రాగల 33 రోజుల్లో..  బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌!  

28 Nov, 2019 09:09 IST|Sakshi
నిర్మాణ దశలో ఉన్న బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌

అందుబాటులోకి బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌!  

ఇప్పటికే వంతెనపై రోడ్డు, విద్యుదీకరణ పూర్తి 

శరవేగంగా అండర్‌పాస్, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం 

బెజవాడ వాసులకు తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు

రాజధాని.. విపరీతంగా పెరిగిన వాహనాలు.. తరచూ ప్రముఖుల రాకపోకలు.. మరోవైపు అధ్వానంగా రోడ్లు.. పలు ఫ్లై ఓవర్‌ల నిర్మాణ పనులు.. వెరసిసగటు ప్రజానీకానికి విజయవాడలోప్రయాణం అంటేనే బెంబేలెత్తే పరిస్థితి.. ముఖ్యంగా రామవరప్పాడు నుంచి బెంజిసర్కిల్‌ వరకు ట్రాఫిక్‌ ఒక పద్మవ్యూహంలా పరిణమించింది. అయితే రాగల 33 రోజుల్లో నగరవాసికి ట్రా‘ఫికర్‌’ నుంచి కొంత మేర ఉపశమనం లభించనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. డిసెంబర్‌ నెలాఖరుకు పూర్తిస్థాయిలో పనులు ముగించి.. జనవరి ఆరంభంలో ప్రారంభించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సన్నాహాలుచేస్తున్నారు.

సాక్షి, విజయవాడ: చాన్నాళ్లుగా ఊరిస్తున్న బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌పై రాకపోకలు త్వరలో ప్రారంభం కానున్నాయి. విజయవాడ– మచిలీపట్నం రోడ్డు నాలుగు వరుసలుగా విస్తరణకు రూ.740 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటిలో బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు రూ.82 కోట్లు కేటాయించారు. 1,450 మీటర్ల మేర 49 పిల్లర్లతో నిర్మించిన ఈ వంతెన పనులు మూడేళ్ల క్రితం 2016 నవంబర్‌లో మొదలయ్యాయి. దీని నిర్మాణం రెండేళ్లలో పూర్తి కావలసి ఉంది. కానీ భూసేకరణలో సమస్యలు, కోర్టు కేసులు, అప్రోచ్‌రోడ్లు, అండర్‌పాస్‌లపై స్థానికుల నుంచి అభ్యంతరాలు తదితర కారణాల వల్ల వంతెన నిర్మాణంలో జాప్యం జరుగుతూ వచ్చింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఈ వంతెన వీలైనంత త్వరగా పూర్తి కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. పనులు రేయింబవళ్లు జరిగేలా చూడడంతో పాటు స్థానికుల లేవనెత్తిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడంతో పనులు శరవేగంగా ముందుకుసాగాయి.

విజయవాడలోని బెంజిసర్కిల్‌ వద్ద నిర్మాణ దశలో ఉన్న ఫ్లై ఓవర్‌

పూర్తవుతున్న అప్రోచ్‌ రోడ్డు..
మరోవైపు ఏలూరు వైపు అప్రోచ్‌ రోడ్డు పనులు పూర్తవుతున్నాయి. దీనిని ప్రధాన రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. అలాగే పకీరుగూడెం వద్ద 14 మీటర్ల వెడల్పుతో జరుగుతున్న అండర్‌పాస్‌ పనులు కూడా దాదాపు కొలిక్కి వచ్చాయి. మరో 20 రోజుల్లో ఈ పనులు కూడా పూర్తికానున్నాయి. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం కూడా పూర్తవుతోంది. ఫ్లైఓవర్‌పై తారు రోడ్డు వేసి విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జనవరి ఆరంభంలో ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించేందుకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ట్రాఫిక్‌ కష్టాలకు చెల్లు.. 
బెంజిసర్కిల్‌ ఫ్‌లైఓవర్‌ అందుబాటులోకి వస్తే విజయవాడ నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలు చాలావరకు తీరనున్నాయి. ప్రస్తుతం కోల్‌కతా–చెన్నై రహదారిపై లారీలు, బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఫ్లైఓవర్‌ నిర్మాణం పనులు జరుగుతుండటం వల్ల నిత్యం వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయి. ఈ ట్రాఫిక్‌ పద్మవ్యూహం నుంచి తప్పించుకు వెళ్లడానికి ఎంతో సమయం పడుతోంది. దీంతో బెంజిసర్కిల్‌ వైపు వెళ్లడమంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి వాహన చోదకుల్లో నెలకొంది. కొత్త ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే కోల్‌కతా నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను ఈ వంతెనపై నుంచి రాకపోకలకు అనుమతించనున్నారు. ఫలితంగా ఫ్లైఓవర్‌ దిగువ రోడ్లపై భారీ వాహనాల రద్దీ గణనీయంగా తగ్గి ట్రాఫిక్‌ ఇక్కట్లు తగ్గనున్నాయి.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా