ఆశల ‘జంక్షన్’

14 Mar, 2014 01:30 IST|Sakshi
ఆశల ‘జంక్షన్’

రాజధానికి అనువుగా ఏలూరు-హనుమాన్ జంక్షన్ పరిసరాలు
కృష్ణా, ‘పశ్చిమ’ వాసుల్లో ఆశలు రేకెత్తిస్తున్న పురపాలక శాఖ నివేదిక
 

 సాక్షి ప్రతినిధి, ఏలూరు :
 రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఏలూరు ప్రాంతం అన్నివిధాలా అనువుగా ఉందని నిపుణుల కమిటీ తేల్చడం జిల్లా వాసుల్లో ఆశలు రేపుతోంది. హనుమాన్ జంక్షన్-ఏ లూరు మధ్య రాజధాని నిర్మాణానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని రాజధాని ఏర్పాటుపై ఏర్పడిన నిపుణుల కమిటీకి పురపాలక శాఖ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై పెద్దఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విజయవాడ-గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు నగరాల్లో రాజధానిని ఏర్పాటు చే యాలని ఆయా ప్రాంతాల రాజకీయ నాయకులు, ప్రజలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, నగరాల్లో కాకుండా ఖాళీ భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ొత్త రాజధానిని ఏర్పాటు చేయూలనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో భూములు ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలోని దొనకొండ ఇతర ప్రాంతాలను పరిశీలించారు. చివరకు ఆ ప్రాంతాల్లో రాజధానికి అవసరమైన అన్ని వనరులు లేవని తేల్చారు. ఖాళీ భూములు అందుబాటులో ఉండటంతోపాటు అన్ని వనరులన్న హనుమాన్ జంక్షన్-ఏలూరు మధ్య ప్రాంతంలో కొత్త రాజధాని నిర్మాణానికి విస్తృతమైన అవకాశాలున్నట్టు తేలడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
 
 అన్నీ అనుకూలతలే
 కృష్ణా జిల్లా పరిధిలోని హనుమాన్ జంక్షన్ నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని కలపర్రు సమీపంలో ఏలూరు రోడ్డు వరకూ ఉన్న ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువుగా ఉంటుందని పురపాలక శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా దీనిపై అధ్యయనం చేసి ఒక అంచనాకు వచ్చారు. ఈ ప్రాంతంలో జాతీయ రహదారికి ఇరువైపులా వేలాది ఎకరాల ఖాళీ భూములున్నాయి. వీటిలో ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ రోడ్డు, రైలు మార్గాలు అనుసంధానమైన ఉండే ప్రాంతం రాజధానికి అనువుగా ఉంటుంది. ఐదో నంబరు జాతీయ రహదారికి ఇరువైపులా హనుమాన్ జంక్షన్-ఏలూరు ప్రాంతాలు ఉండటంతోపాటు ఆంధ్రాకు ఇది నడిబొడ్డున ఉంది. బ్రాడ్‌గేజ్ రైలు మార్గం ఈ ప్రాంతాన్ని ఆనుకుని వెళుతోంది.
 
 అన్నిటికీ మించి 20 కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్‌పోర్టు ఉండటం, దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు విస్తార అవకాశాలు ఉండటం ఈ ప్రాంతానికి కలిసి వచ్చే అంశం. జలమార్గాలు కూడా ఇక్కడికి చాలా దగ్గరగా ఉన్నాయి. విశాఖపట్నం, నిజాంపట్నం పోర్టులకు మధ్యన ఏలూరు ప్రాంతం ఉండటంతో ఇక్కడి నుంచి సరుకు రవాణా చేయడం చాలా తేలిక. మరోవైపు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కృష్ణా, ఏలూరు, పోలవరం కుడికాలువల ద్వారా అవసరమైనంత నీటిని వినియోగించుకునే అవకాశం ఉం టుంది. రాజధానికి అవసరమైన ఇలాంటి అన్ని వనరులు ఏలూరు పరిసరాల్లో పూర్తిగా ఉన్నాయనేది స్పష్టమవుతోంది.
 
 ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ ఏలూరు-విజయవాడ మధ్య రాజధానికి అవకాశాలున్నాయని తేల్చి చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దీనిపై విజ్ఞాపన చేశారు. ఐఏఎస్ అధికారిగా మహారాష్ట్రలో సుదీర్ఘకాలం పనిచేసిన చంద్రశేఖర్ అర్బన్ ఎకాలజీలో డాక్టరేట్ పొందారు. మహారాష్ట్రలో అర్బన్ ప్లానర్‌గా ఆయనకు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి రాజధాని అవకాశాలు ఉన్నాయని ఎలుగెత్తి చాటడం గమనార్హం. రాజకీయాలను పక్కనపెడితే ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సూచనలు బాగా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
 

>
మరిన్ని వార్తలు