వివాహ నమోదుతో పలు లాభాలు

21 May, 2018 12:35 IST|Sakshi

మాచవరం(గురజాల): గ్రామ పంచాయతీల్లో వివాహాల నమోదు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావడంలేదు. దీంతో ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల ఆడపిల్ల ల వివాహాలకు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు సక్రమంగా అందడంలేదు. అన్ని కులాలు, మతాల వారు వివాహాలను నమో దు చేయించుకోవాలని చట్టంలో పొందుపరిచారు. వివాహం అయిన 60 రోజుల్లోగా నమోదు చేసుకోవచ్చు. కానీ ఎక్కడ ఎలా నమోదు చేసుకోవాలో తెలియక, సరైన అవగాహన లేకపోవడంతో వివాహాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంలేదు.

పథకాలపై అవగాహన అవసరం
వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టం 2012 వివాహ నమోదు బాధ్యత ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించింది. ఆడపిల్లకు 18 ఏళ్లు, మగ పిల్లవాడికి 21 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేసి గ్రామ పంచాయతీలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. దీంతో ముస్లిం, గిరిజన, ఆదర్శ వివాహాలు చేసుకున్న వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. గిరిజనులకు గిరిజన పుత్రిక, ముస్లింలకు దుల్హన్‌ పథకాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి రూ. 50 వేలు ప్రోత్సాహక నగదు అందుతుంది. ఇటీవల ఎస్సీలకు ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక ప్రకటించింది.

నమోదు ఇలా చేసుకోవాలి
వివాహం చేసుకున్న గ్రామంలో పంచాయతీ కార్యదర్శికి ముందుగా సమాచారం ఇచ్చి నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి. వధువు, వరుడు ఆధార్‌ కార్డులు, వయస్సు  ధ్రువీకరణ పత్రాలు, వ్యక్తిగత ఫొటోలు(పాస్‌పోర్టులు), పెళ్లి కార్డులు, పెళ్లి ఫోటో, ఇద్దరు సాక్షులు, వారి ఆధార్‌ కార్డుల జిరాక్స్‌ కాపీలు  పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి. వీటిని పరిశీలించిన కార్యదర్శి రిజిస్ట్రేషన్‌ చేసి ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. వివాహం జరిగిన 20 నుంచి 60 రోజుల్లో  నమోదు చేసుకోవచ్చు. 20 రోజుల్లో అయితే ఉచితంగా,  60 రోజుల్లోపు అయితే రూ. 100 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు