బెర్త్‌ పదిలం

11 Jun, 2018 09:12 IST|Sakshi

రెండేళ్లు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. ఎలాంటి రాయిల్టీ చెల్లించలేదు. ఇలాంటి సంస్థను ఎవరైనా ఏం చేస్తారు. తప్పించేస్తారు. మరో సంస్థకు ఇస్తారు. కానీ అదానీ సంస్థ తనకున్న రాజకీయ పలుకుబడితో పోర్టులో తనకున్న బెర్త్‌ను మళ్లీ చేజిక్కించుకుంది. త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

సాక్షి, విశాఖపట్నం : దేశంలోని బడా పారిశ్రామికవేత్త అదానీ గ్రూపు వైజాగ్‌ పోర్టులో తనకున్న బెర్త్‌ను చేజార్చుకోకుండా పదిలపర్చుకుంది. రెండేళ్లుగా బెర్త్‌ ఖాళీగానే ఉంచడంతో ఏటా కోట్ల ఆదాయం కోల్పోతుండడంతో ఎలాగైనా ఈ సంస్థను వదిలించుకొని మరో సంస్థకు బెర్త్‌ను కేటాయించాలని విశాఖ పోర్టు రంగం సిద్ధం చేసింది. అదానీ గ్రూపునకు నోటీసులు కూడా జారీ చేసింది. కానీ కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి నోటీసులను వెనక్కి తీసుకునేలా విశాఖ పోర్టుపై ఒత్తిడి తీసుకొచ్చింది. తద్వారా విశాఖ పోర్టులో రెండేళ్లుగా మూతబడిన బొగ్గు టెర్మినల్‌ను తెరిపించుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది. జూలై 1వ తేదీ నుంచి తిరిగి విశాఖ పోర్టు ద్వారా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 


రెండేళ్లు కార్యకలాపాలు నిలిపేసినా?a
2014 ఆగస్టు నాటికి రూ.323.18 కోట్ల వ్యయంతో తూర్పు క్వారీ–1 బెర్త్‌ నిర్మాణానికి 2011లో పోర్టుతో అదానీ గ్రూప్‌ ఒప్పందం చేసుకుంది. రూ.400 కోట్లతో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను కూడా ఏర్పాటు చేసింది. బెర్త్‌ కోసం ఏటా రూ.3 కోట్లు, టెర్మినల్‌లో జరిగే కార్యక లాపాల ద్వారా టన్నుకు 40 శాతం రాయిల్టీ రూపంలో పోర్టుకు రెవెన్యూ చెల్లించాలన్నది ఒప్పందం. 2016 ఫిబ్రవరి వరకు ఈ బెర్త్‌ ద్వారా లోడింగ్, అన్‌లోడింగ్‌ కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థ ఆ తర్వాత కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. రెండేళ్లుగా పోర్టు ఆదాయానికి గండిపడింది. దీంతో అదానీ గ్రూపుతో ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు పోర్టు సిద్ధమై నోటీసులు జారీ చేయడంతో ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వ పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో పోర్టు యాజమాన్యం కూడా దిగిరాక తప్పలేదు.


విశాఖ పోర్టులో ప్రతిపాదించిన ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు రూ.20 లక్షలు చొప్పున జరిమానా విధించింది. కాగా 2015లో చేసుకున్న ఒప్పందం మేరకు బెర్త్‌ తిరిగి ప్రారంభించాలని అదానీ గ్రూపు నిర్ణయించింది. ఈ నిర్ణయం పోర్టు అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రాజెక్టు కోసం పొందిన రుణాల చెల్లింపు సమస్యగా మారింది. ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలు పోర్టు ముందస్తు ఆమోదంతో హోల్డింగ్‌ కంపెనీకి బదిలీ చేయలేదు. ఏడాదికి నాలుగు మిలియన్‌ టన్నుల నిర్వహణకు అదానీ గ్రూపు ఒప్పందం చేసుకుంది. అదానీ గ్రూపు దేశవ్యాప్తంగా 10 పోర్టుల్లో బెర్త్‌లను కలిగి ఉంది. ముంద్రా, హజీరా, దేహెజ్, కాండ్ల, ధీమ్, గోమా, మార్ముగోవాల వద్ద ఈ గ్రూపునకు టెర్మినల్స్‌ కలిగి ఉంది. తాజాగా ఒడిశాలోని పోర్టు ప్రాజెక్టు అభివృద్ధిని అప్పగించింది. ఏటా 4 మిలియన్‌ టన్నుల ఎగుమతి, దిగుమతులు చేపడతామని అదానీ గ్రూపు అంగీకరించిందని, దీంతో బెర్త్‌ పునరుద్ధరణకు ఆమోదం తెలిపినట్టుగా విశాఖ పోర్టు చైర్మన్‌ ఎంటి కృష్ణబాబు చెప్పారు. 

మరిన్ని వార్తలు