కాయ్‌ రాజా కాయ్‌..

3 Apr, 2019 08:26 IST|Sakshi

సాక్షి, ఏలూరు టౌన్‌:  పశ్చిమలో బెట్టింగురాయుళ్ళు బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు ఉంటే.. మరోవైపు ఐపీఎల్‌ పోరు సాగుతోంది. దీంతో బెట్టింగు రాజాలకు చేతినిండా పనిదొరికినట్లు అయ్యింది. రాజకీయ పార్టీల మధ్య రసవత్తరపోరు సాగుతుండగా ఇదే అదనుగా బెట్టింగురాయుళ్ళు రెచ్చిపోతున్నారు. ఆయా రాజకీయ పార్టీలకు అనుకూల వర్గాలు సైతం బెట్టింగులతో బిజీగా మారిపోయాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే టీడీపీ ఓడిపోయే చోట్ల వ్యూహాత్మకంగా ఆ పార్టీ నేతలు తామే గెలుస్తామంటూ బెట్టింగులు కడుతూ ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా జిల్లాలో బెట్టింగురాయుళ్ళ ప్రలోభాలతో పార్టీ నేతలు, కార్యకర్తలు జేబులు ఖాళీ చేసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో లగడపాటి సర్వేను నమ్ముకుని బెట్టింగులు కాసిన వందలాది మంది భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే.


వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ 
సార్వత్రిక ఎన్నికల్లో చావోరేవో తేల్చుకునేందుకు అధికార టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జోరును అడ్డుకునేందుకు ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బహుమతులు, డబ్బు, మద్యం భారీఎత్తున పంపిణీ చేస్తూనే.. మరోవైపు వైఎస్సార్‌సీపీ నేతలు, క్యాడర్‌ను ఆత్మరక్షణలో పడేసేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీ అభ్యర్థి గెలుపు తథ్యమని.. కావాలంటే పందేలు కాసుకోవచ్చని సవాల్‌ విసురుతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎలాగూ ఓడిపోతామనే అభిప్రాయానికి వస్తున్న నాయకులు తమ అనుకూల వర్గాలతో బెట్టింగులకు తెరలేపుతున్నారు. పందేలు కాస్తే రెట్టింపు సొమ్ములు ఇస్తామంటూ బీరాలు పలుకుతున్నారు. ఇక గెలుపు సంగతి అటుంచితే ఒక అడుగు ముందుకేసి మరీ భారీ మెజార్జీ ఖాయమంటూ పందేలు కాస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే టార్గెట్‌గా గ్రామాల్లో బెట్టింగులు కాస్తూ తటస్థులైన ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎలాగూ త్రిముఖపోటీ నేపథ్యంలో గెలుపుపై కొన్ని చోట్ల సందిగ్ధత నెలకొన్న దశలో టీడీపీ నేతలు కుటిల రాజకీయ ఎత్తుగడలతో ఓటర్లును మాయ చేసేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. 


ఐపీఎల్‌పైనా జోరుగా పందాలు
సందట్లో సడేమియా లాగా.. ఒకవైపు పోలీసు యంత్రాంగం అంతా సార్వత్రిక ఎన్నికల హడావుడిలో నిమగ్నం కావటంతో ఐపీఎల్‌పై బెట్టింగులు కాసే వారికి అడ్డులేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది క్షణం తీరికలేకుండా విధుల్లో ఉండడం పందెంరాయుళ్ళకు కలిసివచ్చింది. జిల్లావ్యాప్తంగా ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. లాడ్జీలు, ఇళ్ళు, అపార్టుమెంట్ల నుంచి పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఏలూరు నగరంతోపాటు, జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లోనూ క్రికెట్‌ బెట్టింగులు సాఫీగా సాగిపోతున్నట్లు సమాచారం. 


బెట్టింగులకు కౌంటర్లు ఏర్పాటు 
జిల్లా కేంద్రం ఏలూరుతోపాటు, దెందులూరు ఇంకా పలు నియోజకవర్గాల పరిధిలో బెట్టింగులకు ఏకంగా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆయా రాజకీయ పార్టీల సానుభూతిపరులకు, పార్టీ నేతలకు, క్యాడర్‌కు బెట్టింగులు కట్టేందుకు ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపుతోపాటు, వారికి వచ్చే మెజార్టీ పైనా భారీగా పందేలు కాసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఈసారి ఊహించని స్థాయిలో సీట్లు గ్యారంటీ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక టీడీపీ సైతం అదేస్థాయిలో ఓడిపోయే నియోజకవర్గాల్లో సైతం బెట్టింగులు కాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 5 వేలు, 10 వేల మెజార్జీలపైనా భారీగా పందేలు కాస్తున్నారని సమాచారం. ఎవరైనా పందేలు కాస్తే ముందుగానే డబ్బులు చెల్లిస్తే.. వారికి రశీదులు ఇస్తున్నారని.. ఎన్నికల ఫలితాల అనంతరం గెలుపు, ఓటములను బట్టి వారికి డబ్బులు చెల్లించేలా బెట్టింగురాయుళ్ళు కౌంటర్లు తెరిచినట్లు చెబుతున్నారు. అయితే టీడీపీ నేతల వద్దనే కౌంటర్లు ఏర్పాటు చేయటంతో బెట్టింగురాయుళ్ళు భయపడుతున్నట్లు సమాచారం. గెలిచినా ఓడినా తాము ఆ నేతలను డబ్బులు అడిగే అవకాశం ఉండదని, ఇక పందేలు కాసి ఉపయోగమేంటని అనుమానిస్తున్నారట. మరో విషయం ఏమిటంటే బెట్టింగులు కట్టే డబ్బునే ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసే ఆలోచనలో సైతం ఆయా నేతలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు