బెల్ట్‌ షాపులు రద్దు చేయాలి

18 Oct, 2013 02:58 IST|Sakshi

యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో బెల్ట్ షాపులను రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉం దని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురన వెంకటరత్నం అభిప్రాయపడ్డారు. తిరుపతికి వచ్చిన ఆమె గురువారం పద్మావతి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పడడం తో మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి అంతర్గత ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయాల్సిన అవసరం  ఉందని తెలిపారు. మహిళల విషయంలో నిర్భయ చట్టం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని, మనిషి ప్రవర్తనలో, ఆలోచనలో మార్పు రావాలని అన్నారు.
 
వరకట్న వేధింపులపై ఫిర్యాదు

 వరకట్నం కోసం భర్త, అత్త వేధిస్తున్నారంటూ చిత్తూరుకు చెందిన పీ.పర్వీన్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురన వెంకటరత్నంకు ఫిర్యాదు చేశారు. వడమాలపేటకు చెందిన నజీర్ సాహెబ్ కుమార్తెనైన తనకు చిత్తూరుకు చెందిన మహబూబ్ బాషాతో 2008లో పెళ్లి అయిందని, ఆ రోజు నుంచే తనకు వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. గత నెల ఒకటో తేదీన తీవ్రంగా కొట్టారని, అదే నెల నాలుగో తేదీన మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని కన్నీరుమున్నీరయ్యా రు. తనకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ చిత్తూరు ఎస్పీకి ఫోన్ చేసి, వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు.
 
పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించాలి

 జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న పారి శుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించాలని సంఘమిత్ర సర్వీస్ సొసైటీ ప్రతినిధులు అమర్‌నాథ్, చలపతి, కౌసల్య మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ను కోరారు. ఈ మేరకు వారు ఆమెకు వినతిపత్రం అందజేశారు.
 

మరిన్ని వార్తలు