గర్జించిన సమైక్య ఉద్యమం

2 Nov, 2013 01:27 IST|Sakshi

=గుడివాడలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం
 =చల్లపల్లిలో సకల జనుల గర్జన
 =నూజివీడులో విద్యార్థి గర్జన
 =వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సమైక్య ప్రతిజ్ఞలు
 =పంచాయతీల్లో తీర్మానాలు

 
 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున సమైక్య ఉద్యమం హోరెత్తింది. ఎన్జీవోల ఆధ్వర్యంలో గుడివాడలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు హాజరయ్యారు. చల్లపల్లిలో సకలజనుల గర్జన, నూజివీడులో విద్యార్థి గర్జన మిన్నంటాయి. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సమైక్య ప్రతిజ్ఞలు, పాలాభిషేకాలు నిర్వహించారు. విభజనాసురుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ పిలుపుమేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా పలు పంచాయతీలు తీర్మానం చేశాయి.
 
సాక్షి, గుడివాడ/ విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు సమైక్యాంధ్ర ఆకాంక్ష మరోసారి ఆకాశాన్నంటింది. జిల్లా అంతటా సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు హోరెత్తాయి.
 
గుడివాడ గుండె ఘోష

గుడివాడ గుండె సమైక్య సింహనాదంతో ఘోషించింది. పట్టణ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియం జనసంద్రమైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాంగణం నూతనోత్తేజంతో ఉప్పొంగింది. జాతీయపతాక రూపశిల్పి, ఈ జిల్లావాసి పింగళి వెంకయ్య సభావేదిక సమైక్య ఉద్యమానికి బహుముఖ వ్యూహంతో కార్యాచరణను ఖరారు చేసింది. ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యోగుల సమ్మె అనంతరం తొలిసారి గుడివాడలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ మహాసభ సమైక్య ఉద్యమాన్ని హోరెత్తించింది.

ఉద్యోగుల సమ్మె విరమణతో ఉద్యమం ఆగిపోయిందన్న ప్రచారానికి చెక్ పెడుతూ ఈ సభ స్పష్టతనిచ్చింది. తమ సమ్మె విరమణ తాత్కాలికమేనని, ఇది విశ్రాంతి మాత్రమేనని మరోమారు బహుముఖ వ్యూహంతో సమ్మెను కొనసాగిస్తామంటూ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు సమక్షంలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతినబూనారు. గుడివాడ సమైక్య ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో పాటు పలువురు సంఘాల నాయకులు ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు.

జిల్లాలో రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ నవంబరు, డిసెంబరు మాసాల్లో గ్రామగ్రామాన ఉద్యమనేతలు పర్యటించి రైతులు, ఉద్యోగులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు, ఉద్యోగులు కలిస్తే రాజకీయనేతల గతినే మార్చేస్తారని, రానున్న కాలంలో సమైక్యవాదంతో నిలిచే పార్టీలకే మద్దతు తెలిపేలా ప్రజలను సమాయత్తం చేయాలని మహాసభ సూచించింది.
 
రాష్ట్ర విభజన వలన కలిగే నష్టాన్ని తొలిదశ ఉద్యమంతోనే ప్రజలకు వివరించగలిగామని, మలిదశ ఉద్యమంతో సమైక్యవాదం కాపాడుకునేలా కార్యాచరణ ఉండాలని మహాసభ తీర్మానించింది. ఇప్పటివరకు గాంధీమార్గంలో జరిగిన ఉద్యమ తీవ్రతను రానున్న కాలంలో ఢిల్లీ గద్దెను గడగడలాడించేలా బహుముఖ రూపాల్లో కొనసాగించాలని మహాసభ నిర్ణయించింది. గుడివాడ మహాసభ ఇంత విజయవంతంగా నిర్వహించడం ఈ జిల్లావాడిగా గర్విస్తున్నానని, తాను గుడివాడలోనే ఓనమాలు దిద్దామని అశోక్‌బాబు అన్నారు. మహాసభలో మాట్లాడిన ఉద్యోగ, కార్మిక, కర్షక, మేధావుల, నిపుణులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆయా రంగాల్లో సీమాంధ్రకు జరిగే నష్టాన్ని వివరించారు.
 
తూర్పు కృష్ణా జేఏసీ చైర్మన్ ఉల్లి కృష్ణ అధ్యక్షతన  జరిగిన మహాసభలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రశేఖరరెడ్డి, వెస్ట్ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పి.వెంకటేశ్వరరావు మాదిగ, మున్సిపల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాధ్, చలసాని ఆంజనేయులు, జలవనరుల నిపుణుడు పి.ఎ.రామకృష్ణంరాజు, జిల్లా జేఏసీ కోకన్వీనర్ మండలి హనుమంతరావు, గుడివాడ జేఏసీ చైర్మన్ యార్లగడ్డ వెంకటేశ్వరప్రసాద్, ఎన్జీఓస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ఫరీద్‌బాషా, జి.రాజేంద్రప్రసాద్, డి.శ్రీనివాస్, పొట్లూరి గంగాధరరావు, ఎం.ప్రసాద్, వై.వి.రావు, కె.సత్యానందం, బి.అన్నపూర్ణ, ఎండీ ఇక్బాల్, నరహరశెట్టి శ్రీహరి, వరలక్ష్మి తదితరులు మాట్లాడారు.
 

మరిన్ని వార్తలు