీ సభ్యులుగా వీవీఎస్‌ర్‌జీకే యాచేంద్ర (ఉపాధ్యక్షుడు), ఎన్. మోహన్‌దాస్ (ఉపాధ్యక్షుడు), ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా సీహెచ్.అరుణ్‌కుమార్ (సంయుక్త కార్యదర్శి), టెక్నికల్ కమిటీ సభ్యుడిగా ఎంఎస్‌కే ప్రసాద్ (క్రికెట్ ఆపరేషన్స్ డెరైక్టర్) నియమితులయ్యారు.

 బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన తరువాత సోమవారం నగరానికి చేరుకున్న గోకరాజు గంగరాజు ఏసీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏసీఏ చేస్తున్న క్రికెట్ యాక్టివిటీస్‌కి బీసీసీఐ పూర్తి సంతృప్తిగా ఉందన్నారు. బీసీసీఐ నుంచి వస్తున్న ప్రతి పైసాకు లెక్క చెబుతూ, క్రికెటర్లకు ఖర్చుపెడుతున్న తీరుతో  బీసీసీఐ కీలకమైన పదవులు ఇవ్వడానికి ముందుకొచ్చిందన్నారు. ప్రతిభగల వర్ధమాన క్రికెటర్లకు రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసిన ఘనత దేశంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌దేన్నారు. ఉచిత విద్య, వసతి, కోచింగ్ ఇచ్చే అకాడమీలు స్థాపించి క్రికెట్ క్రీడను అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలో టీమిండియా జట్టులో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  విజయవాడలో ఇందిరగాంధీ మునిసిపల్ స్టేడియం అప్పగిస్తే అంతర్జాతీయ మ్యాచ్‌లు తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు.

 ఈ సమావేశంలో ఏసీఏ క్రికెట్ ఆపరేషన్స్ డెరైక్టర్  ఎంఎస్‌కే ప్రసాద్, ఏసీఏ సంయుక్త కార్యదర్శి సిహెచ్.అరుణ్‌కుమార్, కేడీసీఏ కార్యదర్శి ఎ.ఎల్లారావు సెంట్రల్ జోన్ కార్యదర్శి కోకా రమేష్, మీడియా మేనేజర్ సీఆర్ మోహన్  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీఏ ప్రతినిధులు గోకరాజు గంగరాజును సన్మానించారు.

మరిన్ని వార్తలు