జెన్‌కో ఎండీకి ఉత్తమ సీఈవో పురస్కారం

23 Nov, 2013 04:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: గ్యాస్, బొగ్గు సరఫరా లేక దేశంలో 45 నుంచి 50 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుదుత్పత్తి ప్లాంట్లు నిరుపయోగంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఫలితంగా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు నిరర్థకంగా మారాయన్నారు.కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీ సంస్థ శుక్రవారం నగరంలో నిర్వహించిన ఇండియన్ పవర్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
 
  వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ అందించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన విద్యుత్ రంగ నిపుణులను కోరారు. అలాగే, విద్యుత్ పొదుపుపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జెన్‌కో ఎండీ విజాయానంద్‌కు ఉత్తమ ముఖ్య కార్యనిర్వహణాధికారి(బెస్ట్ సీఈఓ) పురస్కారాన్ని అందించారు. ఉత్తమ ఆర్థిక నిర్వహణ(బెస్ట్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్) అవార్డును జెన్‌కో మాజీ జేఎండీ ప్రభాకర్‌రావుకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీ సంస్థ అధ్యక్షుడు సీవీజే వర్మ పాల్గొన్నారు.
 
 అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో రచ్చబండకు సీఎం
 మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 24, 25 తేదీల్లో అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లాల పర్యటన అనంతరం సోమవారం సాయంత్రం 4.20 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు.

మరిన్ని వార్తలు