సిక్కోలు, విజయనగరం, విశాఖ ప్రజలకు విజ్ఞప్తి

3 May, 2019 10:29 IST|Sakshi

సాక్షి, విశాఖ : ఫొని తుపాను ఆంధ్రప్రదేశ్‌ను దాటినా... దాని ప్రభావం మాత్రం భారీగానే ఉంది. తుపాను ప్రభావంతో మూడు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, విద్యుత్‌ వైర్లు ఎక్కడివక్కడ తెగిపడ్డాయి. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార‍్మర్లు కూడా పడిపోవడంతో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రాజ బాపయ్య విజ‍్ఞప్తి చేశారు. విద్యుత్‌ సరఫరా, పునరుద్దరణకు సంబంధించి టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1912, కమాండ్‌ కంట్రాలో సెంటర్ల నంబర్ల (శ్రీకాకుళం 9490612633, విజయనగరం  9490610102, విశాఖపట్నం 7382299975, ఏపీఈపీడీసీఎల్‌ కార్పొరేట్ ఆఫీస్ 0891 2853854)కు, సంబంధిత సెక్షన్‌ (ఏఈ) కార్యాలయాలకు తెలియచేయాలని ఆయన కోరారు. మరోవైపు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.  అలాగే తుపాను సమస్యలపై 1100కు కాల్ చేయవచ్చని ఆర్టీజీఎస్‌ సూచించింది.

విజయనగరం జిల్లాలో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 70 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. తీర ప్రాంతాల్లో ఉన్న ఆరు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు 2 వేల మందికి భోజనం, వసతి సౌకర్యాలు కల్పించారు. 

ఇక శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రానికి ఈదురు గాలులు మరింత ఉధృతమయ్యాయి. తుపాను తీరం దాటిన తర్వాత గంటకు 160 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన గాలులు, భారీ వర్షాలు నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 11 విమానాలను తుపాను ప్రభావం వల్ల ఈదురు గాలులు, వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేశారు. ఒక విమానాన్ని దారి మళ్లించారు. ప్రయాణికులతో సందడిగా ఉండే విశాఖ విమానాశ్రయం బోసిపోయింది. ఇక్కడి నుంచి 28 విమానాలు రాకపోకలు సాగించాల్సి ఉండగా 11 ఇండిగో విమానాలు రద్దయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఫొని తుపాను ప్రభావంతో విశాఖ రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు విశాఖ రైల్వేస్టేషన్‌లో పడిగాపులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు