పందెం కోళ్లు

23 Dec, 2014 01:00 IST|Sakshi
పందెం కోళ్లు

ఖరీదైన ఆహారం... ప్రత్యేక శిక్షణ
కోడి పుంజులకు రాజభోగం
సిద్ధం చేస్తున్న నూకన్ననాయుడు
ఒక్కో పుంజు ధర రూ.5 వేల నుంచి 30 వేలు

 
 
నక్కపల్లి: సంక్రాంతి వస్తోందంటే చాలు పందెం కోళ్లు ఒళ్లు విరుచుకుంటాయి. ప్రత్యర్థిని ఎదుర్కోడానికి సర్వ శక్తులూ కూడగట్టుకొని పందాలకు సిద్ధమవుతాయి. ఈ పందాలకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తుంటారు. లక్షలు, కోట్లలో కూడా పందాలు కాస్తుంటారు. పందెం రాయుళ్లు మేలుజాతి కోడిపుంజుల అన్వేషణలో పడతారు. ఎంత ఖరీదైనా కొనుగోలు చేయడానికి, జాతి పుంజులపై బెట్టింగ్‌లు కట్టడానికి వెనుకాడరు. ఇటువంటి పందెం రాయుళ్ల కోసం నక్కపల్లి మండలం ఒడ్డిమెట్టకు చెందిన పైల నూకన్ననాయుడు మేలుజాతి, ఖరీదైన కోడిపుంజుల పెంపకాన్ని చేపట్టాడు. మరో 20 రోజుల్లో సంక్రాంతి సంబరాలు ఊపందుకోనున్న నేపథ్యంలో మేలు జాతిరకాల కోడిపుంజులను తయారు చేసే పనిలో తలమునకలై ఉన్నాడు. ‘పందేలు వేసుకుంటారో లేక కొత్త అల్లుళ్లకు పందెం పుంజుల మాంసంతో విందు భోజనం పెట్టడానికి కొనుక్కుంటారో నాకనవసరం. జాతిరకాలైన కోడిపుంజులను సిద్ధం చేస్తున్నానని’ నూకన్ననాయుడు చెబుతున్నాడు.

గ్రామీణ ప్రాంతంలో ఇతని వద్ద ఉన్న మేలు(జాతి)రకాల కోడిపుంజులు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడాలేవు. ఇవి ఒక్కొక్కటి రూ.5 వేల నుంచి 30 వేల రూపాయల ధర పలుకుతున్నాయి. భీమవరం, ఏలూరు, నర్సాపురం, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి బడాబాబులు వచ్చి ఇతని వద్ద ఖరీదైన పుంజులు కొని తీసుకెళ్తుంటారు. పందెం కోళ్లలో ప్రధానంగా చెప్పుకునే పచ్చ కాకి, నల్లచవల, పసింగాల డేగ, నెమలి, సేతువ, పువల, రసంగి, నెమలి డేగ, కాకి డేగ, కాకి కువల, తెల్ల నెమలి, మైలా వంటి జాతిర కాలైన కోడిపుంజులు ఉన్నాయి. జాతి రకాలయిన కోడి పెట్టలను కొని తెచ్చి గుడ్లు పెట్టించి స్వయంగా ఉత్పత్తి చేపడుతున్నాడు. ఏడేళ్ల నుంచి ఇతను జాతిరకాలైన కోడిపుంజుల పెంపకంపైనే జీవనోపాధి పొందుతున్నాడు. ప్రస్తుతం ఇతని వద్ద లక్షలాది రూపాయల విలువైన సుమారు 20 కోడిపుంజులు, పెట్టలు ఉన్నాయి. వీటికి పౌష్టికాహారాన్ని అందించడం కోసం ఒక్కొక్క కోడిపుంజుకు నెలకు రూ.3వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాడు.

ఖరీదైన పౌష్టికాహారం

కోడిపుంజు పుట్టిన ఏడు నెలల వరకు చోళ్లు, గోధుమ, ధాన్యం ఆహారంగా పెడతారు. ఏడో నెలదాటిన తర్వాత కోడి కూతకు వస్తుంది. అప్పటి నుంచి 3 నెలలపాటు బలమైన ఆహారం ఇస్తారు. ప్రతి రోజు పది బాదం పిక్కలు, ఒక పచ్చి కోడిగుడ్డు, మిరియాల పొడి, అశ్వగంధి, 50 గ్రాముల మాంసం, ఆహారంగా ఇస్తారు. ఇలా రెండు నెలలపాటు మేపి పందెం పుంజులుగా తయారు చేస్తారు. పందాల్లో అలుపు తట్టుకోవడం కోసం ప్రతిరోజు 30 నిమిషాలపాటు నీటిలో ఈతకు వదుల్తారు. నాలుగు కిలోల బరువు, ఏడాది వయసు వచ్చే వరకు మంచి పౌష్టికాహారంతో ఈ కోడి పుంజులను పెంచుతామని నూకన్నాయుడు తెలిపాడు. రెండునెలలపాటు పుంజులను ఈవిధంగా పెం చినందుకు ఒక్కొక్క దానికి రూ.3 వేల నుంచి 4 వేలు ఖర్చవుతుం దంటున్నాడు. ఇలా తయారయిన పుంజును రూ.20 వేల నుంచి 30 వేలకు విక్రయిస్తామని చెబుతున్నాడు.

ఈ వృత్తి ప్రారంభించి ఇప్పటివరకు సుమారు 600కు పైగా జాతి కోడిపుంజులను అమ్మానని తెలిపాడు. పుంజుల బరువు ఎక్కువై పందాల్లో ఎగురలేవనే అనుమానం వచ్చినప్పుడు కూడా బరువు తగ్గించడం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటామంటున్నాడు. ఇటువంటి బరువు పెరిగిన కోడిపుంజులకు ఆముదం పట్టించి, వేడినీళ్లతో మసాజ్ చేస్తామంటున్నాడు. ఇలా చేస్తే శరీరం గట్టిపడి పుంజు తేలికవుతుందని, సులువుగా ఎగురగలుతుందంటున్నాడు.
 
 

మరిన్ని వార్తలు