మరో దఫా పదవీయోగం

9 Jun, 2014 00:38 IST|Sakshi
మరో దఫా పదవీయోగం
 •      అయ్యన్నను నాలుగోసారి వరించిన మంత్రి పదవి
 •      మరోమారు చరిత్ర పుటల్లోకి నర్సీపట్నం
 •      అభివృద్ధిపై ఆశగా ఎదరుచూస్తున్న ప్రజానీకం
 •      ఆనందంలో పార్టీ వర్గాలు
 • స్థానిక ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడుకు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పదవి లభించడంతో ఆ పార్టీ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతంలో మూడు దఫాలుగా మంత్రిగా, ఒకమారు ఎంపీగా పనిచేసిన అయ్యన్న మరోమారు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో నియోజకవర్గం అభివృద్ధిపై స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
   
  నర్సీపట్నం, న్యూస్‌లైన్ : దేశం పార్టీ ఆవిర్భావం 1983  నుంచి నర్సీపట్నం శాసనసభకు పోటీచేస్తున్న అయ్యన్న మొదటి దశలోనే విజయం సాధించి, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం బర్తరఫ్ చేశాక 1985లో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు, ఎమ్మెల్యేగా ఎన్నికైన అయ్యన్నపాత్రునికి సాంకేతిక విద్యాశాఖ, యువజన సర్వీసులు మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

  ఆ సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషిచేశారు. దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. తిరిగి 1994 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయ్యన్నను ఆర్‌అండ్‌బీ శాఖ వరించింది. అప్పట్లో నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలోని వందల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును ఆర్‌అండ్‌బీకి బదలాయించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు.

  రెండేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో సైతం అయ్యన్నపాత్రుడు ఆర్‌అండ్‌బీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో పార్టీ అయ్యన్నను అనకాపల్లి ఎంపీగా పోటీకి దింపింది. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత అయ్యన్నను అటవీశాఖ మంత్రి పదవి వరించింది.

  ఆ సమయంలో నియోజకవర్గంలోని పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ జౌషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. 2004 ఎన్నికల్లో అయ్యన్న ఎమ్మెల్యేగా విజ యం సాధించినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఖాళీగానే ఉండిపోయారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముత్యాలపాప చేతిలో అయ్యన్న ఓటమి పాలయ్యారు.

  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆది నుంచి గంటా రాకను వ్యతిరేకిస్తున్న అయ్యన్న సాక్షాత్తూ విశాఖలో జరిగిన సభలో చంద్రబాబు సమక్షంలోనే తన వాదంపై గళం విప్పారు. ఈ విధం గా కొన్ని సమయాల్లో అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా వ్యవహరించిన అయ్యన్నకు మంత్రి పదవి రాదనే వదంతులు వ్యాపిం చాయి.

  దానికి భిన్నంగా ఆదివారం చంద్రబాబుతో పాటు అయ్యన్న కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయ్యన్నకు పంచాయతీరాజ్ లేక అటవీశాఖ మంత్రి బాధ్యతలు కేటాయిస్తారని ప్రచారంలో ఉంది. నాలుగోసారి మంత్రిగా ప్రమాణం చేసిన అయ్యన్నతో నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని స్థానికులు అనందం వ్యక్తం చేస్తున్నారు.
   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా