బిగుసుకోని బెల్ట్‌..!

10 Aug, 2018 06:41 IST|Sakshi
సత్యవాడలో అనధికారికంగా నిర్వహిస్తున్న బార్‌లో సిట్టింగ్‌

నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్‌షాపులు

సత్యవాడ ఘటనతో వెలుగులోకి గొలుసు మద్యం దుకాణాలు

అధికారుల ఆదేశాలతో హడావుడిగా దాడులు

తాత్కాలికంగా మూతపడ్డ బెల్ట్‌షాపులు

పశ్చిమగోదావరి ,తణుకు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలతో అధికార పార్టీ నాయకులకు ఇప్పటికే గుబులు పట్టుకుంది. ఈ పథకాలపై ప్రజల్లో చర్చ రావడంతో జనాన్ని మభ్యపెట్టే పనిలో పార్టీ నాయకులు పడ్డారు. ఇందులో భాగంగానే బెల్ట్‌ దుకాణాలు తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు నీటిమీద రాతలే అయ్యాయి. అనధికార మద్యం విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించిన ఆదేశాలు వట్టివే అని తేలిపోయింది. తాజాగా ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో కల్తీ మద్యం తాగి ఇద్దరు యువకులు మృత్యువాత పడటంతో ఎక్సైజ్‌ అధికారులు మరోసారి పరుగులు పెడుతున్నారు. సత్యవాడ గ్రామంలో ఒక బెల్టుషాపులో కొనుగోలు చేసిన మద్యం తాగినందుకే ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారని పోలీసు,
ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా తేల్చడంతో బెల్టుషాపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అనధికార మద్యం విక్రయాలపై దాడులు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించి తూతూమంత్రంగా కొన్ని కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజా దాడులతో ప్రస్తుతం తాత్కాలికంగా మూతపడ్డాయి. మద్యం దుకాణాలకు దీటుగా బెల్టుషాపులు అమ్మకాలు సాగిస్తున్నాయి.

మూసివేత బూటకమే
బెల్ట్‌ షాపులను సమూలంగా మూసివేస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ తర్వాత మాట మార్చింది. మద్యం పాలసీల్లో భాగంగా తీసుకున్న విధాన నిర్ణయాల కారణంగా అప్రతిష్టను మూటకట్టుకుని మహిళల ఆగ్రహానికి గురైన ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తయినా ఇప్పటివరకు బెల్ట్‌ షాపులను నిరోధించకపోగా వీధి వీధినా పుట్టగొడుగుల్లా ఏర్పాటుకు పరోక్షంగా సహకరించిందనే ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బే«ఖాతరు చేస్తూ రాష్ట్ర రహదారుల స్థాయిని తగ్గిస్తూ జీవో జారీ చేసి మళ్లీ యథావి«ధిగా మద్యం దుకాణాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఈ పరిస్థితుల్లో బెల్ట్‌ షాపుల మూసివేత ప్రహసనమే అవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. రాష్ట్రప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన బెల్ట్‌షాపుల మూసివేత ఒక బూటకమని ప్రజలు అప్పట్లోనే ఆరోపించారు.

మద్యం షాపులకు లక్ష్యాలు
జిల్లాలో 474 మద్యం దుకాణాలు, 39 బార్‌లు ఉన్నాయి. ఆయా దుకాణాల ద్వారా ఏటా రూ.123 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. అయితే ఒక్కో దుకాణం పరిధిలో కనీసం 5 వరకు బెల్టు దుకాణాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ శివార్లోని కిళ్లీ దుకాణాలు, కిరాణా దుకాణాల్లో మద్యం విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రెస్టారెంట్లు పేరుతో అనధికార సిట్టింగ్‌లు వేసి మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా అమ్ముతున్నా కనీసం అధికారులు అటువైపు కన్నెత్తడం లేదు. ఎక్సైజ్‌ శాఖ అధికారులకు నెలవారీ మద్యం అమ్మకాలకు సంబంధించి లక్ష్యాలు విధిస్తున్నందున మద్యం వ్యాపారులు బెల్ట్‌ షాపుల ఏర్పాటుకు అధికారుల నుంచి అనధికార ఆమోదం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల మద్యం షాపుల ఏర్పాటును మహిళలు వ్యతిరేకిస్తున్నందున వ్యాపారులు బెల్ట్‌షాపుల ద్వారానే అత్యధికంగా విక్రయాలు జరిపేందుకు సన్నద్ధమవుతున్నారు. జాతీయ రహదారి వెంబడి హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లోనూ అనధికార బార్‌లు నిర్వహిస్తూ మద్యం అమ్మకాలను ప్రభుత్వం మరింత పెంచుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం పగలు సమయాల్లో చిన్నచిన్న బడ్డీ కొట్లుగా వ్యాపారాలు సాగిస్తూ రాత్రయ్యే సరికి బార్లుగా మార్చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఒక మద్యం దుకాణం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ దీనికి అనుబంధంగా గ్రామాల్లో పది నుంచి 15 వరకు బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎక్కువ శాతం బెల్టుషాపులు అధికార పార్టీ నాయకులు నడుపుతుండటంతో అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోప ణలు ఉన్నాయి. సత్యవాడ ఘటనతో మేల్కొన్న ఎక్సైజ్‌ శాఖ అధికారులు తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు