ఎన్నికల్లో భాగస్వాములు కండి: వైఎస్‌ జగన్‌ పిలుపు

11 Mar, 2019 13:00 IST|Sakshi

సాక్షి, అమరావతి : స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలని, ఒకవేళ పేరు లేనట్లయితే దరఖాస్తు చేసుకోవాలని ట్విటర్‌లో సూచించారు. ఏప్రిల్‌ 11న జరగబోయే ఎన్నికల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కసరత్తు ప్రారంభించండి అని తెలిపారు. ఓటు మన హక్కు అని స్పష్టం చేశారు.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశలోనే తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ రానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలతోపాటు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు తొలివిడతలో, అంటే ఏప్రిల్‌ 11నే పోలింగ్‌ జరగనుంది. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్‌ 3తో ముగుస్తుండగా, ఎన్నికల ఫలితాలను మే 23న వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ, శాసనసభలకు ఒకేరోజున పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది.

మరిన్ని వార్తలు