ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు

22 Jun, 2014 00:31 IST|Sakshi

- డీఆర్‌ఎం ప్రసాద్
- పిడుగురాళ్ళ రైల్వేస్టేషన్‌లో వసతులపై ఆరా

 పిడుగురాళ్ల:  ఆదర్శ రైల్వేస్టేషన్ అయిన పిడుగురాళ్లలో ప్రయాణికులకు మెరగైన సౌకర్యాలను అందజేసేందుకు తగు చర్యలు చేపడతామని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక రైల్వేస్టేషన్‌కు అధికారుల బృందంతో వచ్చిన డీఆర్‌ఎం తొలుత రైల్వేస్టేషన్ పరిసరాలను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలపై ఆరాతీశారు.

 స్టేషన్‌మాస్టర్ కె.వరకృపాకరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన బోరింగు పంపులను, వెయిటింగ్‌హాలు, సిబ్బంది క్వార్టర్లను పరిశీలించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా తగుచర్యలు తీసుకోవాలని, పాడైన బోరింగు పంపులను, నీటి కుళాయిలను తక్షణమే బాగుచేయించాలని ఆదేశించారు.

గాంధీనగర్‌వద్దనున్న మొండిగేటును డీఆర్‌ఎం పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పక్కనే జానపాడురోడ్డులో రైల్వే గేటు ఉన్నందున సమీపంలోని గాంధీనగర్ మొండిగేటుకు గేటు ఏర్పాటు సాధ్యం కాదని, అందుకే అక్కడ కాపలాకు ఉద్యోగిని నియమించామన్నారు.

ఆ ఉద్యోగి సక్రమంగా విధులు నిర్వర్తించేవిధంగా అధికారులు పర్యవేక్షించాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం రైల్వేస్టేషన్ పరిసరాల్లో వివిధ సమస్యలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలపై  డీఆర్‌ఎం ప్రసాద్ అసహనం వ్యక్తంచేశారు. డీఆర్‌ఎం వెంట ఏసీఎం అలీఖాన్, అధికారులు సతీష్, ఎంఎం ఖాన్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు