తిరుపతి: ఎన్నికల విధుల్లో జాగ్రత్త

18 May, 2019 12:47 IST|Sakshi

పీఓల పొరబాట్ల వల్లే రీపోలింగ్‌

జిల్లా ఎన్నికల అధికారి పీఎస్‌. ప్రద్యుమ్న

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌ : గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రిసైడింగ్‌ అధికారుల పొరబాట్ల వల్లే రీపోలింగ్‌కు ఆస్కారం ఏర్పడిందని జిల్లా ఎన్నికల అధికారి పీఎస్‌ ప్రద్యుమ్న  అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఆదివారం ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహించే రీపోలింగ్‌ అధికారులు, సిబ్బందికి స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. రీపోలింగ్‌లో తప్పిదాలకు ఆస్కారం లేకుండా, అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు.

తప్పు జరిగితే ఎన్నికల కమిషన్‌ ఉపేక్షించదన్నారు. ఈవీఎంల సీరియల్‌ నంబర్లు సరిచూసుకోవడం, మాక్‌పోలింగ్, అనంతరం క్లియర్‌ చేయడం, భద్రపరిచే విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రీపోలింగ్‌ కేంద్రంలో డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారులను నియమిస్తున్నామని తెలిపారు. స్థానిక పోలింగ్‌ కేంద్రంలోని ఓటర్లను మాత్రమే ఏజెంట్లుగా పరిగణలోకి తీసుకోవాలని ఆయన పీఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఆర్‌ఓ డాక్టర్‌ మహేష్‌కుమార్, ఏఆర్‌ఓ హరికుమార్, ప్రిసైడింగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు