అందమైన జీవితం.. విషాదాంతం

18 Jun, 2017 22:05 IST|Sakshi
అందమైన జీవితం.. విషాదాంతం

మేకప్‌ ఆర్టిస్ట్‌ శిరీషది ముమ్మాటికీ హత్యేనంటున్న కుటుంబ సభ్యులు
ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్న తల్లి, అత్త
హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన


 నలుగురినీ అందంగా చూపించే అందమైన జీవితం ఈమెది. బ్యూటీషియన్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన విజయలక్ష్మి అలియాస్‌ శిరీష హైదరాబాద్‌లో పార్లర్‌ నడిపింది. సుమారు నాలుగేళ్లుగా ఫిల్మ్‌నగర్‌లోని ఆర్‌జే స్టూడియోలో మేనేజర్‌ కమ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. శిరీషకు ఆచంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన ఆరుమిల్లి సతీష్‌చంద్రతో 13 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వారికి 12 ఏళ్ల కుమార్తె దీప్తి ఉంది. బిడ్డను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని ఆ దంపతులు కలలుగన్నారు. ఏమైందో ఏమో.. ఈ నెల 13న తాను పనిచేస్తున్న స్టూడియోలో శిరీష మృత్యువాతపడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు తీరుపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆచంట : హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ఆర్‌జే స్టూడియోలో ఈనెల 13న అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆరుమిల్లి విజయలక్ష్మి (శిరీష) మృతదేహాన్ని అత్తగారి ఊరైన ఆచంట మండలం వల్లూరు గ్రామం తీసుకొచ్చి ఈనెల 14న అంత్యక్రియలు నిర్వహించారు. శిరీష ఆచంట మండలం వేమవరంలో జన్మించగా.. చిన్నప్పుడే తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం బళ్లారి ప్రాంతానికి వలస వెళ్లారు. వల్లూరు గ్రామానికి చెందిన ఆరుమిల్లి సతీష్‌చంద్రతో ఆమెకు వివాహం కాగా.. ఆ దంపతులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. శిరీష ఆత్మహత్య చేసుకున్నట్టు తేలిందని హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించగా.. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ముమ్మాటికీ హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనుమానాలు, అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేసు కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

శిరీష తల్లి ఏమంటున్నారంటే..
శిరీష తల్లి రామలక్ష్మి మాట్లాడుతూ.. నా కుమార్తె హత్య కేసును పోలీసులు నీరు గారుస్తున్నారు. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఆమె బతికుంటే అన్ని విషయాలూ బయటపడతాయనే చంపేశారు’ అని వాపోయారు. ‘నా కూతురు కష్టపడి పైకి వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఎప్పుడూ నా కూతురిపై ఎటువంటి రిమార్కు లేదు. ఒకరికి భయపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు’ అని చెప్పారు. శిరీష పనిచేస్తున్న స్టూడియో యజమాని రాజీవ్‌ను వివాహం చేసుకునేందుకు సిద్ధమైన తేజస్వినిని ఈ కేసులో ఎందుకు విచారించలేదని రామలక్ష్మి ప్రశ్నించారు. ప్లాస్టిక్‌ తాడును శిరీష మెడకు బిగించినట్టు ఆమె మృతదేహాన్ని చూస్తే అర్థమవుతోందన్నారు. తన కూతురు జీన్స్, టీషర్టు ధరించి ఉంటే ఉరేసుకున్న గదిలోకి చున్నీ ఎలా వచ్చిందని నిలదీశారు.

 శిరీష ఆరు అడుగుల ఎత్తు,  80 కేజీల వరకూ బరువు ఉంటుందని తెలిపారు. ఆమె బరువుకు చున్నీ తెగిపోతుందని స్పష్టం చేశారు. శిరీష ఫ్యాన్‌కు ఉరివేసుకుంటే ఫ్యాన్‌ ఎందుకు చెక్కు చెదరలేదని, కనీసం రెక్కలు కూడా ఎందుకు వంకర కాలేదని ప్రశ్నించారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి వస్తే ఆమె తమకు ముందే ఆ విషయం ఫోన్‌చేసి చెప్పి ఉండేదన్నారు. తన ఒక్కగానొక్క కూతురు దీప్తిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికైనా ఫోన్‌ చేసేదన్నారు. రాజీవ్, శ్రవణ్‌ పక్కా ప్లాన్‌ ప్రకారం శిరీషను స్టూడియోకు తీసుకువెళ్లి వైరుతో చంపేసి ఆత్మహత్యగా చిక్రీకరిస్తున్నారని రామలక్ష్మి ఆరోపించారు.

పథకం ప్రకారమే..
నా కోడలు శిరీష ఎంతో ధైర్యవంతురాలు. ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోగల శక్తి ఆమెకుంది. ఆమె స్నేహితులైన రాజీవ్, శ్రవణ్‌ పథకం ప్రకారమే చంపేశారు. శిరీష బ్యూటీషియన్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణలో పాలుపంచుకునేది. కుమార్తె దీప్తిని బాగా చదివించాలని ఎంతో ఆశపడింది. ఆమె మృతిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయకుండా కేసును మూసివేసే యత్నాలు చేస్తున్నారు. శిరీష మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి.
– శారద, శిరీష అత్త

కొట్టి.. ఉరేసి చంపారని అర్థమవుతోంది
నా మనుమరాలు శిరీష ఒంటిపై ఉన్న గాయాల్ని చూస్తే.. ఆమెను కొట్టి, ఉరేసి చంపేశారని ఎవరికైనా అర్థమవుతుంది. ఆమె తలపైన, పెదవుల మీద, చెంపలపైన గాయాలున్నాయి. అన్యాయంగా నా మనుమరాల్ని పొట్టనపెట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న∙పోలీసులు వాస్తవాలు వెల్లడి చేస్తారనుకుంటే చివరకు తారుమారు చేశారు.
భూలక్ష్మి, శిరీష అమ్మమ్మ

అమ్మను చంపేశారు
‘మా అమ్మను చంపేశారు. అమ్మ కావాలి. తెచ్చివ్వండి’ అంటూ శిరీష కుమార్తె దీప్తి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తల్లిని కోల్పోయిన దీప్తి తల్లడిల్లుతున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది.
 కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న శిరీష కుమార్తె దీప్తి   
 

మరిన్ని వార్తలు