నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతకే భృతి

22 Aug, 2017 01:09 IST|Sakshi
నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతకే భృతి
సీఎం చంద్రబాబు వెల్లడి 
 
సాక్షి, అమరావతి: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. అయితే అది నిరుద్యోగులందరికీ కాదని, కేవలం నైపుణ్య శిక్షణ పొందుతున్న వారికే  అని ఆయన వివరించారు. ఏపీలో గ్రామీణ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టామన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో న్యూఢిల్లీకి చెందిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సంవత్సరం ఐదు కోట్లతో రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పించనున్నట్లు కార్పొరేషన్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఏపీలో చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి చర్చించారు. గత ఏడాది రూ.178 కోట్లతో రాష్ట్రంలోని 8,300 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మించామన్నారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది తమ సంస్థ లక్ష్యమని, ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌సీ)తో కలిసి పనిచేయబోతున్నామని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ డి.రవి తెలిపారు. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలో రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు.   
మరిన్ని వార్తలు