అధికారుల నిర్లక్ష్యంతోనే అవినీతి

16 Jan, 2014 04:25 IST|Sakshi

ఇంద్రవెల్లి/ఇచ్చోడ, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్రం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర అవార్డు కమిటీ సభ్యుడు అశ్విన్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఈజీఎస్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పనుల వివరాలను ఏపీవో రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. పనుల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం నిర్వహణపై అధ్యయనం చేయడానికి ఢిల్లీ నుంచి రెండు బృందాలుగా వచ్చామని తెలిపారు. రెండు నెలలుగా చేస్తున్న అధ్యయనంలో భాగంగా జిల్లాలో అవినీతి అక్రమాలు వెలువడుతున్నాయని, అయినా జిల్లా అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
 
 దీంతో నిధులు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. రెండు నెలలుగా శ్రీకాకుళం, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఏటా ఉత్తమంగా పనులు చేసి అభివృద్ధి చేసిన జిల్లాల అధికారులకు ఫిబ్రవరి 2న అవార్డులు అందిస్తామని, అందులో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. జనవరి 26న కేంద్ర కమిటీలో సమవేశమై అవార్డులు అందించే జిల్లాలను ఎంపిక చేస్తామని తెలిపారు. ఆయన వెంట జిల్లా అడిషనల్ పీడీ కృష్ణ ఉన్నారు. అలాగే అనంతరం ఇచ్చోడ మండల కేంద్రంలోని ఉపాధి కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి రికార్డులు పరిశీలించారు. స్థానిక ఈవోఆర్డీ దేవేంద్రరెడ్డి, ఈజీఎస్ ఏపీవో వసంత్‌రావు, పంచాయతీ కార్యదర్శి సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు