బెట్టింగ్‌ గాలి!

20 Apr, 2019 09:39 IST|Sakshi

ఎన్నికల ఫలితాలపై భారీగా పందేలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ

స్పష్టంగా కనిపిస్తున్న వైఎస్‌ జగన్‌ హవా

అసెంబ్లీ సీట్లు, ప్రభుత్వ ఏర్పాటుపై జోరుగా బెట్టింగ్‌

హాట్‌ సీట్లుగా రాప్తాడు, తాడిపత్రి, పెనుకొండ, ధర్మవరం

అనంతపురం అసెంబ్లీపై 1@5 లెక్కన పందెం

ఎంపీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీదే పైచేయి

సిక్సర్ల మోత.. సెంచరీల రికార్డులు..     కళ్లు బైర్లుకమ్మే క్యాచ్‌లు.. నమ్మశక్యం కాని ఫీల్డింగ్‌.. ఐపీఎల్‌ వేదికగా సాగుతున్న ఈ ఆశ్చర్యాలు ప్రజల దృష్టిని ఎన్నికల ఉత్కంఠ నుంచి మళ్లించలేకపోతున్నాయి. పోలింగ్‌ ముగిసి వారం రోజులు గడిచినా.. ఇప్పటికీ అదే చర్చ. ఫలితాలకు నెల రోజులకు పైగా సమయం ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు పార్టీ శ్రేణుల్లో గెలుపోటముల వేడి చెమటలు పట్టిస్తోంది. పనిలో పనిగా కోట్లాది రూపాయల బెట్టింగ్‌ సాగుతోంది. వైఎస్సార్‌సీపీ గెలుపు దాదాపుగా ఖాయమైంది. ఈ పరిస్థితుల్లో పందెంరాయుళ్లు ఆచితూచి అడుగులేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది? మెజార్టీ ఎంత రావచ్చు? గెలుపోటములకు కారణాలు ఏమై ఉంటాయి? క్రాస్‌ ఓటింగ్‌ జరిగి ఉంటుందా? ఎక్కడ నలుగురు గుమికూడినా ఇదేవిధమైన చర్చ జరుగుతోంది. సాధారణంగా ఎన్నికలు ముగిసిన నాలుగైదు రోజులకు ఫలితాలు వచ్చేస్తుండగా.. ఈ విడత ఏకంగా 42 రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో ఎవరి అంచనాల మేరకు వారు విశ్లేషణల్లో మునిగి తేలుతుండగా.. బెట్టింగ్‌ కూడా భారీగా జరుగుతోంది. ఈ నెల 11నపోలింగ్‌ ముగిసింది. ఆ తర్వాత మూడు, నాలుగు రోజుల్లో గెలుపోటములపై ఓ అంచనా రావడంతో బెట్టింగ్‌ సొమ్ము భారీగా చేతులు మారుతోంది. మధ్యవర్తులు కూడా ఫోన్లు చేసి మరీ బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఎవరి స్థాయికి తగినట్లుగా వాళ్లు పందెం కాస్తుండటంతో ‘ఫలితం’ ఉత్కంఠ రేపుతోంది.

గెలుపోటములపై ఎవరికి వారు ధీమా
గత ఎన్నికల్లో టీడీపీ రెండు పార్లమెంట్‌లతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఎన్నికలు ఎలా జరిగినా టీడీపీకే మెజార్టీ సీట్లు వస్తాయనేది ఆ పార్టీ శ్రేణుల వాదన. అయితే ప్రజలంతా మార్పునకు ఓటేశారని, జిల్లాలో జగన్‌ గాలి వీచిందని, ఈ దఫా జిల్లాలో రాజకీయ వటవృక్షాలు కూడా నేలకొరుగుతాయనేది వైఎస్సార్‌సీపీ శ్రేణుల ధీమా. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌ జోరందుకుంది. ఎక్కువగా రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరం, పెనుకొండపైనే భారీ బెట్టింగ్‌ నడుస్తోంది.
రాప్తాడు ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కచ్చితంగా గెలుస్తారని ఆ పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు బెట్టింగ్‌ కాస్తున్నారు. టీడీపీ నేతలు కూడా గట్టి పోటీ ఉందని, అయితే బొటాబొటీ మెజార్టీతోనైనా శ్రీరాం గెలుస్తాడని బెట్టింగ్‌కు దిగుతున్నారు. పరిటాల ఫ్యామిలీపై వ్యతిరేకత, ప్రకాశ్‌రెడ్డిపై సానుభూతికి తోడు జగన్‌ గాలితో కచ్చితంగా రాప్తాడులో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురుతుందనే అభిప్రాయం అధిక శాతం వినిపిస్తోంది. ఈ ఒక్క నియోజకవర్గంపైనే ఇప్పటి వరకూ రూ.10–15కోట్ల బెట్టింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ 1ః1 పద్ధతిలోనే బెట్టింగ్‌ నడుస్తోంది.
ధర్మవరంలో కేతిరెడ్డి గెలుపుతో పాటు మెజార్టీపై పందెం కాస్తున్నారు. మరోవైపు వరదాపురం సూరి కూడా తాను గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. ఇక్కడ కూడా 1ః1 చొప్పున బెట్టింగ్‌ నడుస్తోంది.
తాడిపత్రిలో జేసీ అస్మిత్‌రెడ్డి, పెద్దారెడ్డిపై గట్టిపోటీ ఉందనే భావనలో ప్రజలు ఉన్నా, నియోజకవర్గంలో మాత్రం కచ్చితంగా పెద్దారెడ్డి గెలవబోతున్నారనే ధీమా కనిపిస్తోంది. ఇక్కడ జేసీ ప్రభాకర్‌రెడ్డితో తన అనుచరులు అస్మిత్‌కు ఇబ్బందిగా ఉందని చెబితే, బెట్టింగ్‌కు వచ్చేవాళ్లు ఉంటే తీసుకోవాలని, 30శాతం కమిషన్‌ ఇస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే పెద్దారెడ్డి గెలుస్తారని బెట్టింగ్‌కు డబ్బులు తీసుకుని వెళితే ‘తర్వాత చూద్దాం’అని వాయిదా వేస్తున్నట్లు సమాచారం.
పెనుకొండలో కూడా ఇప్పటికే రూ.6–8కోట్ల వరకూ బెట్టింగ్‌ సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. శంకర్‌నారాయణ గెలుస్తారని ఇక్కడ ఎక్కువగా బెట్టింగ్‌ జరుగుతోంది.

ఎంపీలపైనా భారీగా బెట్టింగ్‌
ఎంపీ ఎన్నికల్లో ఈ దఫా క్రాస్‌ ఓటింగ్‌ ఎక్కువగా జరిగిందనే అభిప్రాయం రాజకీయ పార్టీల్లో ఉంది. అనంతపురం, హిందూపురం ఎంపీ అభ్యర్థులు బోయ రంగయ్య, గోరంట్ల మాధవ్‌లు గెలుస్తారని ఎక్కువగా పందెం కాస్తున్నారు. గుంతకల్లు, శింగనమల, అనంతపురం, కళ్యాణదుర్గంలో జితేంద్రగౌడ్, శమంతకమణి, ప్రభాకర్‌చౌదరి, హనుమంతరాయచౌదరి తదితరులు జేసీ పవన్‌కు సహకరించలేదు. గుంతకల్లులో మధుసూదన్‌గుప్తా ఎంపీ ఓటు తమకు వేయించారనే ధీమాలో జేసీ వర్గం ఉంది. కానీ గుప్తా సహకరించలేదని తెలుస్తోంది. పైగా పార్లమెంట్‌ పరిధిలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలిచే పరిస్థితి ఉంది. దీనికి తోడు టీడీపీలోని ‘హార్డ్‌కోర్‌ బోయ ఓటర్లు’ ఎమ్మెల్యేగా టీడీపీకి ఓటు వేసినా, ఎంపీకి ‘మా వాడు’ అని రంగయ్యకు ఓటేశారు. ఇదే తరహా ఓటింగ్‌ ‘పురం’ పరిధిలో జరిగింది. మాధవ్‌ పోటీతో కురబ సామాజికవర్గం మెజార్టీగా వైఎస్సార్‌సీపీ పక్షాన నిలిచింది. పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, హిందూపురం లాంటి నియోజకవర్గాల్లో టీడీపీకి ఓటేసిన వారు కూడా ఎంపీకి మాధవ్‌కు ఓటేసినట్లు ప్రచారం నడుస్తోంది. టీడీపీ తరఫున ప్రచారం చేసిన కొంతమంది క్రియాశీల కార్యకర్తలు సైతం ఎంపీగా మాధవ్‌కు ఓటేసినట్లు సమాచారం. దీనికి తోడు ‘పురం’ పార్లమెంట్‌ పరిధిలో 5 అసెంబ్లీల్లో వైఎస్సార్‌సీపీ గెలిచే పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఎంపీ కూడా ఆ పార్టీ ఖాతాలో చేరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ మేరకు ఎంపీ స్థానాలపైనా భారీగా బెట్టింగ్‌ నడుస్తోంది. బెట్టింగ్‌కు సిద్ధమయ్యే వారు మధ్యవర్తి వద్ద డబ్బులు ఉంచుతున్నారు. గెలిచిన తర్వాత మధ్యవర్తి 10శాతం కమీషన్‌ తీసుకుని తక్కిన 90శాతం ఇచ్చేలా ఒప్పందం చేసుకుని బెట్టింగ్‌ కాస్తున్నారు. ఎక్కువగా రియల్‌ ఎస్టేట్, బంగారం వ్యాపారం చేసే వారితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా బెట్టింగ్‌ కాస్తున్నారు. ఐదు రోజుల నుంచి బెట్టింగ్‌ హడావుడి ఊపందుకుంది. అయితే ఈ వేడి మరో 30 రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కౌంటింగ్‌ సమయానికి జిల్లాలో వంద కోట్లకు పైగా బెట్టింగ్‌ జరగొచ్చని అంచనా.

అనంతపురంలో 1@5 లెక్కన బెట్టింగ్‌
అనంతపురంలో అనంత వెంకట్రామిరెడ్డి గెలుస్తారని బెట్టింగ్‌కు ఆహ్వానిస్తే టీడీపీ తరఫున ఎవ్వరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో టీడీపీ గెలుస్తుందనే ధీమా ఉన్నవారు 1ః5 లెక్కన బెట్టింగ్‌కు సిద్ధపడుతున్నారు. ‘అనంత’ గెలిస్తే లక్షన్నరకు లక్ష, చౌదరి గెలిస్తే లక్షన్నరకు లక్ష చొప్పున ఇస్తామని పందెం కాస్తున్నారు. శింగనమల, గుంతకల్లు, పుట్టపర్తి, కదిరిలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగానే పందెం నడుస్తోంది. ఇక్కడ మెజార్టీపై పందెం జరుగుతోంది. కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిరతో పాటు జిల్లా వ్యాప్తంగా రూ.60కోట్ల మేర బెట్టింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు