ప్రైవేటు బాటలో బెరైటీస్?

17 Nov, 2014 01:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)కి 95 శాతం రాబడి సమకూర్చుతున్న అత్యంత కీలకమైన మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టును ప్రైవేటుపరం చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. వైఎస్సార్ జిల్లా మంగంపేటలో 225 హెక్టార్లలో విస్తరించి ఉన్న బెరైటీస్ ప్రాజెక్టును దేశంలో దిగ్గజ ప్రైవేటు సంస్థల్లో ఒకదానికి కట్టబెట్టేందుకు మంత్రాంగం నడుస్తోంది. బెరైటీస్ ప్రాజెక్టు ప్రైవేటుకు వెళితే ఏపీఎండీసీ మూతపడుతుందని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. బెరైటీస్ ప్రాజెక్టును ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నారనే సమాచారం అందడంతో మంగంపేటలోని 172 మిల్లుల యజమానులు, వాటిలో పని చేస్తున్న ఉద్యోగులు కూడా కలవరానికి గురై అధికారులను వాకబు చేస్తున్నారు. ఏమి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోననే భయంతో అధికారులు అవుననీ, కాదనీ చెప్పకుండా తమకేమీ తెలియదని దాటవేస్తున్నారు. కానీ ప్రభుత్వం గత కొంతకాలంగా అనుసరిస్తున్న విధానాలు ప్రైవేటీకరణ అంశాన్ని పూర్తి గా బలపరిచేలా ఉండటం గమనార్హం.
 
 అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చైనా, మొరాకో దేశాల్లో బెరైటీస్ నిల్వలు, గల్ఫ్ దేశాల్లో ఈ ఖనిజానికి ఉన్న డిమాండు, మంగంపేటలో ఉన్న ఈ ఖనిజ నిల్వల పరిమాణంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన దేశస్థాయిలో పేరున్న ఒక ప్రైవేటు సంస్థ బెరైటీస్ ప్రాజెక్టును కైవసం చేసుకునేందుకు చకచకా పావులు కదుపుతోంది. మొదటినుంచి ఈ సంస్థతో ఉన్న లావాదేవీలు, వ్యక్తిగతంగా కలుగనున్న భారీ ఆర్థిక లబ్ధిని దృష్టిలో పెట్టుకుని మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టును ఈ సంస్థకు కట్టబెట్టేందుకు కీలక నేత ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. అధికార పక్ష కోటరీలో ముఖ్యుడిగా ఉన్న ఎంపీ ఒకరు ఈ అనధికారిక డీల్ ఖరారులో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. నామమాత్రంగా కమిటీ వేసి తూతూమంత్రంగా నివేదిక తెప్పించుకుని ప్రాజెక్టును ఈ సంస్థకు కట్టబెట్టేందుకు వీలుగా విధి విధానాలు ఖరారు చేయాలని కీలక నేతలు మొదట యోచిం చారు. అయితే దీనివల్ల ఎదురుకానున్న ప్రజావ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని, మొదట మెగా టెండరు నిర్వహించి మొత్తం ఖనిజం కొనుగోలు హక్కులు ఈ సంస్థకే వచ్చేలా మేనేజ్ చేసి తర్వాత దశలవారీగా ప్రాజెక్టును కట్టబెడితే సమస్య ఉండదని భావిస్తున్నారు.
 
 నల్లబంగారం విలువ రూ.40 వేల కోట్లు
 
 అత్యంత విలువైన, అరుదైన ఖనిజం కావడంవల్లే బెరైటీస్‌ను నల్లబంగారంగా అభివర్ణిస్తుంటారు. మంగంపేటలో కేవలం 225 హెక్టార్లలో 74 మిలి యన్ టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఇందులో 24 మిలియన్ టన్నులను ఇప్పటికే తవ్వేశారు. ఇక 50 మిలియన్ టన్నుల ఖనిజం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను ధర 135 నుంచి 145 డాలర్లు పలుకుతోంది. కనిష్ట ధర 135 డాలర్ల ప్రకారం చూసినా (డాలరు రూ. 60 ధర ప్రకారం) టన్ను రూ. 8,100 ఉంది. ఈ లెక్కన ఇక్కడ ఉన్న 50 మిలియన్ టన్నుల ఖనిజం విలువ రూ. 40,500 కోట్లు పైమాటే. ఒకే చోట ఇంత అధిక పరిమాణంలో నాణ్యమైన బెరైటీస్ ఖనిజం దేశంలో మరెక్కడా లేదు. కాగా మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టులోని ఖనిజ నిల్వల కొనుగోలు కాంట్రాక్టు గడువు ఆగస్టు 8తో ముగిసింది. అయినా ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ చేపట్టక పోవడం అనుమానాలకు తావిస్తోంది.
 
 
 60:40 నిబంధన తొలగింపు!
 ఎగుమతులకు 60 శాతం, స్థానిక అవసరాలకు 40 శాతం దామాషాలో బెరైటీస్ ఖనిజాన్ని కేటాయించాలనే నిబంధనను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) భావిస్తోంది. అవసరాల ఆధారంగా ఎగుమతులకు, స్థానిక పరిశ్రమలకు ఏ దామాషాలో ఖనిజాన్ని సరఫరా చేయాలనే అంశంపై నిర్ణయాధికారాన్ని సంస్థకే ఇవ్వాలని కోరుతోంది. ఇందులో భాగంగానే 60 : 40 దామాషాకు సంబంధించి ఉన్న జీవో 296ను తొలగించాలంటూ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని, వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిని ఆమోదించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేబినెట్ ఆమోదం తర్వాత దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నాయి.

మరిన్ని వార్తలు