పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి

13 Oct, 2014 00:31 IST|Sakshi
పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి

క్రిష్ణ గ్యాస్ట్రో, ల్యాప్రో హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి

 కర్నూలు(హాస్పిటల్):  సీమ జిల్లాల్లో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారని..వారికి మెరుగైన వైద్య సేవలందించాలని  ప్రపంచ ప్రఖ్యాత సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్, పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి అన్నారు. అత్యాధునిక పరికరాలు, వసతులతో కర్నూలులోని  నరసింగరావుపేట 4వ లైన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిష్ణ గ్యాస్ట్రో, ల్యాప్రో హాస్పిటల్‌ను ఆయన ప్రారంభించారు.

అనంతరం ఆసుపత్రిలోని క్లినిక్, కొలనోస్కోపి, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, వార్డు రూమ్‌లకు పూజలు చేశారు. అనంతరం  డాక్ట ర్ డి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూఅన్ని సౌకర్యాలతో క్రిష్ణ గ్యాస్ట్రో, ల్యాప్రో హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మల్టీ స్పెషాలిటీ స్థాయిలో సౌకర్యాలు, ఎండోస్కోపి, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ తదితర ఆధునిక వసతులు  ఆసుపత్రిలో ఉన్నాయన్నారు.

క్రిష్ణ గ్యాస్ట్రో, ల్యాప్రో హాస్పిటల్ అధినేత సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కె.ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ సీమ ప్రాంతంలోని ప్రజలు  పరిమితికి మించి మసాలాలు, నూనెలు వాడుతుంటారని..దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఈ సమస్యను ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్స పొందాలన్నారు. తమ ఆసుపత్రిలో అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులకు వంద శాతం మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.

సమావేశంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ వెంకటరంగారెడ్డి, విశ్వభారతి మెడికల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కాంతారెడ్డి మాట్లాడారు.  కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి, న్యూరో సర్జన్ డబ్ల్యూ సీతారాం, దంత వైద్యులు సునిల్‌కుమార్‌రెడ్డి, బాషా, గిరిబాబు, జయరాం పాల్గొన్నారు. అంతకుముందు పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి ఘనంగా సన్మానించారు.

మరిన్ని వార్తలు