పాపం.. బలి‘పశువులు’

24 Jul, 2019 10:05 IST|Sakshi
కొత్తపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్న పశు మాంసం రవాణా చేస్తున్న కంటైనర్‌

లారీల కొద్దీ తరలిస్తున్న పశు మాంసం

రోజూ రూ.లక్షల్లో వ్యాపారం

అడ్డాగా మారిన నియోజకవర్గం

సాక్షి, పిఠాపురం (తూర్పు గోదావరి): పశుగ్రాసం కొరత, వ్యాధులు పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు పశువులను మేప లేక తెగనమ్ముకుంటున్నారు. దీంతో రోజూ వందలాది పశువులు వధించి వందలాది టన్నుల పశు మాంసం రవాణా భారీగా సాగుతోంది. ఇటీవల పశు మాంసంతో వెళుతున్న టాటా ఏస్‌ వ్యాన్‌ ఒక వ్యక్తిని గొల్లప్రోలు మండలం తాటిపర్తి రోడ్డులో ఢీకొట్టిన సంఘటనతో పశు మాంసం తరలిస్తున్న విషయం బయటపడింది. ఇతర జిల్లాల నుంచి ఎక్కువ మొత్తంలో పశు మాంసం నియోజకవర్గం మీదుగా తరలిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల నుంచి పదుల సంఖ్యలో లారీల్లో పశు మాంసాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. హైవేపై వెళితే ఇబ్బందులు వస్తాయని తుని నుంచి పిఠాపురం నియోజకవర్గం మీదుగా తరలిస్తున్నారు.

టన్నుల కొద్దీ రవాణా 
రోజూ నియోజకవర్గం నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి పశు మాంసం లారీలపై టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. పోలీసులు ముడుపులు తీసుకుని పట్టుకున్న మాంసం కొంత ధ్వంసం చేసి మొక్కుబడిగా కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పట్టుబడిన మాంసంలో అధిక శాతం వ్యాపారులు తిరిగి తీసుకువెళ్లేలా లాబీయింగ్‌ సాగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. రెండు నెలల్లో పది లారీలకు పైగా పశు మాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు. తాజాగా కొత్తపల్లి పోలీసులు సోమవారం ఒక కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న ఆరుటన్నుల పశుమాంసాన్ని, కంటైనర్‌ను స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఆ మాంసాన్ని ఉప్పాడ తీరంలో పూడ్చిపెట్టారు.

ఎక్కడ చూసినా అక్రమ కబేళాలే
గొల్లప్రోలు మండలం చెందుర్తి, కొడవలి, తదితర గ్రామాలతో పాటు పిఠాపురం పట్టణ నడిబొడ్డున అక్రమ కబేళాలు ఉన్నట్టు సమాచారం. చీకటి పడితే జనరేటర్ల లైట్ల వెలుగులో పశు వధ ప్రారంభమవుతుందని, పశువుల తలలు ఎండిన తరువాత దుమ్ములు, కొమ్ములను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తోంది. 216 జాతీయ రహదారి పక్కనే ఉండడంతో రవాణాకు వీలుగా ఈ ప్రాంతాలను అడ్డాలుగా చేసుకున్నారు. కబేళాల్లో ఎక్కువగా గోవులు, లేగ దూడలను వధిస్తున్నట్టు పలువురు చెబుతున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం
అక్రమ కబేళాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. దాడులు ముమ్మరం చేశాం. అక్రమంగా తరలిస్తున్న పశువులను స్వాధీనం చేసుకుంటున్నాం. పలువురిపై కేసులు నమోదు చేశాం. అనుమానితులను పిలిపించి హెచ్చరికలు జారీ చేశాం. పిఠాపురం పశువుల సంతలో ప్రతి శనివారం పోలీసులను ఏర్పాటు చేసి పాడి పశువులను తప్ప కొనుగోళ్లు సాగుకుండా చూస్తున్నాం.
– అప్పారావు, పిఠాపురం సీఐ

మరిన్ని వార్తలు