అండగా ఉంటా ధైర్యంగా ఉండండి

26 Dec, 2014 01:58 IST|Sakshi
అండగా ఉంటా ధైర్యంగా ఉండండి
  • ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
  • అసెంబ్లీలో ప్రకటన అనంతరం.. సొంత నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టిన ఏపీ విపక్షనేత
  • సాక్షి, కడప: పంటలు పండక..పెట్టిన పెట్టుబడులుకూడా రాక.. తెచ్చిన అప్పులు తీరే దారిలేక.. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు గంగిరెడ్డి యాదవ్ కుటుంబాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వైఎస్సార్ జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురానికి వెళ్లి గంగిరెడ్డి కుటుంబంతో మాట్లాడి ధైర్యం నింపారు.

    టీడీసీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఓదార్చుతానని ప్రతిపక్షనేతగా ఇటీవల అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు మొదట తన నియోజకవర్గం నుంచే దానికి ఆయన శ్రీకారం చుట్టారు. ముందుగా గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తుండగానే.. గంగిరెడ్డి భార్య రమాదేవి, కుమారుడు రాజ్‌కుమార్, కుమార్తె కుమారి కన్నీళ్ల పర్యంతమయ్యూరు. జగన్ వారిని ఓదార్చుతూ అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

    ఎలాంటి అవసరం వచ్చినా.. స్థానికంగా నా తమ్ముడు అవినాష్ (కడప ఎంపీ) ఉన్నాడు.. భయపడొద్దని వారికి ధైర్యం చెప్పారు. ఎంత భూమి సాగు చేసేవారు.. ఎంత అప్పు చేశారు.. పెట్టుబడుల పరిస్థితి ఏమిటని రమాదేవిని అడిగారు. 5 ఎకరాల భూమి ఉండేదని.. అందులో మూడు బోర్లు వేసినట్లు ఆమె వెల్లడించారు.  నీరు పూర్తిస్థాయిలో పడకపోగా.. ఉన్న చీనీచెట్లు ఎండిపోయాయని ఆమె వివరించారు.

    దీంతో పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో భయపడిపోయామని.. తర్వాత ధైర్యంగా మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని అందులో పొద్దుతిరుగుడు, శనగ తదితర పంటలు సాగు చేసినా పెట్టుబడులు కూడా రాకపోవడంతో తన భర్త గంగిరెడ్డి ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

    బ్యాంకులో రుణం ఏమైనా తీసుకున్నారా.. రుణమాఫీ జరిగిందా అని జగన్ ఆమెను అడిగారు. అప్పులు ఎక్కడ దొరకకపోవడంతో బ్యాంకులో మరిదికి సంబంధించిన బ్యాంకు పాసు పుస్తకం, బంగారు నగలు తాకట్టు పెట్టి రూ. 40 వేలు తెచ్చుకున్నామని ఆమె వివరించారు. రూ. 28 వేలు మాత్రమే మాఫీ అయ్యిందంటున్నారు కానీ.. ఇంతవరకూ  ఆ సమాచారం లేదని చెప్పారు. గంగిరెడ్డి పిల్లలు రాజ్‌కుమార్, కుమారిలను ఓదార్చారు.
     
    మంత్రితో మాట్లాడిన జగన్


    పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోట ప్రాజెక్టు వరకు పెండింగ్‌లో ఉన్న వరద కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని తద్వారా కొన్ని వందల టీఎంసీల నీరు సముద్రం పాలు కాకుండా కొంతమేరైనా నిల్వ చేసుకోవడానికి వీలుంటుందని  జగన్‌మోహన్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును కోరారు. గురువారం మధ్యాహ్నం పులివెందులలోని తన నివాసంనుంచి  ఉమామహేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడారు.

    ఈ ఏడాది  వచ్చిన వరద నీరు సక్రమంగా వినియోగించుకోలేక సముద్రం పాలవుతోందని  గుర్తు చేశారు. అలాగే మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ నుంచి పీబీసీకి 3.2 టీఎంసీలు కేటాయించినా.. సీబీఆర్‌కు మాత్రం 1.5 టీంఎంసీల నీరు మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని.. కాలువల్లో నీరు రావడంతో వృథా కావడం.. తుంపెర్ డీప్‌కట్ వద్ద రీడింగ్ తీసే గేజ్ లోపంవల్ల ఏటా పీబీసీ ఆయకట్టుకు నీరు రావడం లేదన్నారు.  పీబీసీకి అదనంగా ఒక టీఎంసీ కేటాయించాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన  దేవినేని త్వరలోనే గండికోట, చిత్రావతి ప్రాజెక్టులను సందర్శించి న్యాయం చేస్తానని వైఎస్ జగన్‌కు హామీ ఇచ్చారు.
     

మరిన్ని వార్తలు