‘బాబు’.. డబుల్ రోల్ !

11 Oct, 2014 03:56 IST|Sakshi

- బీఈడీ కళాశాల సారథిగా ఉంటూ అదే కోర్సు చదువుతున్న వ్యక్తి
- జవాబు పత్రాల మూల్యాంకనానికీ హాజరు
- అయినా పట్టించుకోని ఆంధ్రా యూనివర్సిటీ అధికారులు
- విద్యాప్రమాణాలు దిగజారతాయంటున్న నిపుణులు

సాక్షి, రాజమండ్రి : ఆయన ఓ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్. ఆయనే 2013-14 సంవత్సరం బీఈడీ విద్యార్థి కూడా. ఇంకా పరీక్షలు రాయాల్సి ఉన్న ఆయన ఇప్పుడు ఏకంగా బీఈడీ విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం చేసేశారు. ఈ కంగాళీ వ్యవహారాన్ని ఆంధ్రా యూనివర్సిటీ అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరించడం విశేషం.  రాజమండ్రిలో సెయింట్ జాన్స్ బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా చాలా కాలం నుంచి పని చేస్తున్న బి.రాజబాబు పోస్టుగ్రాడ్యుయేషన్‌తో పాటు ఎంఈడీ చేశారు.

ప్రిన్సిపాల్‌గా ఉండడానికి బీఈడీ ఉత్తీర్ణత తప్పనిసరి అని ఆంధ్రా యూనివర్సిటీ అధికారులు అనడంతో (ఎంఈడీ చేసినా ప్రిన్సిపాల్‌గా ఉండాలంటే ఎన్‌సీఈటీ నిబంధలన ప్రకారం బీఈడీ కూడా చేయాల్సి ఉండడంతో ఆ కోర్సులో చేరుతున్నట్టు సమాచారం) రాజబాబు రాజమండ్రిలోని శారదా కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో  2013-14 సంవత్సరంలో (హాల్ టికెట్ నం: 213168301015) బీఈడీలో చేరారు. బుధవారం విశాఖలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్‌ఈ)లో బీఈడీ జవాబుపత్రాల మూల్యాంకనం మొదలైంది.

రాజబాబు మ్యాథమేటిక్స్ బోర్డు ఎగ్జామినర్‌గా మూల్యాంకనం చేసినట్టు సమాచారం. విషయం తెలిసిన యూనివర్సిటీ అధికారులు బుధవారమే ఆయనను మందలించినా.. తిరిగి గురువారం సాయంత్రం వరకూ సైకాలజీ జవాబుపత్రాలను మూల్యాంకనం చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. బీఈడీ విద్యార్థిగా ఉన్న వ్యక్తి అదే పరీక్ష జవాబుపత్రాలను మూల్యాంకనం చేయడం విద్యా ప్రమాణాల రీత్యా అనుచితమని నిపుణులు అంటున్నారు. కాగా వర్సిటీ అధికారులు మూల్యాంకనం నుంచి రాజబాబును తప్పించామని చేతులు దులుపుకొంటున్నారు.  
 
విధుల నుంచి తప్పించాం..
రాజబాబు అనే వ్యక్తి బీఈడీ విద్యార్థిగా ఉంటూనే కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నట్టు ప్రాథమిక పరిశీలనలో తేలిందని ఏయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మి చెప్పారు. దీనిపై ఆయనను, రెండు కళాశాలల యాజమాన్యాలను వివరణ కోరుతున్నామన్నారు. కాగా బీఈడీ విద్యార్థిగా ఉన్న వ్యక్తిని మూల్యాంకనం విధుల నుంచి తప్పించి, విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించామని ఐఏఎస్‌ఈ ప్రిన్సిపాల్ ఆచార్య శివ ప్రసాదరావు చెప్పారు.
 
గిట్టని వాళ్ల దుష్ర్పచారం..
కాగా తాను బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న మాట వాస్తవమే అయినా మూల్యాంకనానికి హాజరు కాలేదని రాజబాబు అంటున్నారు. గిట్టని వాళ్లు తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమ కళాశాల యాజమాన్యం తన అర్హతలు చూసి ప్రిన్సిపాల్ ఉద్యోగం ఇచ్చిందని, అయితే వర్సిటీ నిబంధనల ప్రకారం ప్రిన్సిపాల్‌గా వ్యవహరించేందుకు బీఈడీ ఉత్తీర్ణత అవసరం కావడంతో ఆ కోర్సు చదువుతున్నానని వివరించారు. తనలా చదువుతున్న వాళ్లు రాష్ట్రంలో చాలామంది ఉన్నారన్నారు. ఇది తప్పనుకుంటే తనను కాక వర్సిటీ అధికారులను ప్రశ్నించాలన్నారు.
 
కొసమెరుపు.....
బీఈడీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్‌కి చీఫ్ సూపరింటెండెంట్‌గా రాజబాబు ఎక్సటర్నల్ ఎగ్జామ్స్‌కి ఇచ్చే రిలీవింగ్ సర్టిఫికెట్ల పైన, యూనివర్సిటీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన మార్కుల జాబితాలపై అధికారికంగా  సంతకాలు చేసినట్టు సమాచారం. అయితే దీనిపై స్పందించడానికి తమ వద్ద పూర్తి సమాచారం లేదని  అధికారులు అంటున్నారు.

మరిన్ని వార్తలు