ప్రమాణాల పెంపునకు ‘పరామర్శ్‌’ 

9 Sep, 2019 04:10 IST|Sakshi

ఉన్నత విద్యా సంస్థలు న్యాక్‌ గుర్తింపు పొందేలా చూడటమే లక్ష్యం 

రాష్ట్రం నుంచి ఎంపికైన ప్రైవేటు విద్యా సంస్థలు 12

3.6 కోట్ల మంది విద్యార్థులకు మెరుగైన విద్యే లక్ష్యం 

దరఖాస్తు చేయని ప్రభుత్వ విద్యాసంస్థలు 

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాసంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడంతోపాటు వాటికి త్వరగా న్యాక్‌ గుర్తింపు వచ్చేలా సహాయం అందించడం కోసం యూజీసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పరామర్శ్‌ పథకాన్ని ప్రవేశపెడుతోంది. 2022 నాటికి దేశంలోని ప్రతి ఒక్క విద్యాసంస్థ నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ (న్యాక్‌) గుర్తింపు (కనీసం 2.5 స్కోరుతో) పొందేలా చూడడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఈ పథకం కింద ఎంపికైన న్యాక్‌ గుర్తింపు ఉన్న ఉన్నత విద్యాసంస్థలు మెంటార్‌లుగా వ్యవహరిస్తూ తమ పరిధిలోని కళాశాలలు కూడా న్యాక్‌ గుర్తింపు పొందేలా మార్గనిర్దేశం చేస్తాయి. మెంటార్‌ల మార్గదర్శకత్వంలో ఆయా కళాశాలలు ప్రమాణాల పెంపునకు కార్యక్రమాలు చేపడతాయి. దీనికి అవసరమైన సహాయసహకారాలను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అందిస్తుంది.  

లక్ష్యం.. వేయి విద్యా సంస్థలు 
పరామర్శ్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం, యూజీసీ దేశవ్యాప్తంగా వేయి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. 3.6 కోట్ల మంది విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్నది దీని ముఖ్య ఉద్దేశం. పరిశోధన కార్యక్రమాల పెంపు, వినూత్న మార్పులతో బోధనాభ్యసన ప్రక్రియల్లో మెరుగుదల, తద్వారా ఆయా సంస్థలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా కార్యక్రమాలు అమలు చేస్తారు. ఆయా సంస్థల్లోని అధ్యాపకుల్లో అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందిస్తారు. 

రాష్ట్రం నుంచి 12 సంస్థలు ఎంపిక 
పరామర్శ్‌ పథకం కింద మెంటార్లుగా వ్యవహరించేందుకు యూజీసీ 2ఎస్, 12బీ స్టేటస్‌ ఉండి 3.26 న్యాక్‌ స్కోర్‌ ఉన్న కళాశాలల నుంచి యూజీసీ దరఖాస్తులను ఆహ్వానించింది. వీటిని పరిశీలించి మెంటార్‌ సంస్థలుగా ఎంపికైన 167 కళాశాలల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 12, తెలంగాణ నుంచి 8 ఎంపికయ్యాయి. రాష్ట్రం నుంచి ఎంపికైన 12 విద్యాసంస్థలు ప్రైవేటువే. మెంటార్‌గా ఎంపికైన ఒక్కో విద్యా సంస్థ తన పరిధిలో ఐదు విద్యాసంస్థలను ఎంపిక చేసుకొని వాటికి న్యాక్‌ గుర్తింపు వచ్చేలా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం కాలపరిధి ఏడాది ఉంటుంది. అవసరాన్ని బట్టి మరో ఏడాది వరకు పొడిగిస్తారు. మెంటార్‌కు రూ.30 లక్షల వరకు అందిస్తారు. 50 శాతం గ్రాంటును ముందుగా విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలేవీ పరామర్శ్‌ పథకానికి దరఖాస్తు చేయలేదు. యూజీసీ నుంచి తగినన్ని నిధులు వచ్చే అవకాశాన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు వినియోగించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.  

మెంటార్‌లుగా ఎంపికైన సంస్థలు ఇవే.. 
–శ్రీ ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజ్‌ – నర్సాపూర్‌ 
–జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కాలేజీ – గుంటూరు 
–పీబీ సిద్ధార్థ కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ – విజయవాడ 
–గోదావరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ – రాజమండ్రి 
–దువ్వూరు రమణమ్మ ఉమెన్స్‌ కాలేజీ– గూడూరు, నెల్లూరు 
–ఆదిత్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ – టెక్కలి, శ్రీకాకుళం 
–ఆంధ్రా లయోలా కాలేజీ – విజయవాడ 
–సీఎస్‌డీ సెయింట్‌ థెరిసాస్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌ – ఏలూరు 
–విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ – దువ్వాడ, విశాఖపట్నం 
–పీవీపీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ – కానూరు, విజయవాడ, 
–గీతం – రుషికొండ, విశాఖపట్నం 
–కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ – వడ్డేశ్వరం, గుంటూరు  

మరిన్ని వార్తలు