లొట్టలేస్తున్నారా.. జర జాగ్రత్త!

13 Oct, 2018 12:01 IST|Sakshi

పుట్టగొడుగుల్లా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు

మక్కువ చూపుతున్న యువత

కల్తీలకు కేరాఫ్‌ అడ్రెస్‌లు 

 నిద్రమత్తులో జోగుతున్న అధికారులు

 అనారోగ్యమంటున్న వైద్యులు

ఏలూరు (మెట్రో) : ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌.. జిల్లాలోని ఏ గల్లీలో చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి. పట్టణాలు, పలెల్లు తేడా లేకుండా ప్రతి ముఖ్యకూడలిలోనూ ఒకటి నుంచి నాలుగైదు వరకు దర్శనమిస్తున్నాయి. దీంతో యువత వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో సుమారు 200 వరకూ పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, జిల్లావ్యాప్తంగా వేలల్లో ఉన్నాయి.

మున్సిపల్‌ కేంద్రాల్లోనూ, చిన్న పంచాయతీల్లోనూ పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. వీటికి తోడు ఇటీవల మొబైల్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఇష్టం వచ్చిన రీతిలో పుట్టుకొస్తున్నాయి. హైస్కూల్‌ పిల్లలు, యువతీ, యువకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఫాస్ట్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారు. బ్యాచిలర్స్‌ వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ప్రజల ఆదరణ చూసి ఫుడ్‌ కోర్టులు ఏ వీధిలో చూసినా దర్శనమిస్తున్నాయి. ప్రతి సంవత్సరం 20 నుండి 40 శాతం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు పెరుగుతూ వస్తున్నాయి. 

చిన్నారుల్లో స్థూలకాయం
చిన్నారులు చిరుతిళ్లుపై ఎక్కువగా ఆధారపడుతుంటే కచ్చితంగా ఒబిసిటీ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నా వాటిని పెడచెవిన పెడుతున్నారు. అదే విధంగా జంక్‌ఫుడ్‌ మార్కెట్‌ విస్తరించడం కూడా శుభపరిమాణం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది రాబోయే అనారోగ్యానికి హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్లు, పాన్‌పరాగ్‌ వంటివి ఆరోగ్యాన్ని కుళ్లబొడిచినట్లే జంక్‌ఫుడ్స్‌ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. మధుమేహం, గుండె రక్తనాళాల వ్యాధులకు జంక్‌ఫుడ్‌ కారణంగా నిపుణులు చెబుతున్నారు. 

ఆహార తనిఖీ శాఖ నిర్లక్ష్యమూ అంతే
ఆహార తనిఖీ శాఖ నిర్లక్ష్యం కూడా ఈ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. కనీసం వీటిపై ఏ మాత్రం దాడులు చేయకపోవడంతో ఈ సెంటర్లలో కల్తీలు చేసినా ప్రశ్నించే నాథుడే లేకుండా పోతున్నాడు. 

ఫాస్ట్‌ఫుడ్‌ వినియోగం ఇలా
10–15 సంవత్సరాల లోపు వారు 85 శాతం ఉంటే, 16–20 సంవత్సరాల లోపు 65 శాతం, 21–25 సంవత్సరాల లోపు వారు 55శాతం, 26–35 సంవత్సరాల లోపు వారు 45 శాతం, 36–45 సంవత్సరాల లోపు వారు 25 శాతం, 46–50 సంవత్సరాల లోపు వారు 20 శాతం  ఈ జంక్‌ఫుడ్స్‌పై అధికాసక్తి చూపిస్తున్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులు
ఫాస్ట్‌ఫుడ్‌ వాడకాన్ని నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడు రకాల సిఫార్సులు చేసింది. పండ్లు, కూరగాయలు ధరలు తగ్గేలా... ఫాస్ట్‌ఫుడ్‌ ధరలు పెరిగేలా పన్నులు ఉండాలని పేర్కొంది. వీటిలో ఒకటి పండ్లు, కూరగాయల సాగుకు రాయితీలిచ్చి ప్రోత్సహించాలని పేర్కొంది. రెండో అంశం ఫాస్ట్‌ఫుడ్స్, కూల్‌డ్రింక్స్‌ ప్రచారాన్ని కట్టుదిట్టంగా కట్టడి చేయాలని పేర్కొంది. ఆహార ఉత్పత్తుల ప్యాకెట్‌లు డబ్బాలపై మరింత స్పష్టమైన సమాచారంతో కూడిన లేబుల్స్‌ ఉండాలన్నది మూడో సూచన. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని సిగరెట్‌ ప్యాకెట్‌లపై ముద్రించినట్లే పాస్టుఫుడ్‌ సెంటర్లపైనా, ప్యాకెట్లపైనా ఇలాంటి హెచ్చరికలు ముద్రించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

చెవికెక్కని వైద్యుల సూచన
కాలానుగుణంగా లభించే పండ్లు తింటే రోగాలు దరిచేరవని ఫిజ్జా, బర్గర్‌లు, రోడ్లపై దొరికే ఫాస్ట్‌ఫుడ్స్‌ కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఆహారంలో పీచుపదార్థం లేకపోవడంతో మలబద్ధకం, కారం, మసాలాలు ఎక్కువగా ఉండటంలో ఎసిడిటీ పెరుగుతోంది. వీటన్నింటి నుంచి బయటపడాలంటే సంప్రదాయ వంటకాల గొప్పదనాన్ని, అవి ఇచ్చే ఆరోగ్యాన్ని నేటి తరానికి తెలపాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.

చికిత్స కన్నా నివారణే మేలు 
జబ్బు చేసిన తరువాత చికిత్స పొందటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు. ప్రస్తుతం ఫాస్ట్‌ ఫుడ్స్‌ అంటే పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తినేస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌లో వాడే రంగులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. బయట ఫాస్ట్‌ఫుడ్స్‌లో లభించే ఆహారం వల్ల అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మానసిక రుగ్మతలు, గురక వంటి సమస్యలు వస్తాయి. ప్రస్తుతం పిల్లలు బయట ఆ టలకు దూరం అయ్యారు. ఇంట్లో టీవీ చూస్తూ గడపడం, వీడియోగేమ్స్, స్మార్ట్‌ఫోన్‌లతో కాలం గడిపేస్తున్నారు. దీంతో చిన్నవయసులోనే ఊబకాయులుగా మారుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌ తినడం తగ్గిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. 
– డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వ వైద్యులు
 

మరిన్ని వార్తలు