అందమైన సత్రం రాజకీయ చిత్రం

28 Jan, 2014 04:49 IST|Sakshi

వేములవాడలోని మున్నూరుకాపు ధర్మసత్రం అధ్యక్షునిగా ఉన్న కొండా దేవయ్య విరాళాల సేకరణ మొదలు.. భవన నిర్మాణంలో అన్నీ తానై అన్నట్లు ప్రత్యేక శ్రద్ధ వహించారు. అదే సమయంలో దేవయ్యకు రాజకీయ నేపథ్యం ఉండటం,  ఎన్నికల తరుణంలో ప్రారంభోత్సవానికి హడావుడి పడుతుండటం హాట్ టాపికైంది. చిరంజీవి అభిమానిగా గుర్తింపు సాధించిన కొండా గత ఎన్నికల్లో వేములవాడ నుంచి పీఆర్‌పీ టికెట్ ఆశించారు.

ఆఖరి నిమిషంలో భంగపడటంతో స్వతంత్య్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే బరిలో నిలిచారు. 5వేల పైచిలుకు ఓట్లతో అయిదు స్థానంలో నిలిచారు. అప్పట్నుంచీ ప్రధాన పార్టీలకు దూరంగా ఉన్న కొండా దేవయ్య వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారా? అందుకే ఈ సంఘ భవనాన్ని పాచికగా వాడుకొని.. అదే ప్రధాన ఆకర్షణగా మలుచుకుంటున్నారా? అనే చర్చలు జోరందుకున్నాయి.

అందుకు తగ్గట్లుగానే తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రి చిరంజీవిని రప్పించేందుకు కొండా పట్టుబట్టి.. జిల్లాలోని అధికార పార్టీ ముఖ్యుల సాయంతో పర్యటన ఖరారు చేయించినట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవం రోజున తమ సంఘం ప్రతినిధులతో భారీ ర్యాలీ చేపట్టి బల ప్రదర్శన చేసుకునేందుకు దేవయ్య ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ విరాళాలతో నిర్మించిన ధర్మ సత్రంతో సొంతంగా రాజకీయం చేస్తున్నాడని, సంఘ బలాన్ని తన బల ప్రదర్శనకు వాడుకుంటున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి.

>
మరిన్ని వార్తలు