ఒకే నెలలో రెండు పెను విషాదాలు

27 Jun, 2014 23:18 IST|Sakshi
ఒకే నెలలో రెండు పెను విషాదాలు

ఒకే నెలలో సంభవించిన రెండు పెను విషాదాలు తెలుగువారికి అంతులేని ఆవేదన మిగిల్చాయి. పంచభూతాలైన నీరు, నిప్పు  పగబట్టి 40 మంది తెలుగువారి ఉసురు తీశాయి. బియాస్ నది రూపంలో జలరక్కసి 24 మంది విద్యార్థులను కానరాని లోకాలకు తీసుకుపోయింది. ఈ ఘటన నుంచి తేరుకోకముందే కోనసీమ వాసులపై గ్యాస్ రూపంలో మృతువు కాటేసింది. నగరం గ్రామాన్ని నరకంగా మార్చేసి 16 మందిని మింగేసింది.

విహారయాత్రకని వెళ్లిన 24 మంది విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను హిమచల్ ప్రదేశ్ లోని బియాస్ నది మింగేసింది. కులుమనాలి సమీపంలో మండిలోని తలౌటి ప్రాంత్రం వద్ద జూన్ 8న జరిగిన ఈ ఘటన విద్యార్థులకు తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది. తామెంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కంటిపాపలను క్షణాల్లో జలరక్కసి ఎత్తుకుపోయింది. ప్రమాదాన్ని పసిగట్టేలోపే ప్రవాహంలోకి లాక్కుపోయింది.

బియాస్ విషాదం తాలుకూ తడి ఆరకముందే తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామాన్ని శుక్రవారం (జూన్ 27న) ఉదయం మృత్యుజ్వాల కమ్మేసింది. గ్యాస్ రూపంలో 16 మందిని మసి చేసింది. నిలువెల్లా కాల్చేసి బూడిద మిగిల్చింది. అన్నెంపున్నెం ఎరుగని పల్లెవాసుల శరీరాలను ఛిద్రం చేసి 15 మందిని ఆస్పత్రి పాల్జేసింది. రక్కసి కీలలకు ఇంకా ఎంత మంది బలౌతారోనని బాధిత కుటుంబాలు భీతిల్లుతున్నాయి.

బియాస్, నగరం విషాదాల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. హిమచల్ అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించి బియాస్ దుర్ఘటనకు కారణమయ్యారు. ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం నగరం ప్రజల పాలిట మృత్యుజ్వాలగా మారింది. బియాస్ నదిలో గల్లంతైన కొంత మంది విద్యార్థుల శవాలు ఇంకా దొరక్కపోవడం విషాదంలో విషాదం. నగరం ఘటనలో కళ్లెదుటే 16 మంది కాలి బూడిదయిపోవడం గుండెలు పిండేసే విషాదం. పాలకుల, అధికారుల నిర్లక్ష్యం కొనసాగినంతకాలం ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి.

మరిన్ని వార్తలు