వీళ్లు ఎవరికీ చిక్కరు.. దొరకరు

29 Mar, 2019 13:20 IST|Sakshi

టీడీపీ క్యాంప్‌లో ఆర్థిక అలజడి

అంతా బీద చూసుకుంటారని సీఎం ఆజ్ఞ

చేతులెత్తేస్తున్న అసెంబ్లీ అభ్యర్థులు  

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:   బీద క్యాంపులో ఆర్థిక అలజడికి తెరలేచింది. వారం రోజులుగా బీద క్యాంపు చుట్టూ అధికార పార్టీ అభ్యర్థులు చక్కర్లు కొడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆర్థిక వ్యవహారం అంతా బీద బ్రదర్స్‌ చూసుకుంటారని జిల్లాకు వచ్చినప్పుడు అభ్యర్థులకు చెప్పి వెళ్లారు. అయితే ఇప్పటివరకూ రూపాయి కూడా విదల్చలేదని కొందరు అభ్యర్థులు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు. మరికొందరైతే డబ్బులు ఇవ్వకుండానే పెత్తనం చేస్తున్నారని కినుకు వహిస్తున్నారు. దీనికితోడు వైఎస్సార్‌సీపీలోకి నేతలు పెద్ద ఎత్తున వలసల బాట పట్టడంతో అధికార పార్టీకి చెందిన క్యాంపు సతమతమవుతోది. ఇక అందర్నీ సమన్వయం చేయాల్సిన జిల్లా అధ్యక్షుడు, బీద మస్తాన్‌రావు సోదరుడు రవిచంద్ర చిక్కడు.. దొరకడు తరహాలో తప్పించుకుని  తిరుగుతుండడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. 

నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోని అధికార పార్టీ నుంచి అభ్యర్థులుగా దిగిన వారిలో ఒకరు ఇద్దరు మినహా అందరూ బడాబాబులే. దీంతో పెద్ద ఖర్చు లేకుండా ఎన్నికల బరిలో తలపడవచ్చన్న బీద బ్రదర్స్‌కు అభ్యర్థులు చుక్కలు చూపిస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించారు. చివరకు నెల్లూరు రూరల్, కావలికి అభ్యర్థి దొరక్క మొదట తిరస్కరించిన నేతలకే టికెట్లు ఇచ్చారు. దీంతో మొదట భారీగా ఖర్చు పెడతామని ప్రచారం చేసుకున్న నేతలు అంతా సర్దుకున్నారు. అసలే పార్టీ పరిస్థితి చూస్తే మెరుగ్గా లేకపోవడం, రూ.కోట్లు ఖర్చు చేసినా గెలిచే పరిస్థితి లేదని అర్థమైన నేతలు భారీగా ఖర్చు చేయడానికి ముందుకు రావడం లేదు.

ఏదో బీద ఇస్తే ఖర్చు చేయాలనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ పరిస్థితి అర్థమైన బీద పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయనని మొండికేసిన బీద మస్తాన్‌రావు ఎట్టకేలకు పార్టీ అధినేత ఒత్తిడితో ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి ఎంత సర్దుబాటు చేయాలనే దానిపై బీద బ్రదర్స్‌ తలలు పట్టుకుని కుర్చోన్నారు. ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేది ముందుగానే చంద్రబాబు ఫైనల్‌ చేసి నేతలకు చెప్పి వెళ్లినట్లు సమాచారం. అయితే గత వారం నుంచి మినీబైపాస్‌ రోడ్డులోని బీద క్యాంపుల్లో మాత్రం రోజు అభ్యర్థులు ఆర్థిక మంతనాలు చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా కావలి అభ్యర్థిగా కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిని బీద సోదరుల మద్దతుతో టికెట్‌ ఇచ్చారు.

ఆయన ఖర్చు మొత్తం కూడా తామే చూసుకుంటామని చెప్పారు. నామినేషన్‌ ఘట్టం, స్క్రూటినీ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఒక్క రూపాయి ఇవ్వకపోవడంతో విష్ణువర్ధన్‌రెడ్డి కినుక వహించినట్లు సమాచారం. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు రెండో సారి టికెట్‌ ఇచ్చారు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి లేక చేతులెత్తేసిన క్రమంలో ఎంపీ అభ్యర్థి చూసుకుంటాడని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఆర్థిక వ్యవహరాలు కూడా మాట్లాడుకున్నారు. కానీ డబ్బులు మాత్రం చేతికి అందలేని బొల్లినేని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ తన పని తన ఓటు మాత్రమే తాను చూసుకుంటున్నట్లు సమాచారం. ఇక నెల్లూరు రూరల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ది మాత్రం విచిత్ర పరిస్థితి.

గతంలో నెల్లూరు రూరల్‌ లేదంటే సిటీ టికెట్‌ కోసం బలంగా ప్రయత్నాలు చేసిన అజీజ్‌ భంగపడ్డారు. నెల్లూరు పార్లమెంట్‌ టికెట్‌ అయినా తనకు ఇస్తే గట్టిగానే ఖర్చు పెట్టుకుంటానని సీఎంకు మొర పెట్టుకున్నాడు. అయితే చివరి నిమిషంలో నెల్లూరు రూరల్‌ టికెట్‌ దక్కడంతో ఆర్థికంగా పూర్తిగా చేతులెత్తేసి మీరే అంతా చూసుకోవాలని చెప్పినట్లు సమాచారం. దీంతో నగర అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి నారాయణ, ఎంపీ అభ్యర్థి నుంచి సహకారం ఉంటుందని చెప్పారు. అయితే మంత్రి నారాయణ సహకారం మొదలయింది కానీ పెత్తనం అంతా నారాయణ క్యాంప్‌దే కావడంతో మేయర్‌ వర్గంలో తీవ్ర అలజడి రేగింది. కేవలం ఎన్నికల ప్రచారంలో నమస్కారం పెట్టుకుంటూ తిరగడానికే మేయర్‌ పరిమతం అయినట్లు సమాచారం.

ఇక రాత్రి వ్యవహారాలన్ని నారాయణ క్యాంపు నుంచి ఆయన సన్నిహితుడు తన సొంత టీమ్‌తో నడుపుతుండటంతో అజీజ్‌ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.  ఇక మరో అసెంబ్లీ అభ్యర్థికి ఆ నియోజకవర్గంలో భారీ వలసలు షాక్‌ను ఇచ్చాయి. దీంతో సదరు అభ్యర్థి కుటుంబ సభ్యులు ఎంత ఖర్చు చేసినా గెలవలేము.. కాబట్టి డబ్బు ఖర్చు చేయొద్దని సదరు అభ్యర్థి కుమారుడు గట్టిగా చెప్పటంతో అక్కడ గందరగోళం రేగింది. దీంతో అప్పటి దాక ఎంపీ అభ్యర్థి నుంచి ఆర్థిక సహకారం వద్దన్న సదరు అభ్యర్థి రెండు రోజుల నుంచి అభ్యర్థి క్యాంపు చుట్లూ చక్కర్లు కొడుతున్నాడు. మొత్తం మీద ఒక్క అభ్యర్థికి కూడా చెప్పినది ఇవ్వకుండా ఇంకా బాబు గారి నుంచి అనుమతి రాలేదంటూ కాలం గడుపుతుండటం పార్టీలో చర్చనీయాశంగా మారింది.   

మరిన్ని వార్తలు