ఇస్తారా.. చస్తారా?

11 Jan, 2016 01:27 IST|Sakshi

ట్రస్టు మాటున మాజీమంత్రి ఆక్రమణలు
రైతుల భూముల చుట్టూ ప్రహరీ నిర్మాణం
అడ్డుకున్న వారిపై దౌర్జన్యం చేశారంటూ పోలీసు కేసులు
రైతులను భూముల్లోకి వెళ్లకుండా సెక్యూరిటీ

 
ఓ మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామిక వేత్త కుటుంబ సభ్యులు రైతులను బెదిరించి వందలాది ఎకరాల భూములను లాక్కుంటున్నారు. ఎక్కువ మాట్లాడితే సొంత భూముల్లోకి రైతులనే వెళ్లనివ్వకుండా చేస్తున్నారు. కాలువలను సైతం ఆక్రమించి ప్రహరీని ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ గార్డులను నియమిస్తున్నారు. రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా  స్పందన లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
తిరుపతి/తిరుపతిరూరల్: ట్రస్టు పేరుతో రైతుల భూములు ఆక్రమించుకోవడం అధికారపార్టీ నేతలకు పరిపాటిగా మారింది. తవణంపల్లి మండలం దిగువమాఘంలో ఓ ట్రస్ట్ పేరుతో దాదాపు రెండు వందల ఎకరాల్లో  విద్యాసంస్థల ఏర్పాటు కోసం స్థలాన్ని సేకరించారు. అందుకోసం రైతుల నుంచి భూములను కొనుగోలు చేస్తున్నారు. దాదాపు 180 ఎకరాలకు పైగా ఇప్పటికే స్వాధీనం చే సుకున్నారు.
 
ఎదురుతిరిగినరైతులు
మూడు నాలుగు తరాలుగా కుటుంబానికి ఆసరాగా ఉన్న భూములను ఇస్తే తమకు జీవనం పోతుందని కొందరు రైతులు ట్రస్ట్‌కు భూములను ఇచ్చేందుకు నిరాకరించారు. ట్రస్ట్ కొనుగోలుచేసిన భూముల మధ్యలో దాదాపు 20 ఎకరాలు రైతుల ఆధీనంలోనే ఉన్నాయి. తమకు ప్రత్యామ్నాయ భూమిని చూపిస్తేనే భూమిని ఇస్తామని అన్నదాతలు ట్రస్ట్ నిర్వాహకులకు తేల్చి చెప్పారు.
 
అమ్మని భూముల చుట్టూ ప్రహరీ
చుట్టూ భూములను కొనుగోలుచేసిన ట్రస్ట్ నిర్వాహకులు దాదాపు 10 అడుగుల ఎత్తులో ప్రహరీని నిర్మిస్తున్నారు. తమకు భూములు ఉన్నాయని వాటిలోకి వెళ్లేందుకు దారి కూడా వదలకుండా గోడ కట్టడంతో రైతులు ఆందోళన చేశారు. మధ్యలో వస్తున్న కాలువలను సైతం ఆక్రమించి ప్రహరీని నిర్మించారని వాపోతున్నారు.
 
అడ్డుకున్న వారిపై కేసులు
తమ భూముల్లోకి వెళ్లకుండా కాలువలను సైతం ఆక్రమించి ప్రహరీని నిర్మించడంపై సదరు నేతలను రైతులు అడ్డుకున్నారు.కొందరు ప్రహరీ రాళ్లను తొలగించారు. దీంతో తమ భూముల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి, తమ ఆస్తులను నాశనం చేస్తున్నారని ట్రస్ట్ ప్రతినిధులు రైతులపై కేసులు నమోదు చేయించి అరెస్ట్ చేయించారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు