‘బెజవాడ బార్’ కార్యవర్గం ఎన్నిక

1 Apr, 2015 01:08 IST|Sakshi
‘బెజవాడ బార్’ కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షుడిగా జగదీష్ గెలుపు
 
తీవ్ర ఉత్కంఠ నడుమ బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) ఎన్నికలు మంగళవారం ఉదయం జరిగాయి. బీబీఏ అధ్యక్షుడిగా చిత్తర్వు శివవెంకట జగదీశ్వరరావు(జగదీష్) ఘన విజయం సాధించారు. రాత్రి వెల్లడించిన ఫలితాల్లో ప్రారంభం నుంచి జగదీష్ ఆధిక్యత కనబరిచారు. 3,250 మంది పైచిలుకు న్యాయవాదులున్న బీబీఏలో 1,987 మంది మాత్రమే ఓటు వేసేందుకు అర్హత పొందారు. 1,500 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
 
విజయవాడ లీగల్ : ప్రతిష్టాత్మకంగా జరిగే బెజవాడ బార్ అసోసియేషన్(బీబీఏ)ఎన్నికలు మంగళవారం జరిగాయి. 3,250 మంది పైచిలుకు న్యాయవాదులున్న బీబీఏలో 1,987 మంది మాత్రమే ఓటు వేసేందుకు అర్హత పొందారు. 1,500 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీబీఏ అధ్యక్షుడిగా చిత్తర్వు శివ వెంకట జగదీశ్వరరావు(జగదీష్)తన సమీప అభ్యర్థులపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభ దశ నుంచే జగదీష్ ఆధిక్యత ప్రదర్శించారు. అధ్యక్ష పదవి కోసం చాలా రోజులుగా ఆయన కష్ట పడ్డారని పలువురు న్యాయవాదులు చర్చించుకుంటున్నారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే 2015-2016 సంవత్సరానికి అధ్యక్షుడిగా గెలుపొందిన జగదీష్‌ను అధ్యక్షస్థానంలో కూర్చో బెట్టారు. జగదీష్ నగరంలో గల సిద్ధార్థ న్యాయకళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1992లో ఏపీబార్ కౌన్సిల్ సభ్యత్వాన్ని పొంది సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహన రావు వద్ద శిష్యరికం చేశారు. 2006-2007లో బీబీఏకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా హోరాహోరిగా సాగిన ఓటింగ్‌లోతన సమీప అభ్యర్థిపై కె.జగజ్జీవన్‌రావు  గెలు పొందారు.అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవికి తొలి మహిళ బోను జయమ్మ ఎన్నికయ్యారు. కార్యదర్శి పదవికి కె.కోటేశ్వర రావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్  సెక్రటరీగా వై.పుల్లా రెడ్డి విజయం సాధించారు.

మహిళా కార్యదర్శిగా మహాలక్ష్మి ఎన్నిక

బీబీఏలో మహిళా కార్యదర్శి పదవికి కొనకళ్ళ మహాలక్ష్మి తన సమీప అభ్యర్థిపై 116 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈమె కానూరు సిద్ధార్థ న్యాయకళాశాలలో బీఎల్ పూర్తి చేశారు. 2006లో ఎ.పి.బార్ కౌన్సిల్‌లో సభ్యత్వం పొందారు. సీనియర్ న్యాయవాదులు కె.జయప్రభ, పి.శ్రీదేవి, ఎస్.కె.ఖాదిర్‌ల వద్ద శిష్యరికం చేశారు. మహాలక్ష్మి గెలుపుపై మహిళా న్యాయవాదులు మదుమాల హెప్సి, గంగా భవాని,ఎస్.సునీతా దాస్, పద్మజ, సంద్య తదితరులు హర్షం ప్రకటించారు.

ఏకగ్రీవంగా కోశాధికారి, లైబ్రేరియన్‌ల ఎన్నిక

బీబీఏ కోశాధికారిగా ఆకుల మధు బాబు,లైబ్రేరియన్‌గా జ.వి.సుబ్బారావులు ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు చీఫ్ ఎన్నికల అధికారి డి.పి.రామకృష్ణ తెలిపారు.

ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్లు

బీబీఏకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో  సీనియర్ న్యాయవాదులు కర్నాటి రామ్మోహన రావు, బీబీఊ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంపర దుర్గశ్రీనివాసరావు, వజ్జే వెంకట రవి కుమార్ ఓటు వేశారు. పూనూరు గౌతంరెడ్డిలతో పాటు న్యాయవాది, స్థానిక 21వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
 

మరిన్ని వార్తలు