అనకాపల్లి బెల్లానికి విభజన దెబ్బ

21 Feb, 2016 23:23 IST|Sakshi

జాతరకు తగ్గిన బెల్లం ఎగుమతి
గతంలో 250 లారీలు... ఇప్పుడు వెళ్లింది 15 లారీలే
ప్రభుత్వ విధానాలతో వ్యాపారుల నిరాశ

 
జాతీయ స్థాయిలో రెండో స్థానంలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్ పై రాష్ట్ర విభజన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇక్కడి మార్కెట్ ప్రాభవం కోల్పోయి కుదేలవుతోంది. గతంలో ఇక్కడి నుంచి తెలంగాణాలో నిర్వహించే మేడారం (సమ్మక్క - సారలమ్మ) జాతరకు 250కి పైగా లారీల బెల్లం తరలి వెళ్లేది. ప్రస్తుతం 15 లోడ్లు మాత్రమే వెళ్లడం ఇక్కడి వ్యాపారులను కలవరపెడుతోంది.  
 
అనకాపల్లి: ఇక్కడి నుంచి సమ్మక్క- సారలమ్మ జాతరకు తరలివెళ్లే బెల్లం ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ విధానాలతో మరికొన్ని అంశాలు అనకాపల్లి బెల్లానికి గిరాకీ తగ్గడానికి కారణమయ్యాయని బెల్లం వ్యాపారులు విశ్లేషిస్తున్నారు.  రెండేళ్లకోసారి వరంగల్ జిల్లా మేడారం  కొండల్లో నిర్వహించే సమ్మక్క-సారలమ్మ జాతరకు అనకాపల్లి బెల్లం మార్కెట్ నుంచి భారీగా బెల్లాన్ని తరలించేవారు.  గతంలో 250 లారీల బెల్లం వరకూ మేడారానికి తరలిపోయేది. ఈ జాతరలో మొక్కు తీర్చుకునే భక్తులు, గిరిజనులు వారి బరువుతో సమానంగా బెల్లాన్ని అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ. ఈ కారణంగా బెల్లానికి మంచి గిరాకీ ఉంటుంది. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు  ఎటువంటి ఆంక్షలు, పన్నులు ఉండేవి కావు.   విడిపోయిన తరువాత మేడారం జాతరలో విక్రయించే అనకాపల్లి బెల్లం పరాయిదైపోయిది.   ఈ ఏడాది ఆ జాతరకు అనకాపల్లి బెల్లం మార్కెట్ నుంచి కేవలం 15 లారీల బెల్లం   వెళ్లింది. ఈ నెల 17న మొదలైన జాతర 20తేదీతో ముగిసిన తరువాత అనకాపల్లి వర్తకులు వేసిన లెక్కల మేరకు వ్యాపారం గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. మనం కోల్పోయిన బెల్లం వ్యాపారాన్ని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు తన్నుకుపోయాయని ఇక్కడి వర్తకులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆ రాష్ట్రాల్లో బెల్లం దిగుబడి అధికంగా ఉండటంతో  ధర కూడా కాస్త  తక్కువగా ఉంటుందని అంటున్నారు.

ఆంక్షలు కూడా ప్రభావితం..
అనకాపల్లి బెల్లాన్ని వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు, ఖమ్మం జిల్లా కొత్తగూడెం, భద్రచలం, ఇల్లందు  పరిసరాలకు తరలించేవారు.   ఈ ఏడాది   జిల్లా మేడారంలో 15 దుకాణాలకు మాత్రమే అనుమతివ్వడం, ఖమ్మం జిల్లాల్లోకి మహారాష్ట్ర బెల్లం రావడంతో ఆ ప్రభావం అనకాపల్లి బెల్లంపై పడింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో నల్ల బెల్లం రవాణాపై కొనసాగుతున్న ఆంక్షలు, దాడులు బెల్లం వర్తకుల్ని కుదేలు చేస్తున్నాయి. సారాతో ఎవరైనా పట్టుబడినపుడు  బెల్లం అమ్మిన రైతులపై కూడా కేసులు పెడుతుండటతో బెల్లం వర్తకులు బెంబేలెత్తి కేవలం తెల్లబెల్లాన్ని సరఫరా చేస్తున్నారు. కాని వాతావరణ, స్థానిక భూ స్థితిగతుల కారణంగా ఈ ప్రాంత రైతులు ఉత్పత్తి చేసే బెల్లంలో ఎక్కువగా నల్ల రకం వస్తోంది. దీని ఎగుమతులపై ఆంక్షలు ఉండటంతో రైతులతో పాటు వ్యాపారులు నష్టపోతున్నారు.

మేడారం జాతరకు వెళ్లింది తక్కువే
ఈ ఏడాది మేడారానికి  కేవలం 15 లారీల బెల్లమే వెళ్లింది. గతంలో 250 లారీల వరకు వెళ్లేది. బెల్లం విషయంలో ప్రభుత్వాల విధానాలు ఈ తగ్గుదలకు కారణం.  నల్లబెల్లం సారాకు వినియోగిస్తున్నారని   చెప్పి కేసులు పెడితే వ్యాపారం ఏమవుతుంది.   ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మన సంస్కృతి, మన వ్యాపారాలను రక్షించాలి.
- కర్రి సన్యాసినాయుడు, ఎస్‌ఎల్‌జీటి ప్రొప్రయిటర్, బెల్లం వర్తకుడు
 

>
మరిన్ని వార్తలు