ధర్మవరం పోలీసుల దొంగాట

21 Jan, 2020 07:23 IST|Sakshi

ఓ మహిళ కన్నీళ్లకు కరగని ఖాకీలు 

కేసు నమోదులో మీనమేషాలు 

జిల్లా ఎస్పీని తప్పుదోవ పట్టించే యత్నం 

ఏకంగా ఫిర్యాదుదారు పేరు మార్పు 

అవతలి వ్యక్తులతో మిలాఖత్‌

దిశ చట్టంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దన్నుగా నిలుస్తోంది. జిల్లా పోలీసు బాస్‌ కూడా ఆ దిశగానే శాఖ గౌరవాన్ని పెంపొందిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలోనే భిన్నమైన పరిస్థితి ఎదురవుతోంది. మట్కా, ఇసుక అక్రమ రవాణా.. తదితర వ్యవహారాల్లో తలదూర్చిన పోలీసులను ఎప్పటికప్పుడు సస్పెండ్‌ చేస్తున్నా, ఇప్పటికీ కొందరి తీరు పోలీసు శాఖను అప్రతిష్టపాలు చేస్తోంది. న్యాయం చేయండని పోలీసు స్టేషన్‌ తలుపు తట్టిన ఓ యువతి విషయంలో ధర్మవరం పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే ఉన్నతాధికారుల ఆదేశాలను ఏ స్థాయిలో నీరుగారుస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. 

నవంబర్‌ 11, 2019 
వీఆర్వో మారుతి ప్రసాద్‌ నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. నిశ్చితార్థం ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి ప్రచారం చేశాడు. ఇప్పుడు అదనపు కట్నం కోసం వేధిస్తూ పెళ్లికి నిరాకరించాడు. 
– ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో బాధిత యువతి ప్రతిమ ఫిర్యాదు  

డిసెంబర్‌ 9, 2019 
ప్రతిమ కన్నీళ్లకు ధర్మవరం పోలీసుల మనసు కరగలేదు. విధిలేని పరిస్థితుల్లో ఆమె జిల్లా ఎస్పీని స్వయంగా కలిసి తన గోడు వినిపించారు. స్పందించిన ఆయన వెనువెంటనే ధర్మవరం పోలీసులకు ఫోన్‌ చేసి కేసు నమోదుకు ఆదేశించారు. 

ఇదీ పోలీసు తెలివి 
బాధితురాలి ఫిర్యాదును కాదని.. పూర్తిగా కేసును తారుమారు చేశారు. అదనపు కట్నం అనే ప్రధాన ఆరోపణను తక్కువ చేసి.. కేవలం నిశి్చతార్థం అయిన తర్వాత తమ ఇంట్లో అశుభాలు జరగడం కారణంగా పెళ్లి వద్దనుకుంటున్నట్టు ఫిర్యాదును మార్చేశారు. అది కూడా ఆమె సోదరుడు ఫిర్యాదు చేసినట్లుగా చూపి కేసును నీరుగార్చడం గమనార్హం. 

సాక్షి, అనంతపురం: ఓ మహిళ తనకు అన్యాయం జరిగిందని పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కితే.. ఆ ఖాకీల హృదయం కరగలేదు. నెల రోజుల పాటు వేచి చూసినా కనీస స్పందన కరువైంది. ఇక అక్కడ న్యాయం జరగదని తెలుసుకున్న ఆమె జిల్లా పోలీసు బాస్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టింది. స్పందించిన ఆయన వెనువెంటనే ధర్మవరం పోలీసులకు ఆదేశాలు జారీ చేసినా.. ఆయననూ తప్పుదోవ పట్టిస్తూ ధర్మవరం పోలీసులు ఆడిన నాటకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాలివీ.. ధర్మవరంలో నివాసం ఉంటున్న ప్రతిమకు వీఆర్వోగా పని చేస్తున్న మారుతి ప్రసాద్‌తో వివాహ నిశ్చితార్థమైంది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించిన మారుతి ప్రసాద్‌ వివాహానికి నిరాకరించాడు. ఈ విషయమై బాధితురాలు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె నేరుగా స్పందన ద్వారా ఎస్పీ కార్యాలయంలోనే ఫిర్యాదు చేసింది.
 
ఫిర్యాదు చేసింది ఒకరైతే.. 
వాస్తవానికి ధర్మవరంలో నివసించే ప్రతిమ తనను మారుతి ప్రసాద్‌ మోసం చేశారంటూ 11 నవంబర్‌ 2019లో ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. దీంతో ఏకంగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని 9 డిసెంబర్‌ 2019న ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ జోక్యం చేసుకుని నేరుగా ధర్మవరం పోలీసులకు ఫోన్‌ చేసి కేసు వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మవరం అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అది కూడా గతంలో స్వయంగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మీద కాకుండా ఆమె సోదరుడి పేరు మీద ప్రత్యేకంగా ఒక ఫిర్యాదును పోలీసులే తయారు చేసినట్టు తెలుస్తోంది. ఆమె మొదట ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా.. ఎవరెవరు తమను వేధించారనే వివరాలను స్పష్టంగా పేర్కొంది.

అయితే, ఈ ఫిర్యాదులో ఉన్న వారి పేర్లను తొలగించి.. పోలీసులు తాము తయారుచేసిన ఫిర్యాదులో వేరే పేర్లను చేర్చారు. అంతేకాకుండా అదనపు కట్నం అనే ప్రధాన ఆరోపణను తక్కువ చేసి.. కేవలం నిశి్చతార్థం అయిన తర్వాత తమ ఇంట్లో అశుభాలు జరగడం కారణంగా తాము పెళ్లి వద్దనుకుంటున్నట్టు ఫిర్యాదును మార్చివేశారు. మొత్తంగా కేసును నీరుగార్చేందుకే ఈ విధంగా ఫిర్యాదును తప్పుదోవ పట్టించినట్టు తెలుస్తోంది. స్పందనలో ఇచ్చిన ఫిర్యాదును పక్కనపెట్టి మరీ కొత్త ఫిర్యాదును ఎందుకు రాశారనేది పరిశీలిస్తే మొత్తం వ్యవహారం ఇట్టే అర్థమవుతుంది. ఈ వ్యవహారంలో ధర్మవరం పోలీసుల వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవతలి వారితో చేతులు కలిపి కేసును నీరుగారుస్తున్నట్టు తెలుస్తోంది.
 
ఆది నుంచీ అంతే.. 
ధర్మవరం పోలీసుల వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇసుక సరఫరాలో కూడా చేతులు తడిపినట్టు తెలుస్తోంది. మరోవైపు తమ వద్దకు ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారితో కూడా వారు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఒక సీఐ భారీగా అవినీతికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. సదరు అధికారి అవినీతిపై అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ.. ఉన్నతాధికారి కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్‌బాస్‌ సీరియస్‌గా దృష్టిసారిస్తే మినహా ఇక్కడ పరిస్థితి చక్కబడే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు