ఆరోగ్యమస్తు.! 

16 Jul, 2020 09:30 IST|Sakshi

ఆరోగ్యశ్రీతో జీవితానికి భరోసా 

నేటి నుంచి రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు 

చికిత్సనందించే వ్యాధుల సంఖ్య 2145కి పెంపు 

జిల్లాలో ఏడులక్షల కుటుంబాలకు  ప్రయోజనం 

కరోనాకూ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స 

ఆరోగ్యం సామాన్యుడికి అందనంత దూరం. చిన్నచిన్న రుగ్మతలకూ లక్షలకొద్దీ ఖర్చుచేయడం అనివార్యం. మరి నిరుపేదలకు ఎలాంటి సమస్య వచ్చినా... ఆస్పత్రి గడప తొక్కడం అసంభవం. ఒక వేళ వెళ్లినా ఆస్తులు హారతికర్పూరంలా హరించుకుపోవడం ఖాయం... ఇది ఒకప్పటి మాట. మహానేత రాజశేఖరరెడ్డి పుణ్యమాని...  నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యం సైతం పూర్తి ఉచితంగా లభించింది. అందుకు ఆరోగ్యశ్రీ వారధిగా నిలిచింది. దేశంలోనే ఈ పథకానికి విశేష ఆదరణ లభించింది. తరువాత వచ్చిన పాలకులు దానిని పూర్తిగా మూలకు నెట్టేశారు. వైఎస్‌ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మళ్లీ ఆ పథకానికి జవసత్వాలు వచ్చాయి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి అదనంగా వ్యాధులు చేర్చారు. వెయ్యి రూపాయలు దాటినా ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు చేపట్టారు. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్య ప్రజల జీవితాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. అనారోగ్యం బారిన పడ్డవారికి, వారి వైద్యానికి అయ్యే ఖర్చును భరించడమే కాకుండా, వారు పూర్తిగా కోలుకొనే వరకూ ఆరోగ్య ఆసరా నిస్తూ, దేశంలోని ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచింది. వెయ్యి రూపాయలు దాటితే, ఆరోగ్యశ్రీని వర్తింపజేసే పథకం గురువారం నుంచి విజయనగరం జిల్లాకు కూడా వర్తింపజేస్తుండటంతో, సుమారు 7లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. 

జిల్లాకు వరం 
ప్రజాసంకల్ప యాత్రలో పేదల కష్టాలు తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వస్తే వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని మాట ఇచ్చారు. దానిని ఇప్పుడు అమలులోకి తీసుకువచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, తాజాగా ఈ పథకాన్ని మరింత విస్తరించారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేసి, రెండోవిడతలో మరో ఆరు జిల్లాలకు గురువారం నుంచీ వర్తింపజేస్తున్నారు. ఈ జాబితాలో విజయనగరం కూడా ఉండటంతో,  జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన 6,99,852 కుటుంబాలకు నేటినుంచి అదనపు భరోసా కలుగుతుంది. ఇకనుంచీ రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందవచ్చు. 

వ్యాధుల సంఖ్య 2145కి పెంపు 
గత ప్రభుత్వ హయాంలో 1059 వ్యాధులకు మాత్రమే ఆరో గ్యశ్రీ క్రింద వైద్యం అందేది. ఈ ఏడాది జనవరిలో ఈ జాబి తాలో 200 కొత్త వ్యాధులను చేర్చగా, తాజాగా గురువారం నుంచి ఒకేసారి అదనంగా 886 కొత్త వ్యాధులను చేరుస్తున్నారు. ఇకపై ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సనందించే వ్యాధుల సంఖ్య 2145కి పెరిగింది. అలాగే ఏడాదికి కుటుంబానికి వైద్యానికి అయ్యే ఖర్చు గరిష్ట పరిమితిని రూ.2.50లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచారు.  

ఇతర రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి దేశంలోనే తొలిసారిగా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స నందించాలన్న సాహ సోపేత నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. కరోనాతో పాటు ప్రస్తుతం 2145 రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సనందించేందుకు జిల్లా లో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, కొన్ని ప్రైవేటు ఆస్పత్రులను కూడా గుర్తించింది ప్రభుత్వం. విజయనగరంలోని జిల్లా కేంద్రాస్పత్రి, ఘోషాస్పత్రి, ఎస్‌కోట ప్రభుత్వాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రితోపాటు మరో పది పీహెచ్‌సీలలో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నారు.

ప్రైవేటు రంగంలోని తిరుమల, సాయి సూపర్‌ స్పెషాలిటీ, పుష్పగిరి, ఆంధ్రా, వెంకటపద్మ, మువ్వగోపాల, మిమ్స్, పీవీఆర్, వెంకటరమణ, అభినవ్, కులపర్తి, మారుతి ఆస్ప త్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సనందిస్తున్నారు. కేవ లం జిల్లాలోను, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందే అవకాశాన్ని రాష్ట్రప్రజలకు కల్పించడం ద్వారా, ప్రజారోగ్యంపై తనకున్న చిత్తశుద్ధిని ప్రభుత్వం చాటుకుంది.  

కోలుకొనేవరకూ ఆరోగ్యశ్రీ ఆసరా 
ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు, బడుగుజీవులు అనారోగ్యానికి గురైతే, ఆ కుటుంబం కుదేలవ్వాల్సిందే. రెక్కాడితే గాని డొక్కాడని వేలాది పేద కుటుంబాలకు, ఆ ఇంటి యజమాని జబ్బుపడితే, అతను కోలుకొని పనుల్లోకి వెళ్లేవరకూ ఇంట్లో పస్తే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోగి పూర్తిగా కోలుకొనే వరకూ, ఆరోగ్యశ్రీ ఆసరా కింద రోజుకు  రూ.225 చొప్పున లేదా నెలకు రూ.5వేలు వరకూ ప్రభుత్వమే చెల్లించి ఆ రోగిని, కుటుంబాన్ని ఆదుకుంటోంది. కిడ్నీ వ్యాధి, తాలసేమియా తదితర దీర్ఘకాలిక రోగులకు నెలకు రూ.10వేల వరకూ పింఛన్‌ అందిస్తూ, ఆ కుటుంబాలకు ఆసరానిస్తోంది. 

పేద మధ్యతరగతి ప్రజలకు మేలు 
ఇప్పటివరకు 1059 వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించేది. జనవరి 2వ తేదీన అదనంగా 200 వ్యాధులను కలిపారు. ఇప్పుడు మరో 886 వ్యాధులను కలిపి 2,145 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించనున్నారు. కొత్త ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని  ఆస్పత్రికి వెళితే ఉచితంగా వైద్యం చేస్తారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది.’  
–  డాక్టర్‌ పి.ప్రియాంక, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌       

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా