యాచకోత్తముడు

12 Jun, 2020 11:06 IST|Sakshi

20 ఏళ్లుగా ఆలయాల వద్ద భిక్షాటన  

ఇప్పటివరకు రూ.8 లక్షలకు పైగా విరాళం

కనకదుర్గమ్మ నిత్యాన్నదానానికి రూ.లక్ష

సాయిబాబా గోశాలకు రూ.3 లక్షలు

రూ.లక్షన్నరతో సీతారాములకు కిరీటాలు

విజయవాడలోఓ యాచకుని ఔదార్యం

‘ఆయన ఎవరినీ చేయి చాచి అడగడు. కమండలం చేతబట్టి గుడి వద్ద కూర్చుంటాడు. గుడికొచ్చిన భక్తులు తమకు తోచినంత వేస్తారు. ఇలా కూడబెట్టిన సొమ్మును తిరిగి దేవుళ్లూ, దేవాలయాలకే విరాళంగా ఇచ్చేస్తున్నాడు’ అని సాయిబాబా మందిరం కోశాధికారి సత్యశ్రీహరి ‘సాక్షి’తో చెప్పారు.  కోట్లు ఉండీ ఏం లాభం...ఇచ్చే మనసుండాలే కానీ...ఉన్న దాంట్లోనే పదిమందికీ ఉపయోగపడే విధంగా దానధర్మాలు చేసే వారే ఉత్తమోత్తములు. అటువంటి వారి కోవలేకే వస్తారు యడ్ల యాదిరెడ్డి. ఆయన చేసేది భిక్షాటనే అయినా...సర్వసంగ పరిత్యాగి అయిన ఆయనకు వాటితో పనేముంది...ఏదో రెండు పూటలా నాలుగువేళ్లు నోట్లోకెళితే చాలు గదా...అందుకే ఈ చేత్తో పుచ్చుకున్న దానాన్ని...ఆ చేత్తో తిరిగిచ్చేస్తూ గొప్ప మనసున్న దానకర్ణుడనిపించుకుంటున్నాడు.

సాక్షి, అమరావతి బ్యూరో: ఆయన దేవాలయాల్లో జరిగే అన్నదానాలకు విరాళాలిస్తాడు. లక్షలు వెచ్చించి ఆలయాల్లో దేవుళ్లకు కిరీటాలు పెట్టిస్తాడు. గోశాల నిర్మాణానికి నిధులిస్తాడు.ఇదంతా  చూసి ఆయన గొప్ప శ్రీమంతుడు అనుకుంటున్నారా...కాదు.. ఆయన ఆలయం ముందు సాధువు. ఆలయాల వద్ద నలుగురూ వేసిన డబ్బు పైసా పైసా కూడబెట్టి ఆ సొమ్మును తిరిగి దేవుళ్లకే ఇచ్చేస్తుంటాడు. ప్రస్తుతం విజయవాడ నగరంలో ఉంటున్న ఆయన పేరు యడ్ల యాదిరెడ్డి. స్వగ్రామం తెలంగాణలోని నల్గొండ జిల్లా చింతపల్లి. దేవుళ్లకు దాత అయిన యాదిరెడ్డి కథాకమామీషు ఇదీ..!

పదేళ్ల వయసులోనే...
తల్లిదండ్రులు లేని యాదిరెడ్డి పదేళ్ల వయసులోనే రైలెక్కి విజయవాడ వచ్చేశాడు. నలభై ఏళ్ల పాటు బెజవాడ రైల్వేస్టేషన్‌ కేంద్రంగా రిక్షా తొక్కాడు. ప్లాట్‌ఫారాలపై నిద్రించాడు. బ్రహ్మచారిగా ఉండిపోయిన యాదిరెడ్డి ఒంట్లో ఓపిక నశించాక అనారోగ్యం పాలై ఇరవై ఏళ్ల క్రితం భిక్షాటన బాట పట్టాడు. తొలుత విజయవాడ ముత్యాలంపాడు కోదండరామ ఆలయం వద్ద బిచ్చమెత్తేవాడు. ఆ తర్వాత సమీపంలోని షిర్డీ సాయిబాబా మందిరానికి మకాం మార్చాడు. తనకు తిండి, బట్ట కూడా ఆలయం వారే సమకూర్చుతుండటంతో భక్తులిచ్చిన సొమ్మంతా బ్యాంకులో దాచుకునేవాడు. కొన్నాళ్లకు అనారోగ్యం పాలై బతకడం కష్టమని వైద్యులు చెప్పగా, బతికి బట్టకడితే తాను రోజూ యాచన చేసే సాయిబాబా గుడికి రూ.లక్ష ఇస్తానని మొక్కుకున్నాడు. ప్రాణాపాయం తప్పడంతో తాను దాచుకున్న సొమ్ము ఆలయం నిర్వాహకులకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. బిచ్చమెత్తుకునే యాదిరెడ్డి.. ఆలయానికి రూ.లక్ష ఇస్తానంటే వారు నమ్మలేదు.

అన్నట్టుగానే రూ.లక్ష ఇవ్వడంతో వారంతా అవాక్కయ్యారు. ఆ సొమ్ముతో ఆలయ ప్రాÆగణంలో దత్తాత్రేయ విగ్రహం ఏర్పాటు చేశారు. దత్తాత్రేయుడి తొడుగులకు రూ.20 వేలు, బాబా ఆలయంలో అన్నదానానికి మరో రూ.20 సమకూర్చాడు. సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమికి లక్షా ఎనిమిది వేల కొబ్బరికాయలతో అభిషేకం నిర్వహించే సందర్భంగా యాదిరెడ్డి ఒక్కో కొబ్బరికాయకు రూపాయి చొప్పున రూ.లక్షా 8 వేలను ఇచ్చాడు. ఈ ఆలయానికి సమీపంలోనే గోశాల నిర్మాణానికి మరో రూ.3 లక్షలు విరాళమిచ్చాడు. ఆ గోశాలకు దాతగా యాదిరెడ్డి పేరు పెట్టారు. కోదండ ఆలయ నిర్వాహకుల కోరిక మేరకు రూ.లక్షన్నర వెచ్చించి సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతులకు వెండి కిరీటాలు చేయించాడు. తనకు కనకదుర్గమ్మే బెజవాడలో భిక్ష పెట్టిందన్న భావనతో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.లక్షా 116లు విరాళంగా ఇచ్చాడు. ఇలా యాదిరెడ్డి ఇప్పటివరకు సుమారు రూ.8 లక్షలకు పైగా దేవుళ్లు, దేవాలయాలకు విరాళంగా సమకూర్చాడు.

నాద్వారా భగవంతునికిస్తున్నారు..  

భక్తులు భగవంతునికి నా ద్వారా డబ్బులిస్తున్నారన్నది నా భావన. అదంతా భక్తుల గొప్పదనం. నాకు తిండీ, బట్ట అన్నీ ఆలయ నిర్వాహకులు, భక్తులు సమకూరుస్తున్నారు. నాకింకేమి కావాలి? నాకు భిక్షగా వచ్చేదంతా తిరిగి భగవంతునికే ఇచ్చేస్తున్నా. నేను మరణించే ముందు నా దగ్గరున్నదంతా దేవుడికే ఇచ్చేస్తా.          –యడ్ల యాదిరెడ్డి, యాచకుడు.

మరిన్ని వార్తలు