సీఎం సారూ.. ఇవిగో వేదనాశ్రువులు

19 Dec, 2018 13:45 IST|Sakshi
బెడ్లు లేక బాలింతల దుస్థితి

జీజీహెచ్‌లో అడుగడుగునా సమస్యలే

వైద్య పరికరాలు, వసతులు లేక రోగుల అవస్థలు

నిధులు విడుదల కాక ఆగిన గుండె మార్పిడి, కీళ్లమార్పిడి ఆపరేషన్లు

ఎంసీహెచ్‌కు సీఎం శంకుస్థాపన నేడు

పేదల ఆస్పత్రిగా పేరు పొందిన గుంటూరు జీజీహెచ్‌లోఅడుగడుగునా సమస్యలు తిష్టవేశాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆస్పత్రి కీర్తి మసకబారుతోంది. వైద్య పరికరాలు సమకూర్చడంలో, వసతుల కల్పనలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం పేదలను ఉచిత వైద్యానికి దూరం చేస్తోంది. అవసరమైన పడకలు లేక, వైద్య సిబ్బంది కరువై గుండెమార్పిడి, మోకీళ్ల ఆపరేషన్లు సైతం నిలిచిపోయాయి.

సాక్షి, గుంటూరు: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకున్న అనేక మంది వైద్యులు జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. పీపీపీ విధానం ద్వారా ఇప్పటికే జీజీహెచ్‌ మిలీనియం బ్లాక్‌లో సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే వైద్య బృందం 550 వరకూ గుండె ఆపరేషన్లు చేశారు. దాతల సాయం, సొంత డబ్బులతో నలుగురు నిరుపేద రోగులకు గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించి దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిపారు. గుండె మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా ఆరోగ్యశ్రీలో చేర్చాలని డాక్టర్‌ గోఖలే ఉన్నతాధికారులను కోరడంతో సరేనని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. నిధులు మాత్రం మంజూరు చేయలేదు. ఆపరేషన్లు మాత్రం జరగడం లేదు.  

పడకలు, సిబ్బంది కొరతతో ఇక్కట్లు...
జీజీహెచ్‌లో పడకల సంఖ్యను 50 శాతం పెంచాలని అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆస్పత్రిలో 1177 పడకలు ఉండగా అదనంగా 589 పడకలు కావాలని కోరారు. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ పడకలు పెంచుతామంటూ హామీ ఇచ్చారు. మూడేళ్లు గడిచినా అమలుకు మాత్రం నోచుకోలేదు. అదనపు పడకలు మంజూరు చేస్తే డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, నాల్గో తరగతి ఉద్యోగుల పోస్టులు మంజూరవుతాయి. ప్రస్తుతం సరిపడా పడకలు లేకపోవటంతో ఒకే పడకపై ఇద్దరు లేదా ముగ్గురు రోగులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. రోజుకు 3500 నుంచి 4000 మంది రోగులు ఓపీలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో 60 ఏళ్ల క్రితం మంజూరు చేసిన పడకలు, పోస్టులే నేటికీ ఉన్నాయి. ఆస్పత్రిలో 5 ప్రొఫెసర్, 30 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. నర్సులు కేవలం 186 మంది మాత్రమే ఉన్నారు. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం సుమారు 400 మంది ఉండాలి. గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి, మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు పెద్దాసుపత్రిలో చేస్తూ ఉండటంతో రోగులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. గుండె మార్పిడి ఆపరేషన్‌లకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవటంతో సుమారు 25 మంది ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లకు కోసం 700 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవటంతో వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

మందులు బయట కొనుక్కోవాల్సిన దుస్థితి
జీజీహెచ్‌లో రెండేళ్లుగా మందుల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు.  సర్జికల్‌ బడ్జెట్‌ సైతం నిలిపివేయడంతో ఆపరేషన్‌ చేయించుకునే రోగులే సర్జికల్‌ బ్లేడ్‌లు, ఇంజెక్షన్‌లు, కాటన్‌ వంటివి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సర్జికల్, మెడిసిన్‌ కొనుగోలుకు మూడు నెలలకు రూ.60 లక్షల చొప్పున మంజూరు చేయాల్సి ఉండగా, 25 నెలలుగా సర్జికల్‌ బడ్జెట్, 14 నెలలుగా మెడికల్‌ బడ్జెట్‌ను నిలిపివేశారు.

ఎంసీహెచ్‌ వార్డుకు రెండోసారి శంకుస్థాపన
రూ.65 కోట్లతో మాతాశిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్‌) నిర్మించేందుకు 2015 అక్టోబర్‌ 2Ðన సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.  అప్పటి నుంచి ఒక్క ఇటుక పడలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి సీఎం శంకుస్థాపన చేస్తున్నారు.

మరిన్ని వార్తలు