భాష భద్రం.. ఆచారం శుద్ధం

11 Dec, 2019 09:55 IST|Sakshi
కొత్తరెడ్డిపాలెంలోని సమాజ మందిరం

సంస్కృతి, సంప్రదాయాలు మానవ జీవన స్రవంతిలో భాగాలు. ప్రతి ప్రాంతానికి.. దేశానికి  తమకంటూ ప్రత్యేక భాష, ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. వందల ఏళ్ల క్రితం ఇజ్రాయేల్‌లో   చోటుచేసుకున్న మారణకాండ నేపథ్యంలో చెల్లాచెదురైన యూదులు ఎన్నో దేశాల్లో తలదాచుకున్నారు. అలా వచ్చిన ఓ సమూహం తెలుగు గడ్డపై జనజీవనంలో కలసిపోయింది. అయితే తమ ఆచారాలు, భాష, సంప్రదాయాలను ఎన్నడూ వీడక ప్రత్యేకత చాటుకుంటోంది.

సాక్షి, తెనాలి: బెనె యాకోబ్‌ సినగాగె (సమాజ మందిరం) ఆంధ్రప్రదేశ్‌లో యూదుల ఏకైక ప్రార్థన మందిరం. చేబ్రోలు సమీపంలోని కొత్తరెడ్డిపాలెంలో నడుస్తోంది. వందల ఏళ్లుగా తెలుగు జనజీవన స్రవంతిలో ఈ యూదులు (ఇజ్రాయేల్‌ మూలాలు) కలిసిపోయారు. అయితే వారి మాతృభాష, ఆచార వ్యవహారాలను పరిరక్షిస్తున్న ‘సమాజ మందిరం’ నిర్వాహకుడు, ఏడుగురు పెద్దల నాయకత్వంలో అక్కడి 40 కుటుంబాల్లోని 300 మంది యూదులు తమ మూలాలను కాపాడుకుంటూ వస్తున్నారు.  

చెల్లాచెదురై.. తెలుగు గడ్డకు చేరి  
క్రీస్తుపూర్వం 772, 445ల్లో టర్కీ, బాబిలోన్‌ దాడులతో చెల్లాచెదురైన ఇజ్రాయెలీల్లో కొందరు పర్షియా, ఆఫ్ఘనిస్తాన్‌ మీదుగా జమ్మూకశ్మీర్‌లోకి చేరుకున్నారు. కొందరు ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకొని, తెలంగాణలో స్థిరపడ్డారు. తర్వాత అమరావతి చేరుకుని జీవనం సాగించారు. బ్రిటిష్‌ హయాంలో ఒకరికి ఉపాధ్యాయ ఉద్యోగం రావడంతో మకాం కొత్తరెడ్డిపాలేనికి  మారింది. 1909లో పూరిపాకలో ఆరంభించిన సమాజ మందిరాన్ని, 1991లో రాతిగోడలతో రేకుల షెడ్డుగా పునర్ని   ర్మించారు. సిఖ్యా అనే యూదుడు రాజుకు బహూకరించిన దీపస్తంభం నేటికీ అక్కడి మ్యూజియంలో ఉందని, అమరావతిలో తమవారి జీవనానికి అదొక సాక్ష్యమని మందిరం నిర్వాహకుడు సాదోక్‌ యాకొబి చెప్పారు.   

2004లో ప్రపంచానికి వెల్లడైన ఉనికి    
రాష్ట్రంలో యూదు జాతీయులు మొత్తం 125 కుటుంబాలు జీవనం సాగిస్తున్నట్టు అంచనా. ఎలాంటి ప్రచారం లేకుండా మతాన్ని అనుసరిస్తుంటారు. ప్రభుత్వ రికార్డుల్లో ‘మాదిగ’గా నమోదయ్యారు. బెనె ఎఫ్రాయిమ్‌ గోత్రాన్ని హిబ్రూలో ‘మగద్దీన్‌’ అంటారు. ఆ మాటతో వీరిని మాదిగ కులస్తులుగా నమోదు చేశారని చెబుతారు. 2004లోనే కొత్తరెడ్డిపాలెం యూదుల గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో ఇక్కడి యూదులను మట్టుపెట్టేందుకు కుట్రపన్ని, రెక్కీ నిర్వహించారనే ఆరోపణపై ప్రభుత్వం లష్కరేతోయిబాకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేసింది. అప్పుడే జిల్లా కలెక్టరు, పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడకు వచ్చి వీరిగురించి తెలుసుకున్నారు.  

క్రమం తప్పని ఆచార వ్యవహారాలు
ఎక్కువమంది వ్యవసాయ కూలీలు. చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వారున్నారు. అందరికీ యూదు పేరు, హిందూ పేరు ఉన్నాయి. ప్రతి శనివారం విశ్రాంతి దినం (షబ్బాత్‌). పనులకు వెళ్లరు.. దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ గడుపుతారు. ఆదివారం హెబ్రూ భాషా స్కూల్‌ను నడుపుతూ, మాతృభాషను కొనసాగిస్తున్నారు. హెబ్రూ క్యాలెండరు ప్రకారం సృష్టి ఆరంభం నుంచి ఇది 5780 సంవత్సరం. ముఖ్యమైన ఏడు పండుగలను జరుపుకుంటారు. పండుగలన్నింటికీ యూదులంతా కలుస్తారు. ఏడుగురు పెద్దల ఆధ్వర్యంలో జరిగే వివాహాల్లో వరకట్నం ఉండదు. వరుడే ఓలి ఇస్తారని సమాజ పెద్ద ఇట్స్‌కాక్‌ (ఇస్సాకు) చెప్పారు.  

లా ఆఫ్‌ రిటర్న్‌తో ఆశలు   
ఇజ్రాయేల్‌ దేశం లా ఆఫ్‌ రిటర్న్‌ జీవోతో ఎక్కడెక్కడో ఉంటున్న ఆ జాతీయులకు మాతృదేశం వెళ్లే అవకాశం లభించింది. ఆ అవకాశం కోసం ఇక్కడి యూదులు సైతం ఎదురుచూస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని యూదులను ‘బెయిత్‌డిన్‌’ (యూదుల కోర్టు) నిర్ధారిస్తుంది. సంబంధిత దేశం అనుమతితో వారిని ఇజ్రాయేల్‌కు తీసుకెళ్తారు. మణిపూర్, మిజోరం నుంచి ‘మనష్‌’ గోత్రికులు పెద్దసంఖ్యలో స్వదేశం వెళ్లారు. మచిలీపట్టణం నుంచి సడోక్‌ యాకోబి సోదరుడు షమ్ముయేల్‌ యాకొబి బిడ్డలు ఇజ్రాయేల్‌కు వెళ్లారు.

మైనారిటీలుగా గుర్తించాలి 
సర్వమానవ సౌభ్రాతృత్వం హెబ్రూల ఆశయం. వేరు మతాన్ని తప్పుగా ఎంచి, దీనిలోకి రండి అనే దురలవాటు మాకు లేదు. క్రైస్తవులు అని చెప్పి లాభపడటానికి ఇష్టపడం. మైనారిటీలుగా మమ్మల్ని గుర్తించి, ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. అక్కడక్కడా ఉంటున్న మా కుటుంబాలకు ప్రత్యేక కాలనీని ఏర్పాటు చేయాలి. – సాదోక్‌ యాకొబి, సమాజ మందిరం నిర్వాహకుడు 

హిబ్రూకు తెలుగుకు సంబంధం 
మానవులంతా ఒకే రక్తసంబంధీకులు. ఏమీ తేడా లేదు. హిబ్రూ భాషకు తెలుగుకు ఎంతో దగ్గర సంబంధం ఉందని నేను కనుగొన్నా. రెండింటికి సంబంధమున్న, ఒకే అర్థం కలిగిన 300 పదాలను గుర్తించాను. మరిన్ని విశేషాలతో త్వరలోనే పుస్తకం తీసుకురానున్నాను.
– షమ్ముయేల్‌ యాకోబి, భాషా పరిశోధకుడు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా