'చంద్రబాబు పట్ల అప్రమత్తంగా ఉండాలి'

22 Jul, 2014 12:45 IST|Sakshi
'చంద్రబాబు పట్ల అప్రమత్తంగా ఉండాలి'

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఎంసెట్ కౌన్సిలింగ్పై చంద్రబాబు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగదీష్ రెడ్డి మంగళవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులను మోసం చేస్తున్న చరిత్ర చంద్రబాబుది అన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ఆలస్యానికి బాబే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పట్ల అప్రమత్తంగా ఉండాలని జగదీష్ రెడ్డి సూచించారు. రుణమాఫీ సాధ్యం కాదని ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు చెప్పినా... తాను ఆర్థిక నిపుణుడని చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలపై ఆ రాష్ట్ర జనాలు నిలదీస్తారనే భయంతోనే బాబు తెలంగాణపై అకారణంగా నిందలు వేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తారో లేదో ముందు చంద్రబాబు తేల్చాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

విద్యార్థుల స్థానికతను చంద్రబాబు ఎలా నిర్ణయిస్తారని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణలో స్థానికతపై  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవసరమేంటని అడిగారు. తాము ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకాన్ని కొనసాగించడం లేదనిచ ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తామని జగదీష్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. పేద విద్యార్థులను ఎలా ఆదుకోవాలో తమకు స్పష్టత ఉందన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకు తమ ప్రభుత్వం ఏ పోరాటానికైనా సిద్ధమని తేల్చిచెప్పారు. తమ హక్కులు, భూములు, ఉద్యోగ అవకాశాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని జగదీష్ రెడ్డి అన్నారు. తమ హక్కుల పరిరక్షణ ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు.
 

మరిన్ని వార్తలు